breaking news
Athma Gourava Yatra
-
..అలా ముందుకు వెళదాం: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వస్తున్నా మీకోసం, తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ గ్రాఫ్ పెరక్కపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను నమ్మించేందుకు చాలా శ్రమపడుతున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలతో గురువారం తన నివాసంలో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. పార్టీకి మంచి భవిష్యత్తే ఉంటుందని, తనను నమ్మాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ సీమాంధ్ర ప్రజలు సానుకూలంగా తనను అర్థం చేసుకున్నారని తెలిపారు. మా లేఖ వల్లనే తెలంగాణ అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రాంత నేతలు వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలోనూ పార్టీ వెనకబడిపోయిందని నేతలు ప్రస్తావించగా... రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉభయ ప్రాంతాల నేతలందరినీ త్వరలోనే ఢిల్లీకి తీసుకెళతానని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి విషయాలను వారి దృష్టికి తీసుకురానున్నట్లు తెలిపారు. శుక్రవారం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని శనివారం ఉమ్మడి సమావేశంలో పరిష్కారమార్గాలు సూచిస్తానని చెప్పారు. సమావేశానంతరం గాలి ముద్దుకృష్ణమనాయుడు, పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఆత్మగౌరవయాత్ర అనుభవాలను తెలిపారన్నారు. 14వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం సమర్పించిన నివేదిక తప్పుల తడకగా ఉందని, ఇది రాష్ట్రానికి మేలు చేయకపోగా కీడే ఎక్కువ చేస్తుందని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు, టి. దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సిం హులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, వైఎస్ చౌదరి, సీఎం రమేష్, రావుల చంద్రశేఖరరెడ్డి, ఎనుముల రేవంత్‌రెడ్డి, జి.జైపాల్‌యాదవ్, కంభంపాటి రామ్మోహనరావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఇనుగాల పెద్దిరెడ్డి, వర్ల రామయ్య, ఎం.అరవిందకుమార్‌గౌడ్, వీవీవీ చౌదరి, శమంతకమణి, పంచుమర్తి అనూరాధ, సీతక్క, శోభా హైమవతి, బి. శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం సమావేశం జరగ్గా, ఉదయం జరిగిన సమావేశంలో నేతలతోపాటు మీడియా విశ్లేషకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు: బాబు
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయిన ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని సోనియా గాంధీ రెండు ముక్కలు చేయాలని చూస్తోందని ఆయన విమర్శించారు. మన ప్రధాన అసమర్ధ ప్రధాని... సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ అని దుయ్యబట్టారు. ఓట్లతో కోసంమే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆత్మగౌరవ యాత్రలో ఆరోపించారు. లోక్‌సభ, రాజ్యసభలో సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు. కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలు అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు అధికారం అప్పగిస్తే వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తానని మరోసారి చంద్రబాబు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
క్రోసూరులో చంద్రబాబుకు సమైక్య సెగ
ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అడుగడుగునా సమైక్య సెగ తగులుతోంది. గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రబాబుకు సమైక్య ఉద్యమ వేడి తాకింది. ఆయనను అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. సమైక్యవాద ప్లకార్డ్స్‌తో నిరసన తెలిపారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి రెడ్డిగూడెంలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు యువకులు ముందుకు దూసుకువచ్చి సమైక్యవాదానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. బాబు వ్యక్తిగత సిబ్బంది, రక్షణ వలయాన్ని దాటుకుంటూ బస్ వద్దకు చేరుకుని... సమైక్యవాదం వర్ధిల్లాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు ‘ఎవడ్రా మీకు ప్లకార్డులు ఇచ్చి పంపింది?’ అంటూ దుర్భాషలాడారు. వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగింపజేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపివేసి సత్తెనపల్లికి వెళ్లిపోయారు.