breaking news
Board of Trustees
-
ఆలయాలపై ఆశలు
29 దేవాలయాలకు పాలక మండళ్లు నోటిఫికేషన్ జారీచేసిన దేవాదాయ శాఖ దరఖాస్తులకు 20 రోజులు గడువు పదవుల కోసం నేతల ప్రయత్నాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆలయాల ధర్మకర్తల మండళ్ల నియామకం కోసం వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. రాష్ట్రస్థాయి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి, మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతర, కురవిలోని వీరభద్రస్వామి, వరంగలోని భద్రకాళి, పాలకుర్తిలోని సోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి, వర్ధన్నపేట మండలం ఐనవోలులోని మల్లికార్జునస్వామి ఆలయాలకు ధర్మకర్తల కమిటీ నియామకం కోసం దేవాదాయ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవే కాకుండా జిల్లాలోని వివిధ కేటగిరీలకు చెందిన 29 ఆలయాలకు ధర్మకర్తల మండళ్ల నియామకం కోసం మంగళవారం(30న) మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమితులు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ జారీ చేసిన 20 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. వరుస నోటిఫికేషన్లతో అధికార పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా నియమితులై, చైర్మన్ పదవి దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. దేవాలయాల ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు మార్పులు చేసింది. గతంలో రెండేళ్లు ఉన్న పదవీకాలాన్ని ఏడాదిగా నిర్ణయించింది. అన్ని కేటగిరీ ఆలయాల ధర్మకర్తల కమిటీల్లోని సభ్యుల సంఖ్యను పెంచింది. వార్షిక ఆదాయం ప్రామాణికంగా దేవాలయాలను నాలుగు కేటగిరీలుగా దేవాదాయ శాఖ పరిగణిస్తుంది. రూ.2 లక్షలలోపు ఆదాయం, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు ఆదాయం, రూ.25 లక్షల నుంచి కోటి రూపాయలలోపు ఆదాయం, కోటి రూపాయలకుపైగా ఆదాయం కేటగిరీలుగా ఆలయాలు ఉంటాయి. కోటి రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు 14 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమిస్తారు. రూ.25 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం ఉన్న ఆలయాలకు ఏడుగురు, రెండు లక్షల రూపాయల నుంచి రూ.25 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఉంటుంది. మంగళవారం వచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్న ఆలయాలు నియోజకవర్గాల వారీగా... ములుగు : శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం(రామప్ప), శ్రీముసలమ్మ జాతర(గుంజేడు) వరంగల్ తూర్పు : కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం(స్టేషన్‌రోడ్), శ్రీనాగేశ్వరస్వామి దేవస్థానం(ఉర్సు), శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం(రామన్నపేట), శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం(రామన్నపేట), శ్రీదుర్గేశ్వరస్వామి దేవాలయం(గిర్మాజీపేట), శ్రీభోగేశ్వరస్వామి దేవాలయం(మట్టెవాడ) వరంగల్ పశ్చిమ : శ్రీరుద్రేశ్వరస్వామి దేవాలయం(హన్మకొండ), శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం(హన్మకొండ) స్టేషన్‌ఘన్‌పూర్ : శ్రీబుగులు వెంకటేశ్వస్వామి దేవాలయం(చిల్పూరు), శ్రీరామచంద్రస్వామి దేవస్థానం(జీడికల్), గట్టు మల్లికార్జునస్వామి దేవాలయం(మల్లికుదుర్ల), శ్రీకోదండరామస్వామి దేవాలయం(నవాబుపేట) డోర్నకల్ : శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం(మరిపెడ), శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం(నర్సింహులపేట). పరకాల : శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(కొమ్మాల), శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం(మల్లక్కపేట), శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(అగ్రంపహాడ్), శ్రీకట్టమల్లన్నస్వామి దేవాలయం(గొర్రెకుంట), శ్రీకుంకుమేశ్వరస్వామి దేవాలయం(పరకాల) మహబూబాబాద్ : శ్రీచంద్రమౌలేశ్వరస్వామి దేవాలయం(మహబూబాబాద్), శ్రీరామ మందిరం(మహబూబాబాద్) భూపాలపల్లి : శ్రీబుగులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం(తిరుమలగిరి), శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(కొడవటంచ), శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(మొగుళ్లపల్లి), శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం(భూపాలపల్లి) జనగామ : శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం(కొడవటూరు) వర్ధన్నపేట : శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(దామెరగుట్ట) -
శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటలు
సాక్షి, తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40,320 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 22 గంటలు, అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులకు 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివే శారు. గదుల కోసం అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. లాకర్లు పొందేందుకూ భక్తులు వేచి ఉన్నారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కనీసం మూడు గంటల సమయం పట్టింది. నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశం కానుంది. చైర్మన్ బాపిరాజు, ఈవో గోపాల్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ అతిథిగృహంలో భేటీ కానున్నారు. ఎన్నికల కోడ్, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో కేవలం పరిపాలన సంబంధిత అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వాలకు సంబంధించిన జీవోల రద్దుతో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఆంధ్ర మహాసభ నిర్వహణ బాధ్యత: ధర్మకర్తల మండలి స్వాధీనం
సాక్షి, ముంబై: ఆంధ్ర మహాసభ నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలి స్వాధీనం చేసుకుంది. సభ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలికి అప్పగించాలని బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఈ విషయాన్ని ధర్మకర్తల మండలి ైచె ర్మన్ ఎల్వీ రావ్ కూడా ధ్రువీకరించారు. మిగతా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఈజీఎంను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ఎల్వీ రావ్, కార్యదర్శి చంద్రశేఖర్, సభ్యులు సిద్ధారెడ్డి, భూమేశ్లతోపాటు మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి బాబురావులు పాల్గొన్నారు. ఈ విషయమై పోతు రాజారాంను సంప్రదించగా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, అయితే అధికారిక పత్రాలను ధర్మకర్తల మండలికి అప్పగించాల్సి ఉందని, 12వ తేదీన వాటిని అప్పగిస్తామన్నారు. కార్యదర్శి బాబురావు కూడా తాజా నిర్ణయంపై స్పందించారు. మహాసభ నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలి స్వాధీనం చేసుకున్న విషయం వాస్తవమేనని, ఈ నెల 12వ తేదీన బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిపారు. 2011 అక్టోబరులో ఎన్నికైన మేనేజింగ్ కమిటీ గడువు 2012 అక్టోబరుతో గడువు ముగిసింది. అయినప్పటికీ కొన్ని సమస్యల కారణంగా కొత్త కమిటీని ఎన్నుకోలేదు. గడువు ముగిసి సంవత్సరం కావస్తున్నా 2010-11కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సభ నిర్వహణ బాధ్యతలను ధర్మకర్తల మండలి స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2010-11 సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో నిజానిజాలేమిటో తేలకపోవడంతోనే కొత్త కమిటీని ఎన్నుకోలేదు. ఫలితంగా 2011-12, 2012-13కు సంబంధించిన లెక్కల వివరాలను కూడా పూర్తిచేయలేకపోయారు. అయితే ముందుగా 2010-11కు సంబంధించిన లెక్కలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో ధర్మకర్తల మండలి మహాసభ నిర్వహణ బాధ్యతలను స్వాధీనం చేసుకోవాలని భావించింది. అయితే ఈ లెక్కల విషయంలో మండలి ఎలా వ్యవహరించనుందనే విషయమై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.