ప్రముఖ నాస్తికవాది లవణం కన్నుమూత
విజయవాడ: ప్రముఖ నాస్తికవాది, సంఘ సంస్కర్త గోపరాజు లవణం(86) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
లవణం చిన్నతనంలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. అస్పృస్యతా నిర్మూలన కులనిర్మూలన కోసం కృషిచేశారు. సామాజిక జాగృతికి అనేక విధాల కృషి చేసిన లవణం హేతువాదం, నాస్తిక వాదంపై అనేక గ్రంథాలు రచించారు. అలాగే సంస్కార్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన లవణం...నిజామాబాద్ జిల్లాలో జోగినీ వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేశారు. ప్రముఖ కవి గుర్రం జాషువా కుమార్తె హేమలతను లవణం వివాహం చేసుకున్నారు. డాక్టర్ సమరం...లవణం సోదరుడు. లవణం మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
కాగా గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావుకు లవణం పెద్ద కుమారుడు. ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న కాలంలో పుట్టిన ఆయనకు లవణం అని పేరు పెట్టారు.