breaking news
the blind
-
‘గోల్’ కనిపిస్తుంది...
బంతి ఆకారాన్ని ఊహించుకోవడం తప్ప.. ఎలా ఉంటుందో తెలియదు. మైదానాన్ని చూడలేరు.. గోల్ పోస్ట్‌లు ఎక్కడున్నాయో గుర్తించలేరు. కానీ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. అంధులే అయినా.. బంతి గమనాన్ని పసిగడుతున్నారు. అద్భుత రీతిలో గోల్స్ నమోదు చేస్తున్నారు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఫుట్బాల్నూ అలవోకగా ఆడేస్తూ.. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వారి కోసమే ప్రత్యేకంగా రూపొందిన ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్‌షిప్, పారాఒలింపిక్స్ స్థాయిలో అదరగొడుతున్నారు అంధ ఫుట్‌బాల్ వీరులు. బ్లైండ్ ఫుట్‌బాల్‌కు దాదాపుగా 35 ఏళ్ల చరిత్ర ఉంది. 1980లో దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో చూపులేనివాళ్లు ఈ తరహా ఫుట్‌బాల్ ఆడేవారు. అయితే బ్లైండ్ ఫుట్‌బాల్ 5-ఎ-సైడ్ ఫుట్‌బాల్‌గా స్పెయిన్‌లో మెరుగులు దిద్దుకుంది. 1986లో స్పానిష్ జాతీయ 5-ఎ-సైడ్ ఫుట్‌బాల్ టోర్నీని నిర్వహించారు. 1998 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మెగా టోర్నీలో బ్రెజిల్ మూడుసార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్లైండ్ ఫుట్‌బాల్ పారా ఒలింపిక్స్‌లో క్రీడాంశంగా ఉంది. 2004లో ఇది పారా ఒలింపిక్స్‌లో భాగమైంది. బ్లైండ్ సాకర్‌లో మెగా టోర్నీగా భావించే పారా ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా మూడుసార్లు బ్రెజిలే చాంపియన్‌గా నిలిచింది. ఈ ఫుట్‌బాల్‌లో యూరోప్, అమెరికా ఖండాలకు చెందిన జట్లు తరుచుగా తలపడతాయి. ఆసియా దేశాలకు చెందిన కొన్ని జట్లు కూడా తమ సత్తా చాటుతున్నాయి. సాకర్ ఆడేదిలా.. చూపులేని వాళ్లు ఫుట్‌బాల్ ఆడటమంటే మాటలు కాదు.. అందుకే ఫిఫా నిబంధనల్ని సవరించి, ఆట స్వరూపాన్ని మార్చేసి 5-ఎ-సైడ్ బ్లైండ్ ఫుట్‌బాల్‌గా నామకరణం చేశారు. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో 5-ఎ-సైడ్ బ్లైండ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మ్యాచ్‌లో బరిలోకి దిగే ప్రతీ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఉంటారు. గోల్‌కీపర్ కూడా వీరిలో ఒకడు. మ్యాచ్‌ల్లో చూపున్న గోల్కీపర్ను బరిలోకి దించవచ్చు. ఇక వీళ్లు ఎలా ముందుకు వెళ్లాలో చెప్పేందుకు ఓ గైడ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే అతను మైదానం బయట ఉండేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఫుట్‌బాల్‌లో బంతి పరిమాణాన్ని తగ్గించి.. అది ఎటువెళుతోందో ఆటగాళ్లకు వినపడేందుకు కొన్ని చప్పుడు గుళికలను బంతిలో ఉంచుతారు. ఇక ఆట 50 నిమిషాల పాటు కొనసాగుతుంది. -
‘అంధ’లమెక్కాడు...
