breaking news
aversion to life
-
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
కాకినాడ క్రైం: కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కాకినాడ–సామర్లకోట రోడ్డులో నివాసం ఉంటున్న మల్లుల్లి వెంకటకృష్ణ (41) చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకుని శుక్రవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిసిన వివరాల మేరకు వెంకటకృష్ణ బీఫార్మసీతో పాటు బీఎల్ పూర్తి చేశాడు. వెంకటకృష్ణకు 2010లో స్థానిక సూర్యనారాయణపురంనకు చెందిన శ్రీదేవితో వివాహమైంది. వీరికి సంతానం లేరు. వీరు 2012 వరకు హైదరాబాదులో కాపురం ఉన్నారు. అనంతరం కాకినాడలోని వెంకటకృష్ణ తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. జగన్నాథపురంలోని ఒక మెడికల్ షాపులో వెంకటకృష్ణ పని చేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏపీఎస్పీ వద్దకు వేరే కాపురం వెళ్లిపోయారు. కొన్నేళ్ల తరువాత భార్యభర్తల మధ్య తరచూ అభిప్రాయభేదాలు వస్తుండడంతో తగాదాలు పడేవారు. దీంతో ఏడాదిన్నరగా విడిపోయి ఉంటున్నారు. ఇక కలసి కాపురం చేయడం సాధ్యం కాదని భావించి, ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చి జవనరి 2017లో కోర్టులో విడాకులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు సూచనల మేరకు ఇరువురికి కాకినాడ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో పలుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా కలిసి కాపురం చేసేందుకు ఇరువురు అంగీకరించకపోవడంతో ఎట్టకేలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు కట్నంగా తీసుకున్న నగదుతోపాటు, మరికొంత పరిహారంగా రూ.6.25 లక్షలు భార్యకు చెల్లించేందుకు కోర్టులో లాయర్ ద్వారా వెంకటకృష్ణ అంగీకరించాడు.నగదు చెల్లించేందుకు ఆగస్టు వరకు కోర్టు గడువిచ్చింది. అయితే నగదు సర్ధుబాటు కాకపోవడంతో మరో రెండు నెలలు గడువు కోరాడు. డబ్బుల కోసం కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద ప్రయత్నించినా పూర్తిస్థాయిలో డబ్బులు సర్ధుబాటు కాకపోవడం, డబ్బులు చెల్లించేందుకు శుక్రవారం కోర్టు వాయిదా కావడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. కోర్టు వాయిదాకి వెళ్లకుండా శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని మెడకు చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సోదరుడు శ్రీనివాస బ్రహ్మేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై జీవీవీ సత్యనారాయణ తెలిపారు. అత్తారింటికి కాపురం వచ్చేయమని భార్య, అత్త, మామలు మానసిక వేధింపులకు పాల్పడటంతోనే తమ సోదరుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడు సోదరులు శ్రీనివాస బ్రహ్మేశ్వరరావు, పలివెల లక్ష్మి ఆరోపించారు. ఆడపడుచు, కుటుంబ సభ్యుల వేధింపులతోనే భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, మృతికి వారే కారణమని భార్య శ్రీదేవి ఆరోపించింది. -
పెళ్లి కావడం లేదనే బెంగతో..
చిట్యాల: తనకు పెళ్లి సంబంధాలు కలిసి రావడం లేదని, ఇక పెళ్లి కాదనే బెంగతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఏంపేడు గ్రామశివారులో శుక్రవారం జరిగింది. ఎస్సై వెంకట్రావు కథనం ప్రకారం... మండలంలోని బూర్నపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ల దేవేందర్(28) తనకు పెళ్లి కావడం లేదనే బెంగతో గత ఏడాది నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం దేవేందర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండలంలోని ఏంపేడు గ్రామశివారులో శవమై కనిపించాడు. తన కుమారుడు పెళ్లికావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి చిన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.