breaking news
ayalu
-
జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు
గాంగ్టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. -
బడ్జెట్ విడుదల అరకొరే
♦ పెండింగ్ వేతనాలకు నోచుకోని అంగన్వాడీలు ♦ తీవ్ర నిరాశలో కార్యకర్తలు, ఆయాలు ♦ అధికారుల అవసరాలకు మాత్రం దండిగా నిధులు ప్రొద్దుటూరు: అంగన్వాడీలకు మళ్లీ నిరాశే ఎదురైంది. పెరిగిన వేతనాలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పీతల సుజాత ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని తన కార్యాలయంలో ప్రకటించారు. దీంతో అంగన్వాడీలు తమకు పెరిగిన వేతనాలతోపాటు పెండింగ్ వేతనాలు వచ్చినట్లేనని ఎంతగానో ఆశపడ్డారు. తీరా బడ్జెట్ను చూస్తే అరకొరగా విడుదల చేయడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లాకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంగన్వాడీలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాల్సి ఉంది. అలాగే నెలల తరబడి ఇంటి అద్దెలు, పాల కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు, ఇతర బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే ఒకటి రెండు నెలలకు మాత్రమే బడ్జెట్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, దువ్వూరు మండలాలకు సంబంధించి 328 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్యకర్తలు, ఆయాలకు కలిపి నెలకు రూ.35లక్షల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను రూ.కోటికిపైగా నిధులు అవసరం కాగా ప్రస్తుతం రూ.46,09,500 మాత్రమే మంజూరైంది. జిల్లావ్యాప్తంగా 15 ప్రాజెక్టులకు సంబంధించి 3,625 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ ప్రకారం ఖాళీలు పోను 7వేలమంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ విడుదల చేస్తుందోనని అంగన్వాడీలు చర్చించుకుంటున్నారు. అలాగే అధికారులకు మాత్రం వాహనాల బాడుగలు, ప్రాజెక్టు కార్యాలయాల్లోని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు మంజూరు చేశారు.