దుర్భర దారిద్య్రం... తల్లీతండ్రి కూలికి వెళితేనే గానీ పూట గడవని పరిస్థితి... ఇంట్లో అన్నయ్య గుడ్డివాడు... వీటన్నింటికీ మించి తానూ అంధుడే... ధైర్యంగా నాలుగు మాటలు చెప్పి, సాయం చేసేవారూ లేరు... ఇలాంటి పరిస్థితుల్లో ఓ పిల్లాడు ఏమవుతాడు..? ఎలాగోలా జీవితం గడిస్తే చాలనుకుంటాడు. కానీ పారపాటి రమేశ్ మాత్రం అలా కాదు. విధితో పోరాడాడు. అంధత్వాన్ని అధిగమించాడు. వెయిట్ లిఫ్టింగ్ లాంటి ‘బరువైన’ క్రీడను కెరీర్‌గా ఎంచుకున్నాడు. దొరికిన చిన్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫలితం... రాష్ట్రంలో వెయిట్ లిఫ్టింగ్‌లో సబ్‌జూనియర్ కేటగిరీలో అత్యుత్తమ క్రీడాకారుడిగా ఎదిగాడు. అవరోధాలను అధిగమించి... శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన రమేశ్ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మరో సోదరుడు కూడా అతనిలాగే అంధుడే. ఇలాంటి నేపథ్యంలో రమేశ్ ఒక ఒలింపిక్ క్రీడ వైపు ఆసక్తి చూపించడం, అందుకు తగ్గట్లుగా శ్రమించేందుకు సిద్ధపడటం అతని పట్టుదలను సూచిస్తోంది. విజయనగరం అంధుల పాఠశాలలో ఉండగా అతనికి ఈ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే పూర్తిగా కళ్లు కనిపించని అతను ఇలాంటి భారీ క్రీడను ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అది కేవలం సరదాకే పరిమితమవుతుందని అందరూ భావించారు. కానీ అతను మాత్రం ఆటపై అభిమానం పెంచుకున్నాడు. ఆరంభంలో కాస్త బరువైన కర్రను ఎత్తడంతో అతని అభ్యాసం మొదలైంది. ఆ తర్వాత శరీరం ఎలా కదపాలో, చేతులు ఎలా ఎత్తాలో అన్నీ సాధన చేశాడు. మొదట్లో కేవలం ఐరన్ బార్‌ను ఎత్తడం ప్రారంభించిన అతను ఆ తర్వాత వాటికి వెయిట్స్ జత చేశాడు. మెల్లమెల్లగా బరువు పెంచుతూ పోయాడు. ఇదే పాఠశాలలో అనేక మంది రమేశ్‌తో పాటే నేర్చుకున్నా మధ్యలోనే మానేశారు. కానీ అతను మాత్రం మొండిగా ముందుకు సాగాడు. ఆ ముగ్గురి అండతో... జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నా రమేశ్ పట్టుదలగా లిఫ్టర్‌గా ఎదిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొంత మంది అతనికి అన్ని విధాలా అండగా నిలిచారు. ఇందులో మొదటి వ్యక్తి కోచ్ రవికుమార్. అంధుల పాఠశాలలో రమేశ్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో ఓనమాలు నేర్పించి తీర్చిదిద్దింది ఆయనే. ఒక అంధ విద్యార్థికి ఆట నేర్పించడం అంత సులువు కాదు. ఆటగాడిలో పట్టుదలతో పాటు కోచ్‌కు ఎంతో సహనం కూడా కావాలి. నేర్చుకునే దశలో ప్రతీ లోపాన్ని సవరిస్తూ వచ్చిన రవికుమార్, ప్రాక్టీస్‌లో కుర్రాడికి దెబ్బలు తగలకుండా దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. తన ముగ్గురు కూతుళ్లతో సమానంగా రమేశ్‌ను కూడా కుటుంబసభ్యుడిలా చూసుకున్నారాయన. అంధుడితో లిఫ్టింగ్ ప్రమాదమని చెప్పినా సొంత పూచీపై ఆయన నేర్పించారు. విశాఖలో ప్రభుత్వాధికారిగా పని చేస్తున్న కోరుకొండ రమేశ్ ప్రాక్టీస్ కోసం, వివిధ టోర్నీలకు