breaking news
attack on mro
-
ఎమ్మార్వోపై దాడి.. సీఎంతో చర్చిస్తాం: రెవెన్యూ సంఘాలు
ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం చర్చిస్తామని, ఆ తర్వాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటామని రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదం అయినట్లే నేతలు చెబుతున్నారు. ఎమ్మార్వోతో పాటు ఇతర సిబ్బందిపై పెట్టిన కేసులను రద్దు చేస్తున్నట్లు మంత్రి చెప్పారన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో దాడి చేసిన వాళ్లందరినీ అరెస్టు చేయాలని ఎస్పీ, డీఐజీలకు చెప్పారని నాయకులు అన్నారు. అలాగే దాడి జరుగుతున్నా చూస్తూ ఊరుకున్న ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఎమ్మెల్యే గన్ మన్ (ఒక ప్రైవేటు వ్యక్తి) మీద చర్యలు తీసుకోవాలని సీఎం క్యాంపు కార్యాలయానికి నివేదిక పంపారని తెలిపారు. ముఖ్యమంత్రి వద్దకు దాడికి గురైన ఎమ్మార్వో, జిల్లా నాయకులను సోమవారం తీసుకెళ్తానని ఉమా హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆయనతో చర్చించిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాళ్ల వైపు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నామని, తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి తెలిపారన్నారు. అయితే.. త్వరలో గోదావరి పుష్కరాలు ఉండటంతో ఆ సమయంలో రెవెన్యూ ఉద్యోగుల నుంచి సహకారం లేకపోతే పని జరగదన్న కారణంతో.. ఉద్యోగ సంఘాలను బుజ్జగించి కేసును డైల్యూట్ చేయాలన్న ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విషయంలో కూడా తగినంత సమయం తీసుకుని, ఈలోపు తమకు కావల్సినట్లుగా పరిస్థితులను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితులనే సృష్టించేలా వాతావరణం కనిపిస్తోంది. -
స్తంభించిన ‘రెవెన్యూ’ సేవలు
తహసీల్దార్‌పై దాడికి నిరసనగా ఉద్యోగుల ఆందోళన కలెక్టరేట్, ఆర్డీఓ, మండల కార్యాలయాల్లో నిలిచిన కార్యకలాపాలు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మీనా హామీతో అందోళన విరమణ హైదరాబాద్‌సిటీ: నగరంలోని బహదూర్‌పురా మండల తహసీల్దార్ హసీనా బేగంపై దాడిని నిరసిస్తూ గురువారం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం, తహశీల్దార్ అసోసియేషన్లు సంయుక్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ధర్నాకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం, వీఆర్ఓ సంఘం, టీఎన్జీఓలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. స్తంభించిన కార్యకలాపాలు తహశీల్దార్‌పై దాడికి నిరసనగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాలు, పదహారు మండల కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, కలెక్టరేట్లోని రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి, ధర్నాలో పాల్గొన్నారు. దీంతో అన్నిచోట్లా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నల్లబ్యాడ్జీలు ధరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్ల కార్డులు పట్టుకొని విధుల నిర్వహణలో భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ధర్నాలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగుల ఆందోళనకు జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురామ్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్లు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో అధికార, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు లచ్చిరెడ్డి, శివశంకర్, కృష్ణ యాదవ్, హరినాథ్ జిల్లా నాయకులు రామకృష్ణ, నాగరాజారావు, చంద్రకళ, జహీరుద్దీన్, మల్లేష్ కుమార్, లీలా, సి.హెచ్. వెంకటేశ్వర్లు, చంద్రకళ మాట్లాడారు. మీనా హామీతో అందోళన విరమణ.. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మీనా హామీతో ధర్నాతో పాటు శుక్రవారం నుంచి నిర్వహించతలపెట్టిన అందోళన కార్యక్రమాలను విరమింపజేస్తున్నట్లు తహశీల్దార్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. మీనాకు వినతి పత్రం సమర్పించగా తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్నా వేదిక వద్దకు వచ్చిన జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.