breaking news
balurghat
-
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
‘ప్రచార బుల్లెట్’ ఎక్కిన బెంగాల్ బీజేపీ చీఫ్
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుల్లెట్ వాహనంపై బాలూర్ఘాట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు బాలూర్ఘాట్ రైల్వేస్టేషన్లో రైలు దిగిన మజుందార్‌కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల నినాదాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ నడుపుతూ మజుందార్ ప్రచారం నిర్వహించారు . మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎంసీపై పలు విమర్శలు చేశారు. ‘ఓ వైపు ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తృణమూల్ ఇక్కడి నుంచి అనేక కుంభకోణాలు చేసిన దొంగను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది దొంగలు, మంచి వ్యక్తుల మధ్య పోరు. తృణమూల్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది’ అన్నారు. బాలూర్ఘాట్ నియోజకవర్గం నుండి టీఎంసీ తన లోక్‌సభ అభ్యర్థిగా బిప్లబ్ మిత్రను నిలబెట్టింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. -
స్మార్ట్‌ఫోన్ కోసం రక్తం అమ్ముకునేందుకు ప్రయత్నించిన అమ్మాయి
కోల్‌కతా: స్మార్ట్ కొనుక్కునే స్తోమత లేక 16 ఏళ్ల అమ్మాయి చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. జిల్లా ఆస్పత్రికి వెళ్లి ఆమె రక్తాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నించింది. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్ఘాట్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన సోమవారం జరిగింది. సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం ఈ అమ్మాయి సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లింది. అయితే ఎవరి కోసమే రక్తాన్ని తీసుకెళ్లేందుకు ఆమె వచ్చి ఉంటుందని వారు అనుకున్నారు. కానీ రక్తం అమ్ముకోవడానికి అక్కడికి వచ్చినట్లు బాలిక చెప్పగానే వారు షాక్‌కు గురయ్యారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా.. సోదరుడి చికిత్సకు డబ్బులు లేవని, అందుకే రక్తం విక్రయించాలనుకున్నట్లు బాలిక చెప్పింది. అయితే సిబ్బంది మాత్రం అందుకు నిరాకరించారు. వెంటనే చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించగా.. అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. స్మార్ట్‌పోన్ కొనుక్కునేందుకు తన దగ్గర డబ్బులు లేవని, అందుకే రక్తం అమ్ముకోవాలనుకున్నట్లు ఒప్పుకుంది. కౌన్సిలింగ్ అనంతరం అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది. అయితే ఈ బాలిక ఆదివారం రోజే బంధువు మొబైల్ పోన్ ద్వారా ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ పెట్టింది. దాని ఖరీదు రూ.9,000. గురువారం అది ఆమె చేతికి రానుంది. అయితే అందుకు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో రక్తం అమ్ముకోవాలనుకుంది. అంతేకాదు ఇంట్లో ట్యూషన్‌కు వెళ్లొస్తానని చెప్పి తాపన్ ప్రాంతం నుంచి బస్సులో 30కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. సైకిల్‌ను కూడా బస్టాండ్‌లోనే వదిలిపెట్టింది. కూతురు ఇంటి నుంచి వెళ్లినప్పుడు తాను ఇంట్లో లేనని తండ్రి కుమార్ దాస్ తెలిపారు. ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని వాపోయాడు. తనకు నాలుగో తరగతి చదివే కుమారుడు కూడా ఉన్నాడని చెప్పాడు. కుమార్ దాస్ కూరగాయల వ్యాపారి కాగా.. ఆమె భార్య గృహిణి. చదవండి: కెమెరా కంటికి చిక్కిన అరుదైన చిరుత.. ఫోటో వైరల్.. -
స్మగ్లర్‌ను పట్టుకునేందుకు నదిలోకి దూకిన జవాను
బాలూర్ఘాట్: దేశ రక్షణ విషయంలో భారత జవాన్లు ఎంతటి ధైర్య సాహసాలతో ఉంటారో చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. ఓ స్మగ్లర్‌ను పట్టుకునే క్రమంలో భారత జవాను వీర మరణం పొందాడు. నదిలో దూకి పారిపోతున్న స్మగ్లర్‌ను బంధించేందుకు తాను నదిలో దూకి కొంత దూరం ఈదిన తర్వాత మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. ఆ బీఎస్ఎఫ్ జవాను చేసిన సాహసం చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. బంగ్లాదేశ్‌కు భారత్‌కు ఉన్న సరిహద్దు వద్ద ఓ నదీ ప్రవాహం ఉంది. బంగ్లా సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్న ఓ చొరబాటుదారుడిని గుర్తించిన సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్)కు చెందిన సెక్టార్ కమాండర్ ప్రశాంత్ రాయ్ అతడిని వెంబడించాడు. ఈ క్రమంలో అతడు నదిలో దూకి పారిపోయే ప్రయత్నం చేస్తుండటంతో తాను కూడా నదిలో దూకి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.