పురుషుల్లో రొమ్ము క్యాన్సర్...
సాధారణంగా రొమ్ముక్యాన్సర్ అన్నది పురుషులకు రాదని ఒక అపోహ. ఇది అరుదైన వ్యాధే అయినా పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అయితే సమాజంలో దీనిపై అంతగా అవగాహన లేదు. కారణం... పురుషుల్లో అది వచ్చేందుకు ఆస్కారమే లేదన్న భావన. కానీ 10000 మందిలో ఐదుగురికి వచ్చే ఆస్కారం ఉంది. పురుషుల్లో వచ్చే రొమ్ము కాన్సర్పై అవగాహన కోసం ఈ కథనం.
మనందరిలో ఉండే సాధారణ అభిప్రాయం ప్రకారం మహిళల్లోనే బ్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు పురుషుల్లో ఇది ఎందుకు వస్తుంది. ఎందుకంటే... పాలిచ్చి పెంచేది తల్లి కాబట్టి ఒక దశ తర్వాత హార్మోన్ల కారణంగా మహిళల్లో బ్రెస్ట్ అభివృద్ధి జరుగుతుంది. కానీ భవిష్యత్తులో రొమ్ముగా అభివృద్ధి చెందాల్సిన కణజాలం మాత్రం చిన్నప్పుడు స్త్రీపురుషులిరువురిలోనూ ఉంటుంది.
పురుషుల్లోనూ రొమ్ము సమస్యలుంటాయా?
రొమ్ముకు సంబంధించిన సమస్యలు పురుషుల్లో ఉండవనేది సాధారణ అభిప్రాయం. కానీ రొమ్ముకు సంబంధించిన అనేక సమస్యలు పురుషుల్లోనూ కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మహిళల్లోలాగే పురుషుల్లోనూ క్యాన్సర్‌కు సంబంధించని హానికరం కాని (బినైన్) గడ్డలు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో దీనికి ఎలాంటి చికిత్సా అవసరం లేకపోయినా, కొన్ని సందర్భాల్లో చిన్న శస్త్రచికిత్సతో దాన్ని సరిచేయవచ్చు. కొంతమంది పురుషుల్లో... మహిళల్లోలాగే రొమ్ము పెరగడం కనిపిస్తుంది. దీన్నే ‘గైనకోమాస్టియా’ అంటారు. ఈ కండిషన్ ఉన్న పురుషుల్లో సాధారణం కంటే రొమ్ములు కాస్త ఎత్తుగా కనిపిస్తుండటంతో ఆత్మన్యూనతకు గురవుతుంటారు. రొమ్ముక్యాన్సర్‌లో లాగే... గైనకోమాస్టియాలోనూ నిపుల్ కింద ఒక బటన్‌లా కండ అభివృద్ధి చెందుతుంది. అయితే అది క్యాన్సర్‌కు సంబంధించిందా లేక హానికరం కాని సాధారణ కండా అన్నది డాక్టర్లు తేలిగ్గా గుర్తిస్తారు. గైనకోమాస్టియా సమస్య సాధారణంగా యుక్తవయసులోకి ప్రవేశిస్తున్న సమయంలో యువకుల్లో ఎక్కువ.
ఆ సమయంలో వారిలో మహిళలకు సంబంధించిన హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ స్రవించడం వల్ల ఈ కండిషన్ అభివృద్ధి అవుతుంది. నిజానికి పురుషులందరిలోనూ ఆ సమయంలో ఈస్ట్రోజెన్ స్రవించినా... అది రొమ్ముల పెరుగుదలను ప్రేరేపించేంతగా ఉండదు. కానీ కొందరిలో ఊబకాయం ఉంటుంది. వారిలో ఈస్ట్రోజెన్ పెరిగి అది కూడా పురుషుల్లో రొమ్ముల పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే అల్సర్లను తగ్గించేవి, ఛాతీలో మంటను ఉపశమింపజేసేవి, బీపీకి, గుండెజబ్బులకు వాడే కొన్ని మందులు వాడకం కూడా పురుషుల్లో రొమ్ముల పెరుగుదలకు దారితీయవచ్చు. ఈ తరహా రొమ్ము పెరుగుదల పురుషుల్లో ఎలాంటి తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీయదు. అయితే... క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ అనే ఒకింత అరుదైన జన్యుసంబంధిత వ్యాధిలో పెరిగే పురుషుల రొమ్ము విషయంలో మాత్రం అది రొమ్ముక్యాన్సర్గా పరిణమించే రిస్క్ కాస్తంత ఎక్కువ.
