breaking news
Blind T-20 World Cup
-
అంధుల క్రికెట్ జట్టుకు రూ.కోటి నజరానా
సీఓఏ నిర్ణయం ముంబై: ఇటీవల అంధుల టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ రూ.కోటి నజరానా ప్రకటించింది. గత నెల 25న సమావేశమైన బోర్డు నూతన పరిపాలన కమిటీ (సీఓఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12న బెంగళూరులో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రైజ్‌మనీని భారత అంధుల క్రికెట్ సంఘానికి (సీఏబీఐ) బోర్డు ఇవ్వనుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని ఆటగాళ్లకు పంచనున్నారు. ‘బీసీసీఐ నుంచి ఈ మేర గుర్తింపు లభించడం మాకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సీఓఏకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రపంచకప్ నిర్వహించేందుకు మేం అప్పులు చేయాల్సి వచ్చింది’ అని సీఏబీఐ అధ్యక్షుడు జీకే మహంతేష్ అన్నారు. అలాగే ఇది మంచి పరిణామమని.. ఇకనుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా టోర్నీలు ఆడతామని ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఇప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సీఏబీఐ.. బీసీసీఐ తమను ఈమాత్రమైనా గుర్తించడంతో సంతోషంలో తేలుతోంది. -
అందరికీ మీరు ఆదర్శం
అంధుల టి20 ప్రపంచకప్ విజేత భారత జట్టుపై ప్రధాని ప్రశంసలు జట్టు సభ్యులతో భేటీ న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ‘టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధుల క్రికెట్ చాంపియన్లతో గుర్తుండిపోయే విధంగా భేటీ జరిగింది. జాతీయ సీనియర్ జట్టు సాధించిన విజయాలతో ప్రేరణ చెందిన వీరంతా పాఠశాల స్థాయి నుంచే ఆటను కెరీర్‌గా మలుచుకున్నారు. ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్‌లోనూ ఇలాగే రాణించి దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్రికెటర్లను ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చిన వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, స్నేహితులకు కూడా అభినందనలు తెలుపుతున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తమ సంతకాలతో కూడిన బ్యాట్, బంతి, మోదీ పేరుతో ఉన్న టీమ్ జెర్సీని ఆటగాళ్లు బహూకరించారు. అలాగే ప్రధాని కూడా వారికి బ్యాట్, బంతిని అందించారు. అనంతరం ప్రతీ ఆటగాడితో ఫొటో దిగి ట్విట్టర్లో పెట్టారు. టి20 అంధుల క్రికెట్ ప్రపంచ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు గత నెల 12న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి మరోసారి విజేతగా నిలిచింది. చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి సారథ్యం వహించగా... దున్నా వెంకటేశ్వరరావు, దుర్గా రావు, ప్రేమ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. -
టైటిల్‌కు అడుగు దూరంలో...
అంధుల టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సెమీస్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సెంచరీతో మెరిసిన ప్రకాశ్ జయ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన హైదరాబాద్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత జట్టు అంధుల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. లాల్‌బహదూర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. సురంగ సంపత్ (49; 5 ఫోర్లు), చందన దేశప్రియ (42; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో రణ్‌బీర్ పన్వర్, సునీల్ రెండేసి వికెట్లు తీయగా... అజయ్ కుమార్ రెడ్డి, గోలూ కుమార్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 175 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోకుండా 13 ఓవర్లలో అధిగమించింది. ఓపెనర్ ప్రకాశ్ (52 బంతుల్లో 115 నాటౌట్; 23 ఫోర్లు) అజేయ సెంచరీ చేయగా... ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి (30 బంతుల్లో 51 నాటౌట్) అర్ధ సెంచరీతో అండగా నిలిచాడు. శనివారం కర్ణాటకలోని ఆలూర్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో... ఆదివారం బెంగళూరులో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. -
భారత్‌కు తొలి ఓటమి
న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 204 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రకాశ్ (56 బంతుల్లో 90; 10 ఫోర్లు, ఒక సిక్స్), వెంకటేశ్వర రావు (45 బంతుల్లో 53; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలో అధిగమించి విజయాన్ని దక్కించుకుంది. పాక్ తరఫున మొహమ్మద్ జాఫర్ (52 బంతుల్లో 88 నాటౌట్; 2 ఫోర్లు) అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గురువారం జరిగే నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది.