breaking news
attacked woman
-
కానిస్టేబుల్ వీరంగం: మహిళపై దాడి
-
ఒత్తిడిలోనూ విచక్షణ కోల్పోవద్దు
న్యూఢిల్లీ: మహిళపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇటుకతో దాడి చేసిన ఘటనపై అసహనం వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం తన సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. శాఖా పరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలతో వ్యవహరించే సమయంలో సంఘటనలను రికార్డు చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంటతీసుకెళ్లాలని పోలీసులకు సూచించారు. ఒత్తిడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా పోలీసులు విచక్షణ కోల్పోరాదని పేర్కొన్నారు. పోలీస్ అధికారులకు ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనం కోల్పోని విధంగా శిక్షణ ఇస్తామని బస్సీ విలేకర్లకు తెలిపారు. మహిళపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటనలో అనేక మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలూ ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కేసుకు సంబంధించి కానిస్టేబుల్ 44 సెకన్ల నిడివిగల ఆడియో క్లిప్‌ను సమర్పించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అందులో సదరు మహిళకు కోర్టు చలానా ఇస్తానని కానిస్టేబుల్ అన్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అసభ్యకరమైన సంభాషణ కొనసాగింది. రూ. 200 లంచం అడిగినట్లు మహిళ చేసిన ఆరోపణకు విరుద్ధంగా ఆడియోలో ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. టేప్ వాస్తవికతను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.