breaking news
auto expo 2016
-
చక్రాలు లేకుండానే సెలబ్రిటీల చక్కర్లు
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటీనటులు, క్రికెట్ సెలబ్రిటీలతో ఆటో ఎక్స్పో అదరహో అనిపిస్తోంది. ఈ ఆటో ఎక్స్పో లో సెలబ్రిటీలు కాళ్లకు చక్రాలు లేకుండానే చక్కర్లు కొడుతున్నారు. బాలీవుడ్, క్రికెట్ దిగ్గజాలందరూ ఆటోఎక్స్ పోకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ ఆటోఎక్స్‌పోతో నోయిడా కళకళలాడుతోంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, జహీర్ ఖాన్, మహింద్రా అమర్‌నాథ్‌లంతా ఆటోఎక్స్పోలో సందడి చేయడంతో, ఈ వేదిక ఒక్కసారిగా క్రికెట్ గ్రౌండ్‌ను తలపించింది. సచిన్ టెండూల్కర్ ఆటోఎక్స్‌పోకు రావాలా వద్దా అనే డైలమా నుంచి తేరుకుని, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌కు సెలబ్రిటీగా నిలిచారు. ఈ సందర్భంగా ఆ సంస్థ విడుదల చేసిన కార్ల మోడళ్ల గురించి సచిన్ వివరించారు. తనకు కార్లంటే చాలా ఇష్టమని.. ఇలాంటి ఆటో ఎక్స్ పోలు తన లాంటివారికి ఎంతో నచ్చుతాయన్నారు. ఈ ఎక్స్పో లో ఆవిష్కరించే అన్ని బీఎమ్‌డబ్ల్యూ సిరీస్‌లకు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలువనున్నారు. విరాట్ కోహ్లి, బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్‌తో కలిసి ఆడీ ఆర్8 వి10 ప్లస్ కారును ఆవిష్కరించారు. ఆడీ కారుని తిలకిస్తూ వీరిద్దరూ సందడి చేశారు. ఆడీ కార్లకు విరాట్ బ్రాండ్ అంబాసిడర్. బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ, మెర్సిడస్ బెంజ్ కార్లకు పోటీగా దూసుకుపోతున్న జాగ్వార్ ఎక్స్ఈ కారుని బాలీవుడ్ తార కత్రినా కైఫ్ ఆవిష్కరించారు. అలాగే నటుడు జాన్ అబ్రహం కూడా నిస్సాన్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆటో ఎక్స్‌పోలో పాల్గొన్నాడు. సినీ తారలు, క్రికెట్ దిగ్గజాలే కాక కంపెనీ యాజమాన్యాలు తమ ప్రొడక్ట్స్ ప్రమోషన్లో మునిగిపోయాయి. పలు కంపెనీలు తమ కొత్త కార్లను ఆవిష్కరించాయి. ప్రపంచ కార్ల దిగ్గజ కంపెనీలు బీఎమ్‌డబ్ల్యూ, మెర్సెడస్, దేశీయ బ్రాండ్ కంపెనీలు మహీంద్రా, టాటా మోటార్స్‌లతో పాటు మొత్తం 65 ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లతో ఆటోఎక్స్పోలో సందడి చేస్తూ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ ఎక్స్‌పోతో దేశంలో కార్లకు మంచి డిమాండ్ పెరిగి, ఆటోమొబైల్ కంపెనీలకు లాభాలను చేకూరనుందని పలు కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. -
సరికొత్త హైబ్రిడ్ కారు, లీటరుకు 100 కి.మీ.
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన వాహనాలు తయారీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దశలో కంపెనీల మధ్య పోటీ కూడా బాగా పెరిగింది. కేంద్రప్రభుత్వం సైతం ఇలాంటి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లనే ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఓ సరికొత్త కారును రూపొందించింది. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో లో రెనో తన కొత్త హైబ్రిడ్ కారును ప్రదర్శించింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాచ్ బ్యాక్ కారు లీటరు పెట్రోలుతో సుమారు వంద కిలోమీటర్లు నడుస్తుందని ధీమాగా చెబుతోంది. హై ఎండ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ కాంపాక్ట్ కార్ పెట్రోలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటితోనూ పనిచేస్తుందట. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం... రెనో ఆవిష్కరించిన ఈ కాంపాక్ట్ కారు మిగతావాటితో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుంది. దీని బరువు వెయ్యి కిలోల లోపే ఉండటం వల్ల ఇంధనం వినియోగం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అల్యూమినియం, స్టీలు, మెగ్నీషియం లాంటి లోహాలను ఈ కారు తయారీలో వాడడంతో బరువు తగ్గిందని రెనో పేర్కొంది. అయితే రెనో ఒక శాంపిల్‌గా మాత్రమే ఈ కారును ఆటో ఎక్స్పో లో చూపింది. కానీ మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ధర ఎంత వివరాలను మాత్రం ప్రకటించలేదు.