ఆర్బీఐ అన్నీ చేయాలని ఆశించొద్దు
బీఓబీ చీఫ్ జయకుమార్ వ్యాఖ్యలు..
ముంబై: వృద్ధి కోసం రిజర్వు బ్యాంకే అన్నీ చేయాలని ప్రభుత్వం ఆశించరాదని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ, సీఈవో పీఎస్ జయకుమార్ చెప్పారు. రికవరీ బాధ్యత ప్రభుత్వంపైనే గానీ ఆర్బీఐపై ఉండదన్నారు. ‘‘రికవరీకి సంబంధించి అధిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ సమస్యలను పరిష్కరిస్తారని ఆశించడం సరికాదు. అసలు అంశం మరో చోట ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం సేవలకు సంబంధించి విక్రేతలకు సకాలంలో చెల్లింపుల చేయాలని, అమలు విధానాన్ని ఉన్నతీకరించడం ద్వారా ప్రాజెక్టులు సక్రమంగా పనిచేసేట్టు చూడాలని కోరారు. ముంబైలో సోమవారం జరిగిన ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో జయకుమార్ ఈ మేరకు మాట్లాడారు. దేశంలో అతిపెద్ద వ్యాజ్యదారు ప్రభుత్వమేనన్నారు. రుణాల వసూలు ట్రిబ్యునళ్లను మెరుగుపరచడం, దివాళా చట్టాన్ని త్వరగా అమలు చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.