breaking news
Border talks Protocol
-
భారత్, చైనాల ‘సరిహద్దు’ చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు శుక్రవారం జరిగాయి. ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాకపోవడం గమనార్హం. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. చర్చలపై చైనా విదేశాంగ ప్రతినిధి స్పందిస్తూ ‘ఇది సరిహద్దు అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశం మాత్రమే కాదు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమాచార మార్పిడికి సంబంధించిన ప్రధాన వేదిక కూడా’ అని అన్నారు. దోవల్, యంగ్ ఇద్దరూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇండియా, చైనా మధ్య బలమైన సంబంధాలు ఉండటం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనకరమని, ఇది ప్రాంతీయంగా, అంతర్జాతీయంగానూ సత్ఫలితాలు ఇస్తుందని అభిప్రాయపడినట్లు భారత విదేశీ శాఖ వెల్లడించింది. భారత్, చైనా మధ్య జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
సరిహద్దుల్లో కాల్పులకు అంతం
‘డీజీ’ స్థాయి చర్చల్లో భారత్, పాక్ నిర్ణయం న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య డెరైక్టర్ జనరల్(డీజీ) స్థాయి సరిహద్దు చర్చలు గురువారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద తరచుగా జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు అంతం పలికే దిశగా నూతన వ్యూహాలను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రొటోకాల్‌ను రూపొందించేందుకు వీలుగా చర్చలను మరో రోజు పొడిగించేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. ‘శాంతి నెలకొనాలన్న విషయంలో ఏకాభిప్రాయానికి రావడం కీలకమైన ముందడుగు. ఇది క్షేత్రస్థాయిలో అమలు కావాల్సి ఉంద’ని భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. డీజీ స్థాయి చర్చలు సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గిస్తాయని మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ నేతృత్వంలోని మితవాద హురియత్ కాన్ఫెరెన్స్ పేర్కొంది. ఈ చర్చలను స్వాగతిస్తున్నామని ప్రకటించింది. పాకిస్తాన్ రేంజర్స్ డీజీ(పంజాబ్) మేజర్ జనరల్ ఉమర్ ఫారూఖ్ బుర్కి నేతృత్వంలోని 16 మంది సభ్యుల బృందం గురువారం ఢిల్లీలోని భారత సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. మేజర్ జనరల్ ఉమర్ ఫారూఖ్ బుర్కి బీఎస్ఎఫ్ దళాలు గార్డ్ ఆఫ్ హానర్‌తో స్వాగతించాయి. అనంతరం బీఎస్ఎఫ్ డీజీ డీకే పాథక్, ఇతర ఉన్నతాధికారులు పాక్ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి, చర్చలకు తోడ్కొని వెళ్లారు. ముందు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం.. డీజీ స్థాయి చర్చలు గురువారంతో ముగియాల్సి ఉంది. అయితే, చర్చలను ఒకరోజు పొడగించాలన్న తాజా నిర్ణయంతో, శుక్రవారం కూడా డీజీ స్థాయి చర్చలు కొనసాగనున్నాయి. తరువాత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాక్ రేంజర్స్ బృందం భేటీ అవుతుంది. ఆ తరువాత పాక్ హై కమిషన్ ఉన్నతాధికారులతో సమావేశమవుతుంది. చివరిరోజైన శనివారం ప్పంద పత్రాలపై సంతకాలు జరుగుతాయి. బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాథక్ మొదటిరోజు చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ‘సానుకూల వాతావరణంలో, సంతృప్తికరంగా చర్చలు జరిగాయి. అంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పను’ అన్నారు. అయితే, చర్చల సందర్భంగా.. గత ఘటనల పట్ల చర్చలు, వాదోపవాదాల కన్నా, సరిహద్దులో శాంతి నెలకొనేందుకు ఇకపై ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టాలన్న భారత్ సూచనకు పాక్ బృందం సానుకూలంగా స్పందించిందని, దాంతో చర్చలు సానుకూలంగా సాగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. * సరిహద్దుల్లో ఇరువర్గాలు అంగీకరించిన కొన్ని ప్రాంతాల్లో రెండు దేశాలు సంయుక్తంగా పహారా నిర్వహించాలన్న పాక్ రేంజర్స్ సూచనకు భారత్ ఆమోదం తెలిపింది. * ‘యూఎన్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ అంశాన్ని పాక్ బృందం లేవనెత్తలేదు. * చొరబాట్లను అరికట్టడం, భారత్‌లోకి మత్తు పదార్ధాల అక్రమ రవాణాను అడ్డుకోవడం, సరిహద్దుకు ఆవల అనధికార రక్షణ నిర్మాణాలను ఆపేయడం.. తదితర అంశాలను బీఎస్ఎఫ్ లేవనెత్తింది. * సరిహద్దుల్లో భారత్‌వైపు నుంచి కాల్పులను నిలిపేయాలని పాక్ రేంజర్స్ కోరింది. కొనసాగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘన ఒకవైపు డీజీ స్థాయి చర్చల ప్రక్రియ జరుగుతుండగానే, మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో కాల్పుల విరమణను పాక్ మరోసారి ఉల్లంఘించింది. సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట భారత్ దళాలపై కాల్పులను కొనసాగించింది. పూంఛ్ జిల్లా, భింబర్గలి సెక్టార్లో బుధవారం రాత్రి పాక్ దళాలు కాల్పులు జరిపడంతో, భారత దళాలు గట్టిగా ప్రతిస్పందించాయని గురువారం రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ మెహతా తెలిపారు.