breaking news
bank saving account
-
తొలి ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?
నాకు నెలకు రూ.25 వేల వరకూ జీతం వస్తోంది. రూ.5,000–8,000 వరకూ పొదుపు చేయగలను. కనీసం 20 ఏళ్లపాటు పొదుపు చేయాలనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి? –ఇంతియాజ్, హైదరాబాద్ చాలా మంది మిగులు జీతాన్ని బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా చేస్తారు. మీరు నెలకు రూ.5,000–8,000 వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి.. మొదటగా మీరు అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నెలల మీ ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాలి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దీర్ఘకాలంలో అధిక రాబడులనిచ్చే ఈక్విటీలను ఎంచుకోవాలి. అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మ్యూచువల్ ఫండ్స్‌లో ట్యాక్స్ సేవింగ్, బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌నే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)గా వ్యవహరిస్తారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి ప్రకారం లభించే రూ. లక్షన్నర పన్ను రాయితీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో ఈఎల్ఎస్ఎస్లు కూడా ఉన్నాయి. వీటికి మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇక బ్యాలన్స్డ్ ఫండ్స్ విషయానికి వస్తే, వీటిని హైబ్రిడ్ ఫండ్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో కొంత భాగాన్ని ఈక్విటీలోనూ, మరికొంత భాగాన్ని డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ క్షీణించినప్పుడు ఈక్విటీ ఫండ్స్‌లా బ్యాలన్స్డ్ ఫండ్స్ నష్టపోకుండా ఈ డెట్ సాధనాలు ఉపకరిస్తాయి. ఒక్కో కేటగిరి నుంచి ఒక్కో ఫండ్‌ను ఎంచుకొని ప్రతి నెలా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మీరు మంచి రాబడులు పొందగలరు. దీంతో పాటు బీమా కోసం టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. ఇతర బీమా పాలసీలతో పోల్చితే టర్మ్ బీమా పాలసీలకు చెల్లించాల్సిన ప్రీమియమ్ తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటే ఏమిటి ? సేవింగ్స్ ఖాతాల కంటే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? వీటికి లాక్–ఇన్ పీరియడ్ ఉంటుందా ? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌ను సూచించండి? –మాథ్యూస్, సికింద్రాబాద్ ఏడాదికి మించని మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మీ వద్ద మిగులు నగదు ఉంటే ఏడాదిలోపు ఇన్వెస్ట్మెంట్ కాలానికి వీటిని ఎంచుకోవచ్చు. వీటిపై గ్యారంటీగా ఇంత రాబడి వస్తుందని చెప్పలేము. పెట్టుబడి రక్షణకు గ్యారంటీ కూడా లేదు. అయితే నష్టభయం పరిగణించదగ్గ స్థాయిలో ఉండదని చెప్పవచ్చు. ఖచ్చితంగా సేవింగ్స్ ఖాతా కంటే అదనపు రాబడులే వస్తాయి. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్–ఇన్ పీరియడ్ లేదు. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు రిడంప్షన్ రిక్వెస్ట్‌ను సమర్పిస్తే సరిపోతుంది. 1 నుంచి 3 రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. కొన్ని ఫండ్స్ తక్షణ రిడంప్షన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే.. డెట్ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలు ఈ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌కు వర్తిస్తాయి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, బరోడా పయనీర్ ట్రెజరీ అడ్వాండేజ్ ఫండ్, ఎల్ అండ్ టీ ఫ్లోటింగ్ రేట్ ఫండ్, ఇండియాబుల్స్ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్. ఒక కంపెనీ ఆర్థిక స్థితిగతులను ఎలా అంచనా వేయాలి? పనితీరు బాగా లేని కంపెనీలను పసిగట్టే విధానాలు ఏమైనా ఉన్నాయా? –నవనీత, విశాఖపట్టణం భవిష్యత్తును ఎవరూ సరిగ్గా అంచనా వేయలేరు. ఈ విషయం స్టాక్ మార్కెట్‌కు కూడా వర్తిస్తుంది. అయితే భవిష్యత్తులో కంపెనీ పనితీరు బాగా లేకపోయే పరిస్థితులను పసిగట్టటానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది షేర్ల తనఖా..వ్యాపారం నిమిత్తమో, లేకుంటే వ్యక్తిగత అవసరాల కోసమో ప్రమోటర్లు తన వాటా షేర్లను తనఖాగా పెట్టి రుణాలు తీసుకుంటారు. అయితే ఇలా షేర్లు తనఖా పెట్టడమనేది సాధారణమైన విషయమే. అయితే ఇలా తనఖా పెట్టే షేర్ల శాతం పెరిగితేనే తంటా. తనఖా పెట్టిన షేర్లు అధికంగా ఉండి, సదరు కంపెనీ షేరు ధర పడిపోతున్నప్పుడు, సెక్యూరిటీగా మరిన్ని షేర్లను తనఖా పెట్టమని రుణాలిచ్చే సంస్థ.. ప్రమోటర్‌ను డిమాండ్ చేయవచ్చు. ప్రమోటర్ రుణ చెల్లింపుల్లో విఫలమైతే, తనఖా పొందిన షేర్లను సదరు సంస్థలు విక్రయించవచ్చు. ఫలితంగా కంపెనీ షేర్ ధర మరింతగా పతనం కావచ్చు. ఇక రెండో విషయం.. కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గడం... ఏదైనా కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గడం కొనసాగుతుంటే.. కంపెనీ ప్రమాదంలో ఉన్నదనే చెప్పవచ్చు. కంపెనీలో ప్రమోటర్ల వాటా తగ్గుతుందంటే.. సదరు వ్యాపారంపై ప్రమోటర్లకు ఆసక్తి తగ్గుతోందని లేదా తనఖా పొందిన షేర్లను రుణదాతలు విక్రయించడం కానీ, కంపెనీ రుణాన్ని ఈక్విటీగా మార్చుకోవడం గానీ జరుగుతోందని అర్థం. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇంట్లో ఉన్నా పెన్షన్ వస్తుంది!
