వివరం : అత్త + అమ్మ
దేవుడు అంతటా ఉండలేడు కాబట్టి, తన ప్రతిరూపంగా అమ్మను సృష్టించాడంటారు. కానీ అమ్మ పాత్రలో ఎప్పుడూ సీరియస్‌గా ఉండటం బోర్ కొట్టిపోయి, అత్తమ్మగా రూపం మార్చుకున్నాడేమో! అందుకే కాబోలు అత్తమ్మలో అటు అమ్మతనపు కమ్మదనమూ ఉంటుంది; ఇటు గడుసుదనపు కవ్వింపుగుణమూ ఉంటుంది. అత్తా కోడళ్లది కావొచ్చు, అత్తా అల్లుళ్లది కావొచ్చు, అత్త కేంద్రంగా ఉండే ఆ బంధంలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. అక్టోబరు నాలుగో ఆదివారం ‘ప్రపంచ అత్తల దినోత్సవం’ సందర్భంగా సరదాగా అత్తల చుట్టూ ప్రదక్షిణ చేద్దాం!
పాతకాలంలో రోమ్‌లో ఒక సామెత ఉండేదట: ఒకరి అత్త బతికివున్నంత కాలం ఆ మనిషికి శాంతి లేదు.
అత్త అనగానే పెంకి, గయ్యాళి, ఆరళ్లు పెట్టేది, పెత్తనం చలాయించేది, అన్నింట్లోనూ కలిగించుకునేది, తీర్పులిచ్చేది, పోట్లాటకు సిద్ధంగా ఉండేది... తరహా ఇమేజ్ ఏదో క్రియేట్ అయిపోయివుంది. అందుకే మనవాళ్లు కూడా ‘అత్తలేని కోడలుత్తమురాలు... కోడల్లేని అత్త గుణవంతురాలు’ అనేశారు! ‘కోడల కోడల కొడుకు పెళ్లామా/ పచ్చిపాల మీద మీగడేమాయె/ వేడిపాల మీద వెన్న ఏమాయె’ అనడుగుతుందట గడుసరి అత్త. ‘అత్తమ్మ ఊరకే ఆరళ్లుగానీ/ పచ్చిపాల మీద మీగడుంటుందా/ వేడిపాల మీద వెన్న ఉంటుందా’ అని అంతే దీటుగా జవాబు చెబుతుంది ఈ సొగసరి కోడలు.
అత్తను చుట్టుకుని ఉండే బంధం ప్రతికూలమైనది కాదు. అందులో కోపం ప్రదర్శనకు రావొచ్చు! కానీ ఒక సరసం ఏదో ఉందందులో. పూర్తిగా అల్లుకుపోని, అలాగని తెగతెంపులు చేసుకోని చిత్రమైన రసపోరు జరుగుతుంటుంది.
అత్త... అమ్మ
తండ్రి లేకపోయినా మేనమామలుండాలంటారు. తండ్రి లేని లోటును అన్ని రకాలుగా వాళ్లు భర్తీ చేయగలరని! మరి ఆ మామకు సంపూర్ణంగా మద్దతు పలికి, తన పిల్లలతో సమంగా ప్రేమ వాటాను పంచుకోనిచ్చేది ఎవరు? అమ్మమ్మ వాళ్లూరు వెళ్లామంటే, అక్కడ తాతయ్య కథలు, మామయ్యల కబుర్లు సరే! తెరవెనుకుండి బండి సక్రమంగా నడిపేది, వేళకు వేడి వేడి పకోడీలు తెచ్చిపెట్టేది మేనత్తలే కదా! అందుకే ఆమె అత్తమ్మ. అర్ధతల్లి. అందుకే కావొచ్చు, కొందరు పిల్లలు తొలి మాటగా అమ్మకు బదులు అత్త అని పలుకుతారట!
