breaking news
bahjan samaj party
-
పంజాబ్‌లో కొత్త పొత్తు పొడిచింది
చండీగఢ్: పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించారు. మిగిలిన 97 స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేస్తుంది. పంజాబ్ రాజకీయాల్లో ఇది చరిత్రాత్మకమైన రోజని ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహాలను రచించడానికి త్వరలోనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీదళ్ కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసింది. పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడంతో మోదీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క అకాలీదళ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ఎస్ఏడీతో పొత్తును బీఎస్పీ చీఫ్ మాయావతి సరికొత్త సామాజిక ముందడుగు అని అభివర్ణించారు. పొత్తుతో సమాఖ్య ప్రజాస్వామ్య విప్లవం ప్రారంభమవుతుందని ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. దళిత ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 32 శాతం ఓట్లు దళితులవే కావడంతో వారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీఎస్పీతో అకాలీదళ్ చేతులు కలిపింది. జలంధర్, హోషియార్పూర్, నవాన్షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితులు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. డోవుబా ప్రాంతంలో బీఎస్పీకి మంచి ఆదరణ ఉంది. వచ్చే ఎన్నికల్లో మాల్వా ప్రాంతంలో ఏడు సీట్లు, మాజాలో అయిదు, డోవుబాలో ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి పోటీచేసి 13 ఎంపీ స్థానాలకు గాను 11 సీట్లను కొల్లగొట్టి తమ పొత్తుకి ఎదురులేదని నిరూపించాయి. అప్పట్లో మూడు స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ అన్నింట్లోనూ విజయం సాధించింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఆ పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్నాయి. చదవండి: బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఇరకాటంలో చీఫ్ -
లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరి పోటీ
లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. దేశంలోని ఏ ఒక్క ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఆమె శనివారం లక్నోలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లేదా బీజేపీతో బయటినుంచి లేదా అంతర్గతంగా పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని పేర్కొన్నారు. బీఎస్పీని అభిమానించే ప్రజలను తప్పుదోవ పట్టించడం, పార్టీని దెబ్బతీయడం లక్ష్యంగా ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చక్కని ఫలితాలను సాధిస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు. ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు చేస్తున్న ప్రయత్నాలు బీఎస్పీ తన లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడగలవని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో తమ పార్టీ నంబర్‌వన్‌గా నిలుస్తుందని గట్టి నమ్మకం వెలిబుచ్చారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తోందని చెబుతూ.. త్వరలో ఈ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు ప్రకటించారు.