breaking news
Bandook
-
బందూక్ ఓ అద్భుతం!
‘‘ఈ 14 ఏళ్లలో రెండే సినిమాలు చూశా. ఒకటి ఎన్.శంకర్ తీసిన ‘జై బోలో తెలంగాణ’, రెండోది మా ‘రసమయి’బాలకిషన్ తీసిన ‘జై తెలంగాణ’. ఇప్పుడు గోరటి వెంకన్న పాట వినగానే ‘బందూక్’ సినిమా చూడాలనిపిస్తోంది’’ అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖమంత్రి జగదీశ్వరరెడ్డి అన్నారు. 24 శాఖల్లోనూ తెలంగాణ కళాకారులు పనిచేస్తున్న చిత్రం ‘బందూక్’. లక్ష్మణ్ మురారి(బాబి) దర్శకత్వంలో గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం గోరటి వెంకన్న రాయగా, కార్తీక్ కొడకండ్ల సంగీత దర్శకత్వంలో సాకేత్ పాడిన బ్రెత్లెస్ సాంగ్‌ను గురువారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్వరరెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ జిల్లాల చరిత్రను ఒక్కపాటలో పొందుపరచే సాహసం చేసి, సఫలమయ్యారు గోరటి వెంకన్న. ఈ పాట ఓ అద్భుతం. ఇలాంటి సినిమాలతో బంగారు తెలంగాణతో పాటు బంగారు సినీ పరిశ్రమను కూడా సాధించుకుందాం’’ అని జగదీశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఎం.పి. జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, దర్శకుడు శంకర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, బీజేపీ నేత కృష్ణసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓ ‘బందూక్’ ఆత్మ ఘోష
తెలంగాణ ఉద్యమ కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బందూక్’. లక్ష్మణ్ (బాబీ) స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం లోగోను తెలంగాణ జెఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, సి.ఎల్.రాజం, అల్లం నారాయణ, టీఎన్జీవో అధ్యక్షులు దేవిప్రసాద్, రసమయి బాలకృష్ణ, అద్దంకి దయాకర్, దేశ్పాండ్ శివాజి, తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షులు విజేందర్‌రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితర తెలంగాణ ప్రముఖులు దర్శక, నిర్మాత లక్ష్మణ్ ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ -‘‘ఓ బందూక్ ఆత్మఘోష ఇది. ఆత్మరక్షణ కోసం మనిషి తయారు చేసుకున్న బందూక్... నేడు చంపడం కోసమే ఉపయోగపడుతోంది. ప్రతి పోరాటంలో చంపడమే బందూక్ ఉనికిగా మారింది. తను లేని సమాజం లేదని బందూక్ అనుకుంటోంది. ఇలా బందూక్ ఆత్మఘోషను వివరిస్తూ ఈ సినిమా తీశాం. కేవలం తెలంగాణకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, రచనా సహకారం: కృష్ణచైతన్య జోషి, కార్యనిర్వాహక నిర్మాత: శ్రీధర్ మంచాల, సహ నిర్మాతలు: శ్రావణ్‌కుమార్, గణేష్‌బాబు, సమర్పణ: సంజయ్‌కుమార్.