వెండితెర అత్తలు
అత్తను కరుణాపూరిత పాత్రలోకి ప్రవేశపెట్టేస్తే మజా ఏముంది! అత్తను ఆటకట్టించడమే ప్రధానంగా సినిమాను రక్తి కట్టించిన నటదర్శకులెందరో! అలాగని అత్తే అన్నింటా విలన్ కాదు. ఆ మసాలా ఏదో పడాలి. అత్తమెచ్చిన అల్లుడు, అత్త మెచ్చిన కోడలు, అత్తా కోడళ్లు, అత్తకు కొడుకు మామకు అల్లుడు, అత్తగారూ స్వాగతం, అత్తా నీ కొడుకు జాగ్రత్త, అత్తా ఒకింటి కోడలే, అత్తారిల్లు, అనసూయమ్మ గారి అల్లుడు, అత్తింట్లో అద్దెమొగుడు, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు, హైక్లాస్ అత్త లోక్లాస్ అల్లుడు, నారీ నారీ నడుమ మురారి, చిన్న కోడలు, గడుసరి అత్త సొగసరి కోడలు, అమ్మ నా కోడలా, సరదా బుల్లోడు... అత్త, అల్లుడు పదాలతోనూ, అవి లేకుండానూ ఎన్నో అత్తగారి సినిమాలొచ్చాయి. అల్లుళ్ల పాత్రల్లో ఎవరున్నా, అత్తలదే ఇక్కడ షో! అలాంటి వెండితెర అత్తల్లో ముందుగా ప్రస్తావించాల్సిన పేరు సూర్యకాంతం. కోడళ్లు జడుసుకునేంత ‘పేరు’ సంపాదించారామె.
గుండమ్మ కథ లాంటి చిత్రంలో కుడిచెయ్యిని నడుం మీద పెట్టుకుని, ఎడమచేతిని వాటంగా విసురుతూ, రుసరుసలు చూపుతూ, ‘అయ్యో అయ్యో’ అని కల్లబొల్లిగా ఏడుస్తూ, అత్త పాత్రకు జీవం పోశారు. ఆ పేరు పెట్టుకోకుండా చేయడం ద్వారా మరో సూర్యకాంతం తెలుగు నేల మీద పుట్టకుండా చేశారు.
సూర్యకాంతం హీరోయిన్ కాలేక అత్తగారయ్యారు. కానీ వాణిశ్రీ అలాకాదు. ఆమె కళాభినేత్రి. కళ్లతో నటించగలరు. అలాంటి అందమైన వాణిశ్రీ అత్త పాత్రలు చేయడం ద్వారా, అత్త పాత్రల స్థాయిని పెంచారు. అహం, స్వాభిమానం ఉట్టిపడే అత్తంటే వాణిశ్రీయే! అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అల్లరి అల్లుడు, బొబ్బిలిరాజా లాంటి సినిమాల్లో వాణిశ్రీ అత్తారికం చూడాలి!
పొగరుగా, గడుసుగా ఉండే లక్ష్మి ‘అల్లుడా మజాకా’ సినిమాలో అత్తా మజాకా అనిపించారు. ఒక్క ఛీత్కరింపుతో ఎదుటివాళ్లను అవతల పెట్టే నటనతో జయచిత్ర ‘అబ్బాయి గారు’లో అదరగొట్టారు. ఇక, గ్లామరస్‌గా ఉండే అత్తలు కొత్త ట్రెండ్! ఒకప్పటి టాప్ హీరోయిన్లు ఇప్పుడు అత్తలుగా ఎత్తులు వేస్తున్నారు. రమ్యకృష్ణ(నా అల్లుడు), రోజా(మొగుడు), నగ్మా(అల్లరి రాముడు). హీరోయిన్‌తో పోటీ పడేంత అందంగా ఉన్న నదియా(అత్తారింటికి దారేది)లాంటివాళ్లు కూడా అత్తల అవతారం ఎత్తుతున్నారు.
అత్తా ఒకప్పటి కోడలే...
