breaking news
Benazir Bhutto daughter
-
తల్లి బాటలో తనయ.. పాక్ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం
ఏ దేశంలో అయినా ప్రథమ పౌరురాలు అంటే.. ఆ దేశ అధ్యక్షుడో/సుప్రీమో/రాజుగారి భార్యకో ఆ హోదా కల్పిస్తారు. కానీ, బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రథమ పౌరుడి కూతురికి ఆ స్థానం దక్కబోతోంది!. పాకిస్థాన్ ఈ తరహా నిర్ణయానికి వేదిక కానుంది. ఈ క్రమంలోనే అసీఫా భుట్టో పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తన కూతురు అసీఫా భుట్టో జర్దారీ(31)ని ఆ దేశ ప్రథమ పౌరురాలిగా ప్రకటించబోతున్నారు. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనుందని.. ఆ వెంటనే ప్రొటోకాల్ సహా ప్రథమ పౌరురాలికి దక్కే సముచితమైన అధికారాలు అసీఫాకు దక్కనున్నట్లు స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి. ►అసీఫా భుట్టో జర్దారీ.. అసిఫ్ అలీ జర్దారీ-బెనజీర్ భుట్టోల చిన్నకూతురు. 1993లో జన్మించారామె. జర్దారీ-బెనజీర్ల మిగతా ఇద్దరు పిల్లలు బిలావల్ , బక్తావర్లు రాజకీయాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే ►పాక్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో తనయగా పాక్ ప్రజల్లో అసీఫాపై సానుభూతి ఉంది. బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ►అసీఫా విద్యాభ్యాసం అంతా విదేశాల్లోనే సాగింది. ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజీ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో విద్యాభ్యాసం పూర్తి చేశారామె. ►2020లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారామె ►పాక్ పవర్ఫుల్ లేడీగా పేరున్న బెనజీర్ తనయగా.. పీపీపీలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అసీఫా. ►బిలావల్ గతంలో విదేశాంగ మంత్రిగా పని చేసినా.. అసీఫానే తన తండ్రితో ఎక్కువగా కనపడతారు. ►తండ్రి అసిఫ్ జర్దారీకి ఆమె తొలి నుంచి వెన్నంటే నిల్చుంది. పలు కేసుల్లో జర్దారీ ఆభియోగాలు ఎదుర్కొన్నప్పుడు.. ఆయన తరఫున న్యాయపోరాటంలో పాల్గొంది అసీఫానే ►రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలలో చురుకుగా పాల్గొనే అసీఫాను.. జూనియర్ బెనజీర్ భుట్టోగా అభివర్ణిస్తుంటుంది అక్కడి మీడియా ►2022లో ఖనేవాల్లో పీపీపీ ఊరేగింపు సందర్భంగా ఆసిఫా తన సోదరుడు బిలావల్తో కలిసి వెళుతుండగా మీడియా డ్రోన్ ఢీకొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ►పాక్ ఎన్నికల్లో పీపీపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బిలావర్ భుట్టోను ప్రకటించింది. అసీఫా మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక పీఎల్ఎం-ఎన్తో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో పీపీపీ పలు షరతులు విధించినట్లు తెలుస్తోంది ►ఇందులో భాగంగానే అసిఫ్ అలీ జర్దారీ కుటుంబానికి కీలక పదవులు, బాధ్యతలు దక్కనున్నట్లు స్పష్టమవుతోంది ►పోలియో నిర్మూలన కార్యక్రమానికి పాక్ అంబాసిడర్గా అసీఫా భుట్టో ఉన్నారు ►అసీఫా తండ్రి, పీపీపీ సహా వ్యవస్థాపకుడు అసిఫ్ అలీ జర్దారీ మార్చి 10వ తేదీన పాక్ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. పాక్ చరిత్రలో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా(మిలిటరీ అధిపతుల్ని మినహాయించి) అసిఫ్ చరిత్ర సృష్టించారు. గతంలో 2008-13 మధ్య ఆయన పాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు -
ఉపవాసం లేకుంటే జైలుకి పంపుతారా?
న్యూఢిల్లీ : ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. అయితే ఈ మాసంలో ఉపవాస దీక్షలు పాటించకుండా ఆహారం స్వీకరిస్తే జైలుకి పంపే చట్టాన్ని పాకిస్తాన్ తీసుకొచ్చింది. ఈ చట్టంపై మాజీ పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో కూతురు మండిపడ్డారు. ప్రజలను పొట్టను పెట్టుకుంటున్న ఉగ్రవాదులను మాత్రం తమ దేశం రోడ్లపై స్వేచ్ఛగా తిరగనిస్తుంది, కానీ రంజాన్ మాసంలో ఆహారం తీసుకుంటే జైలుకి పంపుతుందా? విమర్శించారు. ఇది ఇస్లామే కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ బెనజీర్ కూతురు బఖ్తవార్ భుట్టో-జర్దారీ ఓ ట్వీట్ చేశారు. రంజాన్ మాసంలో బహిరంగంగా ఆహారం తీసుకునే వారిపై మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీసుకొచ్చిన ఎహ్రామ్-ఈ-రమదాన్ ఆర్డినెన్స్ హాస్యాస్పదమైనదని ఆమె వర్ణించారు. ఈ హ్యాస్పాదమైన చట్టంతో ప్రజలు హీట్ స్ట్రోక్, డీహైడ్రేజషన్ తో చనిపోతారని ఆమె చెప్పారు. ప్రతిఒక్కరూ ఇది చేయలేరన్నారు. ఇది అసలు ఇస్లామే కాదని మండిపడ్డారు. మలాలా లాంటి స్కూల్ పిల్లలపై దాడులు జరిపిన ఉగ్రవాదులెవరూ జైలు శిక్ష అనుభవించడం లేదు, అలాంటిది రంజాన్ మాసంలో మంచినీళ్లు తాగితే జైలుకి పంపిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వారంలో మొదట్లోనే 1980 ఆర్డినెన్స్ కు పాకిస్తాన్ సెనేట్ సవరణ చేసింది. ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసంలో స్మోకింగ్ చేసినా లేదా బహిరంగంగా తిన్నా 500 రూపాయల జరిమానాతో జైలు శిక్ష విధించనున్నారు. హోటల్స్, రెస్టారెంట్లపై కూడా ఈ జరిమానా ఉండనుంది. టీవీ ఛానల్స్ లేదా థియేటర్ హౌజ్ ఈ చట్టాన్ని అతిక్రమిస్తే 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగానే జరిమానా వేయనున్నారు. భుట్టోకున్న ముగ్గురు సంతానంలో ఈమె ఒకరు. బఖ్తవార్ సోదరుడు బిలావల్ ప్రస్తుతం ప్రతిపాక్ష పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ గా ఉన్నారు.