భక్తిశ్రద్ధలతో భాసికం
మొహర్రం వేడుకలకు జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన చిన్నమండెం కస్పాలో సోమవారం రాత్రి జరిగిన భాసికం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. జిల్లా నలుమూలల నుంచేకాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కార్యక్రమంలో హాజరయ్యారు. అంతకు ముందు కడప పెద్ద దర్గా పీఠాధిపతి సయ్యద్ షా అరీపుల్లా హుస్సేని ప్రత్యేక ఫాతెహా చేశారు.
గంధపు పీర్కు భాసికాన్ని సమర్పించిన స్థానిక సినిమా థియేటర్ యజమాని శంకర్ భాసికం ఎత్తుకుని, తమ నివాసం నుంచి ఊరేగింపుగా మకాన్కు తెచ్చారు. ఊరేగింపులో చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దాదాపు 6 రకాల డప్పులు.. పులి, సింహం, నెమళ్ల వేషాలు అలరించాయి. వివిధ రకాల ఆధునాతన బాణసంచాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ఊరేగింపు కార్యక్రమం ఉదయం 5గంటల వరకు కొనసాగింది. రాయచోటి రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ పాటు చిన్నమండెం ఎస్ఐ సత్యనారాయణతో పాటు మరో నలుగురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు మొత్తం 100మంది సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. - చిన్నమండెం