తల్లడిల్లుతున్నారు...
మేడ్చల్/మేడ్చల్ రూరల్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన మండల పరిధిలోని గౌడవెళ్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి బస్వరాజ్ సందీప్ ఆచూకీ ఇంకా లభించలేదు. రెండు రోజులుగా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో సందీప్ తల్లిదండ్రులు బస్వరాజ్ వీరేష్, విజయ లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అతడి ఆచూకీ ఏ క్షణాన్నైనా లభించవచ్చని వారు టీవీ ముందు నుంచి కదలకుండా ఆశగా ఎదురు చూస్తున్నారు.
సందీప్ తల్లిదండ్రులతోపాటు బంధువులు కూడా రెండు రోజులుగా నిద్రాహారాలు మాని సందీప్ సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నారు. సందీప్ స్వగ్రామం గౌడవెళ్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నా యి. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సందీప్ బంధువులు సత్యనారాయణ, నాగరాజు హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లి అతని జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.