ప్రమాదవశాత్తు మాజీ సర్పంచ్ మృతి
ఎన్.ఘణపురం(పగిడ్యాల): భవనాశినదిని దాటే క్రమంలో నీటిలో మునిగి ఎన్. ఘనపురం మాజీ సర్పంచ్ గొల్లమాదన్న మృతిచెందాడు.సాగు చేసిన మినుము పంటను చూసేందుకు పొలానికెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గొల్ల మాదన్న(58) పాత లింగాపురం గ్రామంలో 5 ఎకరాల్లో మినుము సాగు చేశారు. పంటను చూసేందుకు శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉండే భవనాశి నదిని దాటి పొలానికెళ్లాలి. ఈ క్రమంలో నది దాటుతుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు నది వద్దకెళ్లి గాలించగా శవమై కనిపించాడు. నది దాటి పొలానికెళ్లొద్దని చెప్పినా వినలేదని కుటుంబీకులు గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతుడు 2005లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై ప్రజల మన్ననలు పొందారు.