హాజరయ్యేందుకు ఆర్థిక సహాయం అందించారు. ఏపీ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య కూడా తన పరిధిలో ఎంతో సహకారం అందించారు. ఓపెన్ కేటగిరీలో పోటీల్లో తరచూ పాల్గొనేలా ప్రోత్సహిస్తూ ఆయన అవకాశం కల్పించారు. వీడని సమస్యలు... ఇటీవల గౌహతిలో జాతీయ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించడంతో రమేశ్ కూడా అందరిలాగా రాణించగలడనే నమ్మకం కలిగింది. ఈ నెలలోనే విజయనగరంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల సబ్ జూనియర్ విభాగంలో రమేశ్ బెస్ట్ లిఫ్టర్‌గా నిలవడం విశేషం. అయితే ఇతర క్రీడాకారుల్లాగే అతనికి కూడా సౌకర్యాలలేమి సమస్యగా మారింది. ఇప్పటికీ అతను ఇనుప బార్తోనే సాధన చేస్తున్నాడు. ఎలికో బార్, పవర్ బార్, వెయిట్ డిస్క్‌లు అతనికి ఇంకా అందుబాటులో లేవు. వాటిని కొనేంత ఆర్థిక స్థోమత లేదు. ఇటీవల సాంగ్లీలో జరిగిన నేషనల్స్‌లో లిఫ్టింగ్ షూస్ లేకపోవడంతో నిర్వాహకులు అంగీకరించలేదు. చివరి నిమిషంలో ఏదో షూస్‌తో బరిలోకి దిగినా అతని ప్రదర్శనపై అది ప్రభావం చూపించింది. రమేశ్ అంధుడే అయినా ఓపెన్ పోటీల్లో పాల్గొంటుండటం వల్ల అతనికి నిబంధనల విషయంలో ఎలాంటి సడలింపూ ఉండదు. ఇక వికలాంగుల పింఛన్ కింద నెలకు ఇచ్చే రూ. 500 ఏ మూలకూ సరిపోవు. ఒక లిఫ్టర్‌కు అవసరమయ్యే బలవర్ధకమైన ఆహారం తీసుకునేందుకు కూడా అతనికి డబ్బు సమస్యగా మారింది. అయినా పట్టుదలతో శ్రమిస్తున్న అతడికి ఎవరైనా పూర్తిస్థాయిలో చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తే అద్భుతాలు చేయగలడనడంలో సందేహం లేదు. - బి.ఎస్. రామచంద్రరావు (సాక్షి, విశాఖపట్నం ప్రతినిధి) ఎలా ఆడతాడంటే.. సాధారణంగా కళ్లు కనిపించని వ్యక్తి నడవడమే కష్టం. అలాంటిది వేదిక మీదకు వెళ్లి బార్‌ను కచ్చితంగా పట్టుకుని బరువు లేపడం అసాధారణ విషయం. అందులోనూ తప్పుగా బార్ పట్టుకుంటే ఫౌల్ అవుతుంది. కాబట్టి కోచ్ రవి ఓ కొత్త ఆలోచన చేశారు. ‘నువ్వు వేదిక మీదకు వెళ్లి బార్ పట్టుకో. కరెక్ట్‌గా పట్టుకుని బరువు ఎత్తితే అందరూ చప్పట్లు కొడతారు. సమస్య లేదు. అలా కాకుండా వెళ్లి బార్‌ను తప్పుగా పట్టుకుంటే నేను చప్పట్లు కొడతాను. సరిచేసుకో’ అని రవి సూచించారు. ప్రస్తుతం రమేశ్ ఇదే ఆచరణలో పెడుతున్నాడు. బరువు ఎత్తకముందే చప్పట్లు వినిపించాయంటే తాను తప్పు చేస్తున్నట్లు అర్థం. ‘విజయనగరం స్కూల్లో శరీరం తీవ్రంగా నొప్పి పెట్టినా, మణికట్టు దగ్గర బాధగా అనిపించినా నేను ఆట వదల్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకున్నా. నాతో పాటు మా కోచ్ కూడా చాలా కష్టపడుతున్నారు. అందుకే ఇంకా పెద్ద పోటీల్లో గెలవాలి. మరిన్ని పతకాలు సాధించాలి. కనీసం నేను గెలిచిన మెడల్స్ కూడా చూడలేను. అయినా సరే పెద్ద స్థాయికి చేరుకుంటా. పారాలింపిక్స్‌లో అవకాశం వస్తే స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు సహకరిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు’ - రమేశ్