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎవరిలో ఎక్కువ...
సాధారణంగా పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ అరుదుగా వచ్చేదే అయినా... 35 ఏళ్లు దాటని వారిలో కనిపించడం మాత్రం మరీ అరుదు. చాలా సాధారణంగా అది 60 - 70 ఏళ్ల వయసులో ఉన్న పురుషుల్లో ఎక్కువగా కనిసిస్తుంటుంది. మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌కు కారణాలు నిర్దిష్టంగా తెలిసినట్లుగా, పురుషుల్లో తెలియవు. అయితే కొన్ని వాతావరణ ప్రభావాలు, కొంత జన్యుపరమైన అంశాలు పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని ప్రస్తుత అధ్యయనాల వల్ల తెలుస్తోంది. ఇక మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రవించడం చాలా తక్కువ అన్న విషయం తెలిసిందే. అయితే కొందరిలో కొన్ని తెలియని కారణాలతో సాధారణ స్థాయికంటే ఈస్ట్రోజెన్ స్రావం మరింత ఎక్కువగా జరుగుతుంది. ఇది రొమ్ముక్యాన్సర్‌కు ఒక కారణం కావచ్చనేది కొన్ని అధ్యయనాల వల్ల తేలింది. అయితే ఈ అంశాన్ని గైనకోమాస్టియాతో ముడిపెట్టకూడదు. గైనకోమాస్టియా అన్నది ఎలాంటి ప్రాణాపాయం లేని సాధారణ కండిషన్. ఇందులో కేవలం రొమ్ము పెరుగుదల కాస్మటిక్‌గా మాత్రమే ఇబ్బందికరం. పురుషుల్లో ఈస్ట్రోజెన్ పెరుగుదల ఉన్నప్పుడు కనిపించే రొమ్ముక్యాన్సర్ చాలా అరుదు అని మాత్రం గుర్తుంచుకోవాలి.
పురుషుల్లో రొమ్ముక్యాన్సర్‌కు కారణాలు
ఛాతీ ఎక్స్-రేలు ఎక్కువసార్లు తీయించుకున్న మెడికల్ హిస్టరీ.
ఊబకాయం ఎక్కువ ఉండి, ఈస్ట్రోజెన్ స్రావం పెరిగి ఉన్న మెడికల్ హిస్టరీతో... రొమ్ముపెరుగుదలకు దోహదపడే కొన్నిరకాల మందులను చాలా దీర్ఘకాలం వాడటం.
క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్
తీవ్రమైన కాలేయ వ్యాధులు, సిర్రోసిస్ (అదుపు లేకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే సిర్రోసిస్తోపాటు వైరల్ హెపటైటిస్ కూడా రొమ్ముక్యాన్సర్‌కు కారణం కావచ్చు).
ఊ వృషణాలకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు ఉదాహరణకు మంప్స్ ఆర్కయిటిస్, వృషణాలకు దెబ్బతగలడం వల్ల తీవ్రంగా గాయపడటం.
కొందరిలో పిల్లాడు పుట్టిన వెంటనే వృషణాల సంచిలోకి రావాల్సిన వృషణాలు కిందికి దిగకుండా కడుపులోనే ఉండిపోతాయి. ఆ కండిషన్‌ను అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇది కూడా క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
కుటుంబంలో పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ చరిత్ర ఉండటం కూడా రొమ్ముక్యాన్సర్‌కు ఒక కారణం కావచ్చు.
పురుషుల్లో రొమ్ముక్యాన్సర్... మహిళల్లో కంటే తీవ్రమా...?
