విషాదం.. ‘సీఐడీ’ సిరీస్ డైరెక్టర్ కన్నుమూత
సాక్షి, ముంబై: చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ ‘సీఐడీ’ (CID) సృష్టికర్త, దర్శకుడు, నిర్మాత బ్రిజేంద్రపాల్ సింగ్ (77) కన్నుమూశారు. బి.పి. సింగ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన మృతితో టెలివిజన్ పరిశ్రమలో విషాదం నెలకొంది.బ్రిజేంద్రపాల్ సింగ్ భారత టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందించిన ‘సీఐడీ’ సిరీస్ ఆయనకు విశేషమైన పేరును తీసుకొచ్చింది. 1998లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో నేర పరిశోధనలు, ఉత్కంఠభరితమైన కథనాలు, అనూహ్యమైన మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సిరీస్‌లోని ఏసీపీ ప్రద్యుమ్న, దయా, అభిజీత్ వంటి పాత్రలు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాయి. ఎన్నో ఏళ్లపాటు కొనసాగిన ఈ కార్యక్రమం భారత టెలివిజన్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రసారమైన క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించడంతో పాటు, బి.పి. సింగ్ అప్పుడప్పుడు డీసీపీ శంషేర్ సింగ్ చిత్రోలే పాత్రలోనూ కనిపించారు.క్రైమ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా హారర్ కథలతోనూ బి.పి. సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన రూపొందించిన ‘ఆహట్’ హారర్ సిరీస్ 1995 నుంచి 2015 వరకు వివిధ దశల్లో ప్రసారమైంది. భయానక ఘటనలు, ఉత్కంఠభరితమైన కథనాలతో ఈ కార్యక్రమం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ సంపాదించుకుంది.‘సీఐడీ’, ‘ఆహట్’ వంటి కార్యక్రమాల ద్వారా క్రైమ్, థ్రిల్లర్, హారర్ జానర్లలో భారత టెలివిజన్‌కు ఆయన విశేషమైన సేవలందించారు. టెలివిజన్ ప్రేక్షకులకు ఎన్నో ఏళ్లపాటు వినోదాన్ని అందించిన ఆయన, తన సృజనాత్మకతతో ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన మరణం భారత టెలివిజన్ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashoke Pandit (@ashokepandit1)