breaking news
banamati
-
పెచ్చరిల్లిన మూఢజాడ్యం..!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా పచ్చని పల్లెల్లో మూఢజాడ్యం పెచ్చరిల్లుతూనే ఉంది. పోలీసులు కళాజాతా బృందాలతో అవగాహన కల్పిస్తున్నా.. పల్లెవాసుల్లో మార్పుకానరావడం లేదు. అందుకు నిదర్శనమే గుర్రంపోడు మండలం తెరాటిగూడెంలో మంగళవారం పట్టపగలే గ్రామ నడిబొడ్డున వృద్ధుడి దారుణ హత్య. మంత్రాల చేస్తున్నాడనే నెపంతోనే గ్రామానికి చెందిన కొందరు కర్రలతో కొట్టి.. బండరాళ్లతో మోది ఈ ఘాతుకానికి ఒడిగట్టడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు (నాగార్జునసాగర్) : మండలంలోని చేపూరు గ్రామ పంచాయతీ పరిధి తెరాటిగూడేనికి చెందిన కన్నెబోయిన రాములు(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారందరికీ వివాహాలు జరిపించాడు. పెద్దకుమారుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా చిన్నకుమారుడు రామలింగయ్య తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ గ్రామంలోనే ఉంటున్నాడు. ఏడాది క్రితం.. గ్రామానికి చెందిన పిల్లి సాయన్న భార్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు చేతబడి కారణంగానే వారు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యుల్లో అనుమానం నాటుకుంది. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా కూడా వారి అనుమానాలు రెట్టింపయ్యాయే కానీ తగ్గలేదు. కట్టెలతో కొట్టి.. బండరాళ్లతో మోది.. కుమారుడిపై జరిగిన దాడితో తల్లిదండ్రి రాములు, పెద్దమ్మ లబోదిబోమన్నారు. తమకు ఏ సంబంధం లేదని పంచాయితీలో చెప్పినా దాడిచేస్తారా అంటూ కుమారుడిని వెంటబెట్టుకుని దాడిచేసిన ఘటనాస్థలికి బయలుదేరారు. అప్పటికే అక్కడ ఉన్న పిల్లి సాయన్న, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యతో పాటు పిల్లి వెంకటయ్య, కన్నెబోయిన సత్తయ్య, మండలి వెంకటయ్యలు కలిసి రాములుపై దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన కుమారుడిని భార్యను పక్కకు తోసేసి గొడ్డలి, కట్టెలతో కొట్టి బండరాళ్లతో మోది రాములును అంతమొందించారు. గ్రామంలో పోలీస్ పహారా హత్య సమాచారం అందుకున్న మల్లేపల్లి సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్, పరిసర ఎస్ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్ట నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ నుంచి పోలీసు బలగాలను రప్పించి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాల్లో ఎనిమిది హత్యలు మండలంలోని మూరుమూల గ్రామమైన తెరాటిగూడెంలో గత రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది హత్యలు జరిగాయి. తెరాటిగూడెం మండలంలో సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డుల్లో నమోదైంది. రెండు హత్యలు చేతబడి నెపంతో చోటుచేసుకోగా మూడు హత్యలు రాజకీయ పరమైనవి. మరో రెండు కుటుంబ తగాదాల నేపథ్యంలో చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య ఏడాది కాలంగా మిస్టరీగా ఉండి ఇటీవలే వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చేతబడి నెపంతో మండలంలో గతంలో తానేదార్పల్లి, తేనపల్లి గ్రామాల్లో సజీవదహనాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. మంత్రాల నెపంతో జరిగిన హత్యలు అన్నీ పట్టపగలే జరుగుతున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. తొలుత కుమారుడిపై దాడి రాములు కుమారుడు రామలింగయ్య ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా గ్రామానికి చెందిన పిల్లి సాయన్న,కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యలు అడ్డుకున్నారు. నీ తండ్రి మంత్రాలు చేయడం కారణంగానే తమ ఇంట్లో మరణాలు సంభవించాయని సాయన్న గొడవకు దిగాడు. అంతడితో ఆగకుండా ముగ్గురు కలిసి రామలింగయ్యపై దాడిచేసి కత్తితో పొడవడంతో చేతికి గాయమైంది. రామలింగయ్య వారినుంచి తప్పించుకుని ఇంటికి పరుగెత్తుకొచ్చి తల్లిదండ్రికి జరిగిన విషయం వివరించాడు. -