పురుషుల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్... మహిళల్లో కంటే తీవ్రమైనది ఇప్పటివరకూ డాక్టర్లు సైతం భావించేవారు. కానీ దీనిపై పరిశోధనలు కొనసాగుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో భావించినట్లుగా స్త్రీల కంటే ఇది తీవ్రమైనది కాదన్నది కొత్త పరిశోధనలు చెబుతున్న సత్యం. కాకపోతే దాన్ని ముందుగా కనుక్కోవడం అన్నది చాలా ముఖ్యం. అప్పుడు చికిత్సానంతర ఫలితాలు స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఒకేలా ఉంటాయన్నది ఇప్పుడు డాక్టర్లు ఇస్తున్న భరోసా.
పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ లక్షణాలు...
సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌లో క్యాన్సర్ గడ్డ గట్టి
(ఫర్మ్)గా, ఒక గడ్డ (లంప్) మాదిరిగా నిపుల్ కింద ఉంటుంది. సాధారణంగా ఇందులో నొప్పి ఉండదు.
కొందరిలో నిపుల్ భాగంలో అంతకు ముందు ఉన్న రంగులో మార్పు కనిపిస్తుంది. దాంతోపాటు నిపుల్లో మరికొన్ని గమనించ మార్పులు సైతం కనిపించవచ్చు. ఉదాహరణకు... నిపుల్ భాగం పుండులా కనిపించడం (అల్సరేషన్), అక్కడ గుంటలా పడటం (డింప్లింగ్), ఎర్రబారి పొలుసులు పొలుసులుగా కనిపించడం (స్కేలింగ్), నిపుల్ లోపలి వైపునకు తిరిగినట్లుగా (రిట్రాక్షన్) అనిపించవచ్చు .
రొమ్ముభాగం నుంచి రక్తస్రావం. కొందరిలో అది రక్తంలా కాకుండా పారదర్శకంగా లేని (ఒపాక్) సాంద్రమైన స్రావంలా ఉండవచ్చు. ఈ లక్షణం ఉన్నవారిలో సైతం చాలా అరుదుగా (ఒక శాతం కంటే తక్కువ మందిలో) ఈ స్రావాలు రెండువైపులా (ఇరు రొమ్ముల్లోనూ) కనిపించవచ్చు.
పై లక్షణాలతోపాటు ఇరువైపులా ఉండే బాహుమూలాల్లో దేనిలోనైనా గడ్డ (లంప్) కనిపించవచ్చు.
ఊ సాధారణంగా క్యాన్సర్‌కు పాకే లక్షణం ఉంటుందన్న విషయం తెలిసిందే. అది ఆవిర్భవించిన చోటు నుంచి వేరే అవయవాలకు పాకడాన్ని మెటస్టాటిస్ అంటారు. ఒకవేళ అది రొమ్ము నుంచి సమీపంలోని ఎముకలకు పాకితే... ఆ ఎముకల్లో నొప్పి కనిపిస్తుంది.
ఇక అన్ని రొమ్ముక్యాన్సర్ల మాదిరిగానే ఇందులోనూ నీరసం, బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఒకవేళ అది రొమ్ముకే పరిమితం కాకుండా పక్క అవయవాలకు పాకితే... అది విస్తరించిన అవయవాన్ని బట్టి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు.
చికిత్స: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ విషయంలోలాగే, పురుషుల రొమ్ము క్యాన్సర్‌నూ అది ఉన్న దశ ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. సాధారణం చికిత్స విషయంలో మహిళల, పురుషుల రొమ్ముక్యాన్సర్లలో తేడా ఉండదు.
శస్త్రచికిత్స: ఒకవేళ పురుషుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లు తేలితే... ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. ఛాతీలోని రొమ్ముభాగాన్ని, దాని పొరలను (లైనింగ్‌లను) తొలగించే ప్రక్రియను రాడికల్ మాసెక్టమీ అంటారు.