♦ ఉమన్ ఫైనాన్స్ జీవితం చాలా ఉందనో, పిల్లలు బాగోగులు చూస్తారనో, చనిపోయేవరకు పనిచేస్తూ ఉంటారనో, ఇప్పటికే ఆస్తులు ఉన్నాయనో... ఇలా ఎన్నో ఆలోచనలతో దేశ జనాభాలో సుమారుగా 85 శాతం మంది రిటైర్మెంట్ ప్లానింగ్‌ను అంతగా పట్టించుకోవడం లేదు. గృహిణుల విషయమైతే ఇక చెప్పేదేముందీ? అన్నిటికీ భర్త మీదే ఆధారపడతారు. అలా కాకుండా గృహిణులు కూడా తాము కూడబెట్టిన సొమ్ముతో పెన్షన్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు. అరవై సంవత్సరాలు నిండాక నెలవారీ జీతం / ఆదాయం ఎక్కువ మందికి ఉండదు. సంపాదించే వయస్సులోనే తగిన మొత్తాన్ని పొదుపు, మదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ తరువాత జీవితానికి అవసరమయ్యే ఖర్చులని అధిగమించవచ్చు. 50, 55 సంవత్సరాలు వచ్చాక రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తే అది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం రిటైర్మెంట్ కోసం నిధిని సమకూర్చుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు, స్థిరాస్తి, షేర్లు మొదలైన పలు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం వారి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (్కఊఖఈఅ) సంస్థచే ఈ ఎన్పీఎస్ నిర్వహించబడుతుంది. ఈ స్కీములో సేకరించిన మొత్తాన్ని పీఎఫ్ఆర్డీఏచే నియమితులైన ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్‌తో వివిధ రకాల పెట్టుబడి మార్గాలలో గవర్నమెంట్ సెక్యూరిటీక్ (ఎ), కార్పొరేట్ బాండ్స్ (ఇ), ఈక్విటీ షేర్స్ (ఉ)ను పీఎఫ్ఆర్డీఏ గైడ్‌లైన్స్ ఆధారంగా మదుపు చేయడం జరుగుతుంది. ఇందులో మదుపు చేయడానికి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగినవాళ్లు పెట్టుబడి చేయడానికి అర్హులు. పెట్టుబడి పెట్టిన సొమ్మును ఏ అసెట్ క్లాసులో మదుపు చేయాలో ఎంచుకొనే సదుపాయం కూడా ఉంది. ఎందులో పెట్టాలో అవగాహన లేనప్పుడు ఆటో చాయిస్ ఎంచుకోవచ్చు. ఇందులో 2 రకాల ఖాతాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. అవి : టైర్ 1, టైర్ 2 టైర్ 1: ఇది రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడానికి ప్రత్యేకించినదిగా చెప్పుకోవచ్చు. ఈ ఖాతా నుండి 60 సంవత్సరాలలోపు డబ్బును తీసుకోవడం సులభతరం కాదు. ఒకవేళ అత్యవసరమైనప్పుడు తీసుకోవలసివచ్చినప్పుడు జమ చేసిన మొత్తంలో కేవలం 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఇస్తారు. మిగతా 80 శాతంతో పెన్షన్ కోసం ఏదైనా యాన్యుటీని కొనుగోలు చేయవలసి ఉంటుంది. 60 సంవత్సరాల తరువాతనైతే 40 శాతం తప్పనిసరిగా యాన్యుటీ కొనుగోలు చేయాలి, మిగతా 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు లేదా అవసరం లేకపోతే మొత్తం 100 శాతంతో పెన్షన్‌కు యాన్యుటీ తీసుకోవచ్చు. అలాగే 60 సంవత్సరాలలోపు ఖాతాదారుకి మరణం సంభవించినట్లయితే మొత్తం 100 శాతం సొమ్మును ఖాతాదారు నామినీకి/ లీగల్ హైర్స్కి అందజేస్తారు. ఈ ఖాతాను నెలకు 500 రూపాయల కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు. సంవత్సరానికి కనీసం 6,000 రూపాయలను జమ చేయవలసి ఉంటుంది. గరిష్ట మొత్తం అనేది ఖాతాదారుని వెసులుబాటుని బట్టి ఉంటుంది. టైర్-2: ఇది బ్యాంకు సేవింగ్ ఖాతా లా ఉంటుంది. డబ్బును జమ చేయడం, ఉపసంహరించడం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇందులో మదుపు చేయడానికి టైర్-1 ఖాతా యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి. ఈ ఖాతాను 1,000 రూపాయల కనీస మొత్తంలో ప్రారంభించి, ఆ తరువాత 250 రూపాయల కనీస మొత్తంతో జమ చేసుకొనే వెసులుబాటు ఉంది. సంవత్సరానికి కనీసం 2,000 రూపాయల మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది. టైర్-1 ఖాతాలో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారు ఆ మొత్తాన్ని సెక్షన్ 80 ఇఇఈ (1ఆ) కింద గరిష్టంగా 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80ఇ కింద ఇచ్చే 1,50,000 రూపాయల మినహాయింపుకు అదనంగా ఉంటుంది.