బిజీ లైఫ్ సిండ్రోమ్
మెడిక్షనరీ
మీరు ఏదో పని చేయాలని పక్క గదిలోకి వచ్చారు. కానీ ఏదో ఆలోచించుకుంటూ వచ్చారు. కానీ పక్క గదిలోకి వెళ్లే సమయానికి ఎందుకు వెళ్లారో మరచిపోయారు. ఏదో ఒకసారి ఇలా జరిగితే పర్లేదు. కానీ ఇదే మాటిమాటికీ జరుగుతుంటే మాత్రం కాస్త పట్టించుకోవాల్సిందే. ఇది ఒక రుగ్మత. దీని పేరు ‘బిజీ లైఫ్ సిండ్రోమ్’. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒక్కోసారి మీరు మీ డెబిట్ కార్డు పిన్ నెంబరు కూడా మరచిపోవచ్చు.
మీకు ఇష్టమైన బంధువుల, మిత్రుల పేర్లు స్ఫురణకు రాకపోవచ్చు. మనం వాహనాన్ని పార్క్ చేసిన చోటిని మరచిపోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, మనసుకు ఆహ్లాదం కలిగించే పనులు.. అంటే డ్రాయింగ్ వేయడం, డాన్స్ చేయడం వంటి ఇష్టమైన వ్యాపకాలను చేయడం, స్నేహితులతో కాసేపు గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి కార్యకలాపాలతోనే ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ ఇది మీ రోజువారీ దినచర్యలో సమస్యలను సృష్టిస్తుంటే మాత్రం డాక్టర్ను సంప్రదించాలి.