breaking news
Cafe Niloufer Chai
-
HYD: ఏమి‘టీ’.. కప్పు చాయ్ రూ. 1,000.. నిజమేనా?
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఇరానీ చాయ్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాతబస్తీలో లభించే ఇరానీ చాయ్ రుచి దేనికీ రాదు. ఎవరైనా ఒక్క కప్పు తాగితే వన్స్‌మోర్ అనాల్సిందే. దీని ధర సాధారణ కేఫ్‌లలో రూ. 20 వరకు ఉంటే కాస్త పెద్ద హోటల్లో రూ. 50 దాకా ఉండొచ్చు. అదే ఫైవ్‌స్టార్ హోటల్లో సుమారు రూ. 200 పలకొచ్చు. కానీ నగరంలోని ప్రఖ్యాత నిలోఫర్ కేఫ్‌లో లభిస్తున్న ఓ ప్రత్యేకమైన చాయ్ ధర అక్షరాలా రూ. వెయ్యి పలుకుతోంది! ఏమి‘టీ’ అంత ధరా అని ఆశ్చర్యపోతున్నారా? ధరకు తగ్గట్టే దాని రుచి కూడా అమోఘంగా ఉంటుందట. అందుకే భారీ ధర ఉన్నప్పటికీ దాని డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉందట. అరుదైన రకం... క్లిష్టమైన సేకరణ ప్రక్రియ మనోహరీ గోల్డ్ రకానికి చెందిన అరుదైన ‘గోల్డెన్ టిప్స్’ చాయ్ పేరుకు తగ్గట్లే ముదురు బంగారు వర్ణంలో ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి వేసే చాయ్ పత్తా అత్యంత ఖరీదైనదని కాబట్టే దీని ధర సైతం ఆ స్థాయిలో పలుకుతుంది. చలికాలమంతా ఈ రకం మొక్కలు నిద్రాణస్థితిలో ఉన్నప్పటికీ నేల నుంచి అధిక పోషకాలను గ్రహిస్తూ వసంత కాలం మొదలవగానే మొగ్గతొడుగుతాయి. ఈ క్రమంలో పోషకాలను ఎక్కువగా తొలుత ఏర్పడే మొగ్గల్లో నిక్షిప్తం చేస్తాయి. ఈ మొగ్గల్లో కెఫీన్‌తోపాటు అధిక మోతాదులో విటమిన్లు ఏ, బీ, సీ, ఈ, కే, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఎల్–థియనైన్ అనే అమైనో యాసిడ్ సైతం ఉంటుంది. ఆయా మొగ్గలు సూర్యకాంతి తగిలి ఆకులుగా విచ్చుకొనేలోగానే (విచ్చుకుంటే ఆకుల రుచి, సువాసన మారుతుంది) తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోగా వాటిని తెంపి వెంటనే పొడి చేసే ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దిగుబడి ఏటా కొన్ని కిలోలే... ఏటా ఒకసారే సాగు చేసే ఈ తోటల్లోని ఒక్కో మొక్క నుంచి వచ్చే మొట్టమొదటి మొగ్గలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన మొత్తం తోటలోంచి సుమారు ఒకటిన్నర కిలోల మొగ్గలు మాత్రమే లభిస్తాయి. అందుకే వాటి నుంచి తయారు చేసే పొడికి అత్యధిక ధర లభిస్తుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన టీపొడిగా దీనికి గుర్తింపు ఉంది. పైగా ఈ చాయ్ పొడిని వేలంలోనే దక్కించుకోవాలి. ఇటీవల కోల్‌కతాలో నిర్వహించిన వేలంలో కిలో టీ పొడిని రూ. 1,15,000 రికార్డు ధరకు నిలోఫర్ కేఫ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. టీలో పాలు కలపం.. ప్రత్యేకమైన ఈ టీలో పాలు కలపం. డికాషన్రూపంలో తాగితేనే దీని రుచి తెలుస్తుంది. ఈ టీ తాగే వారు అద్భుతమైన అనుభూతికి లోనవుతారు. దీని రుచి వేరే టీలకు రాదు. ఒక కప్పు టీలో కేవలం 4 గ్రాముల పొడినే కలుపుతాం. బంజారాహిల్స్, హిమాయత్నగర్లతోపాటు లక్డీకాపూల్‌లోని కొత్త కేఫ్‌లో ఈ చాయ్‌ను మా మెనూలో తిరిగి ప్రవేశపెట్టాం. చాయ్ ప్రేమికుల నుంచి స్పందన బాగుంది. – బాబూరావు, కేఫ్ నిలోఫర్ యజమాని -
రాహుల్ గాంధీ లంచ్.. ప్యారడైజ్ బిర్యానీ.. నీలోఫర్ చాయ్!
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ గురించి విస్తృతంగా చర్చ జరిగేలా ప్రచారం చేయాలని సూచించారు.సుమారు రెండు గంటల పాటు గాంధీభవన్‌లో గడిపిన రాహుల్ గాంధీ చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరినీ పలకరిస్తూ, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 1:53 గంటలకు రాహుల్ గాంధీభవన్‌కు వచ్చారు. తొలిసారి వచ్చిన ఆయనకు పూలదండలు వేసి, వేద పండితుల ఆశీర్వచనం మధ్య ఘనంగా స్వాగతించారు. చదవండి👉🏼 కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్? రాహుల్ తొలుత ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగోని దయాకర్‌గౌడ్‌లతో మాట్లాడారు. తర్వాత తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రతినిధులు బి.వేణుగోపాల్‌రెడ్డి, మధు తదితరులు తెలంగాణలో సమస్యలపై రాహుల్‌కు ఒక నివేదిక ఇచ్చారు. విస్తృతస్థాయి సమావేశం అనంతరం పార్టీ సభ్వత్య నమోదులో క్రియాశీలంగా పనిచేసిన వారితో రాహుల్ ఫోటోలు దిగారు. గాంధీభవన్‌లో 35 ఏళ్లుగా స్వీపర్ పనిచేస్తున్న యాదమ్మను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాహుల్‌కు పరిచయం చేశారు. రాహుల్ ఆమెతో సెల్ఫీ దిగారు. ప్యారడైజ్ బిర్యానీ.. నీలోఫర్ చాయ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీని ఆస్వాదించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆయన ప్రత్యేకంగా ప్యారడైజ్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీని కోక్ తాగుతూ తిన్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. తర్వాత పేస్ట్రీ (కేక్) తిన్న రాహుల్.. కొంతసేపటి తర్వాత నీలోఫర్ కేఫ్ నుంచి తెచ్చిన చాయ్‌ను రుచి చూశారు. అంతకుముందు జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ హైదరాబాద్ బిర్యానీ, చాయ్ బాగుంటాయని ప్రస్తావించారు. దీంతో నేతలు వెంటనే ఈ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. చదవండి👉🏻 రాహుల్ సభ సక్సెస్.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం