breaking news
the bronze medal
-
కాంస్యంతో ముగించారు
జపాన్‌పై భారత మహిళల హాకీ జట్టు గెలుపు ఇంచియాన్: తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జపాన్ జట్టుపై సంచలన విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2-1 గోల్స్ తేడాతో జపాన్ను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున జస్ప్రీత్ కౌర్ (23వ నిమిషంలో), వందన కటారియా (42వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... జపాన్ జట్టుకు అకెన్ షిబాటా (41వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించింది. తాజా విజయంతో భారత్ 2010 గ్వాంగ్జౌ క్రీడల కాంస్య పతక పోరులో జపాన్ చేతిలోనే ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టుకిది మూడో కాంస్యం కావడం విశేషం. గతంలో 1986 సియోల్, 2006 దోహా ఆసియా క్రీడల్లో టీమిండియాకు మూడో స్థానం దక్కగా... 1982 ఢిల్లీ క్రీడల్లో మాత్రం స్వర్ణం లభించింది. -
కాంస్యం నెగ్గిన హిందూజ
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన తెలంగాణ రాష్ట్ర చెస్ క్రీడాకారిణి హిందూజ రెడ్డి జాతీయ మహిళల చాలెంజర్స్ ‘బి’ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. గోవాలో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హిందూజ రెడ్డి 8.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా హిందూజ ఎనిమిది గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయింది. చివరి రౌండ్లో తెల్లపావులతో ఆడిన హిందూజ 64 ఎత్తుల్లో ఏజీ నిమ్మీ (కేరళ)పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొడ్డ ప్రత్యూష 8 పాయింట్లతో ఏడో స్థానంలో, లక్ష్మీ ప్రణీత 7.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, జి.లాస్య 7.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. తొమ్మిది మంది క్రీడాకారిణులు 7.5 పాయింట్లు సాధించగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తుది ర్యాంక్‌లను ఖరారు చేశారు. నిషా మొహతా (పీఎస్‌పీబీ), విజయలక్ష్మి (ఎయిరిండియా) 9.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నిషా మొహతాకు టైటిల్ లభించింది. విజయలక్ష్మీ రన్నరప్‌గా నిలిచింది.