breaking news
Bathukamma 2023
-
అభిమానులతో బతుకమ్మ ఆడిన 'స్టార్ మా' నటీనటులు
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మాకు సంబంధించిన సీరియల్ నటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఉనన దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రముఖ షోలు 'పలుకే బంగారమాయెనా, నాగ పంచమి'లలో నటించిన ప్రముఖ నటీనటులు తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులను కలుసుకున్నారు. దీంతో వారందరూ ఎంతగానో సంతోషించారు. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడటమే కాకుండా పలు సినిమాల సూపర్ హిట్ పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేశారు. అనంతరం వారితో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా పలు బహుమతులను కూడా అందుకున్నారు. ఇలా సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో మెప్పించారు. ఇలా తమను అభిమానిస్తున్న ప్రేక్షకులతో ఇలా బంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు.. ప్రతి పండుగను ఇలా సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఎప్పటికీ కట్టుబడి ఉందిని వారు తెలిపారు. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా స్టార్ మా నటీనటులను ఇలా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం చెప్పుకోతగినదని పేర్కొన్నారు. -
బతుకమ్మ సంబరాలు షురూ.. నేడే ఎంగిలిపూల బతుకమ్మ
తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డలా పండుగ.. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించే వేడుక. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగకు సమయం ఆసన్నమైంది. భాద్రపద అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పండగకు తెలంగాణ ముస్తాబైంది. ఏర్పాట్లకు సర్వం సిద్ధమయ్యాయి. నేటి(శనివారం) నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. చివరిరోజైన దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. తీరొక్క పూలతో.. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఆడబిడ్డలను ఇళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుక నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతారు.గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు ఒక్కో రోజు.. ఒక్కోలా.. మొదటి రోజు: బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజు: బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇది ఆశ్వీయుజ మాసం మొదటి రోజైనపౌడ్యమి రోజున నిర్వహిస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు: బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలతో అమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మను చేస్తారు. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు. ఐదో రోజు: అట్ల బతుకమ్మ అంటారు. ఈరోజు అట్లు(దోసలు) తయారు చేస్తారు. అమ్మకు నైవేద్యంగా పెడతారు. ఆరో రోజు: అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజు బతుకమ్మ పేర్చరు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు. ఏడో రోజు: వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి, నూనెలో వేయిస్తారు. వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ. చాలా ముఖ్యమైన రోజు. ఇదే రోజు అశ్వయుజ అష్టమి.. దుర్గాష్టమి. సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో బతుకమ్మ ఉత్సవాలను ముగిస్తారు.