ఇతర థెరపీలు: సాధారణంగా శస్త్రచికిత్స తర్వాత చేయాల్సిన ఇతర థెరపీలు (అడ్జువెంట్ థెరపీ) చేస్తుంటారు. ఇవి మందుల ద్వారా చేసే కీమోథెరపీ, రేడియేషన్ ద్వారా క్యాన్సర్ కణాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని కాల్చివేసే రేడియోథెరపీ, నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను మాత్రమే తుదముట్టించే టార్గెటెడ్ థెరపీ, అవసరాన్ని బట్టి హార్మోన్ థెరపీ వంటివి చేస్తారు. ఒకవేళ అప్పటికే క్యాన్సర్ పక్క అవయవాలకూ పాకితే (మెటాస్టాటిస్ దశకు చేరితే) అప్పుడు కీమోథెరపీతో పాటు, హార్మోన్ థెరపీ... ఈ రెండూ ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగాక మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే కొత్తరకాల మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
నయమయ్యే అవకాశాలు (ప్రోగ్నోసిస్)
పూర్తిగా నయమయ్యే అవకాశం అన్నది క్యాన్సర్‌ను ఏ దశలో గుర్తించారన్న అంశంతో పాటు అది ఏ తరహాకు చెందినది అనే దానిపై కూడా ఆధాపడి ఉంటుంది. ఇక దాంతోపాటు రోగి వయసు కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది.
- నిర్వహణ: యాసీన్
రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు...
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు సైతం... మహిళల్లో నిర్వహించే పరీక్షలనే చేస్తారు.
ఊ తొలుత బాహ్యలక్షణాలను, కుటుంబ, ఆరోగ్యచరిత్రలను చూస్తారు. లంప్‌ను పరీక్షించడం, దాన్ని స్పర్శించడం ద్వారా అది ఏమైనా అసాధారణంగా కనిపిస్తుందా, అనారోగ్యాలను కల్పిస్తుందా అన్న అంశాలను పేషెంట్‌ను అడిగి తెలుసుకుంటారు.
క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్ (సీబీఈ): రొమ్ము, ఆ పరిసర ప్రాంతాల్లో గడ్డను శ్రద్ధంగా పరిశీలిస్తూ... అసాధారణ అంశాలు ఏవైనా ఉన్నాయేమో చూడటం ద్వారా.
అల్ట్రాసౌండ్ స్కానింగ్: రొమ్ములోని కణజాలంపై శబ్దతరంగాలను ప్రసరింపజేయడం ద్వారా నిర్వహించే ఈ పరీక్షలో, ఆ తరంగాల ప్రతిధ్వనితో ఏర్పడ్డ ప్రతిబింబం చిత్రాన్ని (పిక్చర్‌ను) పరిశీలించడం ద్వారా.
బ్లడ్ కెమిస్ట్రీ స్టడీస్: రక్తంలోని కొన్ని పదార్థాల పాళ్లను పరిశీలించడం ద్వారా. (అంటే అవి నార్మల్‌గా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండటాన్ని పరిశీలించడం ద్వారా).
బయాప్సీ: రొమ్ములోని గడ్డలో కొంతభాగాన్ని సేకరించి, దాన్ని మైక్రోస్కోపిక్‌గా, ఇతరత్రా పాథాలజిస్టులు పరీక్షించి చూడటం ద్వారా. ఇందులో రకరకాల పరీక్షలు ఉంటాయి.
ఫైన్-నీడిల్ యాస్పిరేషన్ (ఎఫ్ఎన్ఏ) బయాప్సీ : ఇందులో సూది సహాయంతో క్యాన్సర్‌గా అనుమానిస్తున్న గడ్డలో కొంత భాగాన్ని లేదా అందులోని ద్రవాన్ని సేకరించి పరీక్షిస్తారు.
కోర్ బయాప్సీ: ఇందులో కాస్తంత పెద్ద సూదితో కొంత కణజాలాన్ని సేకరించి పరీక్షిస్తారు.
ఎగ్జిషనల్ బయాప్సీ: ఇందులో గడ్డ పూర్తి భాగాన్ని తొలగించాక పరీక్షించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు.
- డాక్టర్ ఉదయరాజు హేమంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్
యశోదా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్,
యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్