breaking news
baga reddy stadium
-
ప్రజా నాయకుడు
నాయకుడు ప్రజల్లో నుంచి రావాలి.. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని రావాలి.. ప్రజలు కావాలని కోరుకుంటే రావాలి.. అప్పుడే ఆ నాయకుడు సంపూర్ణ పాలకుడు అవుతాడు అనడానికి మొగలిగుండ్ల బాగారెడ్డి నిదర్శనం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా దాదాపు ఐదున్నర దశాబ్దాలు ప్రజా క్షేత్రంలో గడిపిన జీవితం ఆయనది. రాష్ట్రంలో, కేంద్రంలో వివిధ పదవులు అలంకరించి వాటికి వన్నె తెచ్చారాయన. ఇందిరాగాంధీ ముఖ్య అనుచరుడుగా ముద్రపడిన ఈయన జీవితకాలంలో సర్పంచ్ నుంచి లోక్‌సభ సభ్యుని వరకు వివిధ స్థాయిల్లో పోటీచేసిన ప్రతిసారీ ప్రజల మద్దతు చూరగొని హేమాహేమీలను ఓడించి వివిధ పదవులను అలంకరించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన ఇక ఎన్నికల్లో పోటీకి దిగలేదు.- ఈరగాని భిక్షం, సాక్షి– సిద్దిపేట ప్రజా నాయకుడుగా పేరున్న బాగారెడ్డి ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం మలిచల్మ గ్రామంలో 1930, జూన్ 17న వ్యవసాయ కుటుంబంలో బాగారెడ్డి జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసమంతా జహీరాబాద్‌లోనే కొనసాగించారు. సెకండరీ ఎడ్యుకేషన్‌ను జహీరాబాద్‌కు పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను పొంది, తిరిగి స్వగ్రామానికి వచ్చారు. గ్రామ ప్రజలతో మమేకం కావడం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో ఆయన నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే తొలిసారిగా మలిచల్మ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇలా గ్రామ సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన బాగారెడ్డి ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదిగారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రతినిధిగా.. నూనుగు మీసాల వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసిన బాగారెడ్డి పాతికేళ్ల వయసులోనే గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 26 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై పిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన వారి జాబితాలో చేరారు. ఇలా ఆయన జీవించిన 74 సంవత్సరాల్లో దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం పాటు ప్రజాప్రతినిధిగానే గడిపారు. 1957 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బాగారెడ్డి.. సమీప ఇండిపెండెంట్ అభ్యర్థిపై 5,568 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత 1962, 1967, 1972, 1978, 1983, 1985 శాసనసభ ఎన్నికల్లో వరుసగా జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయాలను నమోదు చేశారు. అనంతరం 1989లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి మాణిక్రెడ్డిపై 96,096 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం 1991, 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించారు. చివరికి 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆలె నరేంద్ర చేతిలో ఓడిపోయారు. ఈయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, భారీ పరిశ్రమలు, రెవెన్యూ మంత్రిత్వ శాఖలకు సారథ్యం వహించారు. నాటి కాంగ్రెస్ రాజకీయాలలో ఇందిరాగాంధీ ప్రధాన అనుచర వర్గంలో ఒకరిగా వ్యవహరించే వారు. క్లిష్ట పరిస్థితుల్లో 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీని పోటీకి దింపి, ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు బాగారెడ్డి చేసిన కృషికి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందాయి. చివరి ఎన్నికలో పోటీ తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. 2004లో గుండెపోటుకు గురై మరణించారు. -
ఆశీర్వాద పండుగలకు సర్వం సిద్ధం
నేటి నుంచి మూడు రోజుల పాటు జహీరాబాద్‌లో కూటములు హాజరు కానున్న అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ ఎం.అనిల్‌కుమార్ గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు జహీరాబాద్: స్థానిక బాగారెడ్డి స్టేడియంలో ఈనెల 5నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ఏసుక్రీస్తు ఆశీర్వాద పండుగల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల కోసం స్టేడియంలో భారీగా ఫ్లడ్లైట్లను, వేదికను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఏసుక్రీస్తు ఆశీర్వాద పండుగలకు వాక్యోపదేశకులుగా అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ ఎం.అనిల్‌కుమార్ హాజరుకానున్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం గా క్రిస్మస్ సందేశం, ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కూటములకు క్రైస్తవులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాలు నిలిపేం దుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. పట్టణంలో క్రైస్తవుల భారీ ర్యాలీ మూడు రోజల పాటు నిర్వహించతలపెట్టిన ఏసుక్రీస్తు ఆశీర్వాద పండుగలను పురస్కరించుకుని గురువారం జహీరాబాద్ పట్టణంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ ప్రసంగీకులు బ్రదర్ అనిల్‌కుమార్ ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వనున్న నేపథ్యంలో సభలు విజయవంతం కావాలని కోరుతూ మెథడిస్ట్, సెవెంత్‌డే సంఘాలతో పాటు ఇండిపెండెంట్ చర్చిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అల్లీపూర్‌లోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చి నుంచి ప్రారంభమైన ర్యాలీలో క్రైస్తవులు భారీగా పాల్గొన్నారు. మోటారు సైకిళ్లు, ఆటోలు, కార్లు, వ్యాన్లతో కూడా ర్యాలీ నిర్వహించారు. 65వ నంబరు జాతీయ రహదారి, బ్లాక్‌రోడ్డు, శ్రీనివాస్ థియేటర్ల మీదుగా బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్‌కు చేరుకున్నారు. ర్యాలీలో యువతీ యువకులు సంగీత వాయిద్యాలతో క్రీస్తును ఘన పరుస్తూ భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం గ్రౌండ్లో మానవహారం నిర్మించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న పండుగలో బ్రదర్ అనిల్‌కుమార్, దైవ సందేశాలను అందిస్తారని మీడియా ఇన్చార్జి బ్రదర్ నోముల మాణిక్యరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు యవనస్తుల ప్రత్యేక కూడిక జరుగుతుందన్నారు. ర్యాలీలో క్రైస్తవ సంఘకాపరులతో పాటు యూత్ లీడర్స్ బ్రదర్ స్టాలిన్, నవీన్, శరీన్, నిరంజన్, బాబి, సన్నిలు పాల్గొన్నారు.