మూఢవిశ్వాసంతోనే హత్య
మొయినాబాద్, న్యూస్‌లైన్: మూఢ విశ్వాసమే వృద్ధుడి హత్యకు దారితీసింది. వృద్ధుడు బాలయ్య తన కుటుంబానికి బాణామతి చేసి భార్య, తల్లి మృతికి కారణమయ్యాడని అనుమానించి ఆయనను చంపేసినట్లు నిందితుడు యాదయ్య అంగీకరించాడని సీఐ రవిచంద్ర తెలి పారు. మండల పరిధిలోని బాకారంలో ఈనెల 15న జరిగిన బాలయ్య హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి శనివారం నిందితుడిని రిమాండుకు తరలించారు. సీఐ రవిచంద్ర విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఎలా చిక్కాడు..? బాకారం గ్రామానికి చెందిన మాల బాలయ్య(70)ను అదే గ్రామానికి చెందిన కాశ యాదయ్య(42) ఈనెల 15న సాయంత్రం దారుణంగా కొట్టిచంపాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదయ్య శంషాబాద్ పరిసర ప్రాంతాలకు పారిపోయాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా వేశారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం యాదయ్య శంషాబాద్ బస్టాండు సమీపంలో తిరుగుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి మొయినాబాద్ ఠాణాకు తరలించి విచారించారు. ఎందుకు చంపేశాడు..? బాలయ్య బాణామతి చేస్తాడని గ్రామస్తులు విశ్వసించేవారు. యాదయ్య 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు వారి పూరి గుడిసె తగులబడిపోయింది. దానికి బాలయ్యే కారణమని యాదయ్య బలం గా విశ్వసించాడు. పదిహేడేళ్ల క్రితం యాదయ్య చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన అరుణను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఆమె గర్భవతిగా ఉండగా మృతిచెందింది. బాలయ్య బాణామతి చేయడంతోనే తన భార్య మృతిచెందిందని యాదయ్య నమ్మి పగ పెంచుకున్నాడు. అనంతరం ఆయన మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం యాదయ్య తల్లి ముత్తమ్మ మరణించింది. ఆమెను సైతం బాలయ్యే బలిగొన్నాడని విశ్వసించాడు. తన కుటుంబాన్ని బాలయ్య పొట్టనబెట్టుకున్నాడని భావించాడు. ఈక్రమంలో బాలయ్య హత్యకు గురయ్యేకంటే వారం రోజుల ముందు యాదయ్య అతడిపై దాడి చేశాడు. గ్రామస్తులు అడ్డుకుని అతణ్ని పోలీసులకు అప్పగించా రు. యాదయ్యను పోలీసులు నగరంలో ని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. సంక్రాం తి పండుగ నేపథ్యం లో ఆయనను కుటుంబీకులు ఇటీవల ఇంటికి తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన ఆయన ఈనెల 15న సాయంత్రం బాలయ్య మేకలు మేపుతుండగా అతడి దగ్గరకు వెళ్లాడు. ‘నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేశావ’ని గొడవపడ్డాడు. యాదయ్య తన చేతిలో ఉన్న కర్రతో వృద్ధుడి తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కటాకటాల్లోకి యాదయ్య.. యాదయ్యను శనివారం మొయినాబాద్ పోలీసులు రిమాండుకు తరలిం చారు. మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న ఎస్సై సైదులు, కానిస్టేబుళ్లు రమేష్, కృష్ణ, చంద్రయ్య, రాజమల్లేష్, పండరి, నర్సింలును ఈ సందర్భంగా సీఐ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో ఏఎస్సై అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.