అత్త తాలూకు గయ్యాళితనం, కోడలి సున్నితగుణం, ఆరళ్లు, కన్నీళ్లు, అయినా ఓర్పుతో కోడలు నెట్టుకురావడం, ఇంటికి పేరు తేవడం,చిట్టచివరకు శభాష్ అనిపించుకోవడం ... వెరసి చక్కటి భారతీయ సీరియల్! అత్తా ఒకప్పటి కోడలే అన్న అర్థాన్నిచ్చే ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్ హిట్టయ్యిందంటే కారణం ఈ అత్తా కోడళ్ల బంధుత్వంలోని డ్రామా ఎలిమెంటే! ‘స్టార్‌ప్లస్’ ఛానల్ చరిత్రలో అత్యధిక ప్రజారంజక ధారావాహికగా అది కీర్తి గడించింది. ఒక దశలో 22.4 టీఆర్పీతో భారత సీరియళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని ఆదరణ మూటగట్టుకుంది. ‘బాలాజీ టెలిఫిల్మ్స్’ తరఫున ఏక్తాకపూర్ నిర్మించిన ఈ సీరియల్ 1833 ఎపిసోడ్లతో, 2000-08 దాకా ఎనిమిదేళ్లపాటు బుల్లితెరను ఏలింది. తుల్సీ విరానీ పాత్ర పోషించిన కోడలు స్మృతి ఇరానీ స్టార్ అయిపోయింది. దీనికి క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం సవితా విరానీగా అత్త పాత్ర పోషించిన అపరా మెహ్తాకేగదా!
అత్తలు చెప్పేది - మనసులో అనుకునేది అత్త- అల్లుడు ఎదురుపడటం తక్కువ కాబట్టి, వారిద్దరూ ఘర్షణ పడటానికి అవకాశం తక్కువ. అందుకే అత్తా కోడళ్ల వ్యవహారమే ఎప్పుడూ హైలైట్ అవుతుంది. అత్త బయటికి ఒక మాట అంటున్నప్పుడు తన లోపలి భావం మాత్రం ఇలా ఉంటుందట: తగ్గి ఉండటం బాధించే విషయమని నాకు తెలుసు.
ఇన్నేళ్లు ఇంటిని ఒంటిచేయి మీద నడిపాను; ఇప్పుడు తప్పుకోవాల్సి వస్తోంది. వాడు నీ భర్తని నాకు తెలుసు. వాడు నా కొడుకన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఉత్తినే డీలాపడితే ఎలాగమ్మాయ్?
చిన్న మాటంటే కూడా విమర్శగా భావిస్తావెందుకు? ఎలా మాట్లాడాలో నాకు తెలియదా? మీ ఇద్దరూ సంతోషంగా ఉండటమే నాక్కావాలి. మీలో నన్నూ కలుపుకోవడం మరిచిపోవద్దు సుమా!
నాక్కూడా కొంత తెలుసు.
ఎంత జీవితం చూశాను! ఏదైనా చేసేటప్పుడు నన్ను ఓ మాట అడిగితే ఏం పోయింది?
అత్తగారితో సంభాషణ
కొత్త పెళ్లికూతురుగా ఒక ఇంట్లోకి ఆడపిల్ల అడుగిడగానే ఎదుర్కోవాల్సిన తొలి ‘ప్రత్యర్థి’ అత్త అవుతుంది. ఇద్దరు మనుషులు కొత్త జీవిత విధానంలోకి మరులుతున్నప్పుడు చిటపటలు సహజం. అది ఇద్దరు మనుషుల ఘర్షణే తప్ప, అత్తాకోడళ్ల ఘర్షణగా భావించక్కర్లేదు. ఎక్కువకాలం కలిసుండే తల్లీకూతుళ్లు కూడా మాటలు విసురుకుంటారు. అయితే, కోడళ్లు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా తమ బంధుత్వంలోని శబ్దకాలుష్యాన్ని తగ్గించుకోవచ్చట.
‘మొగలిరేకులు మళ్లీ వస్తే బాగుంటుంది కదా అత్తమ్మా’ అని వాళ్లకు నచ్చే అవకాశమున్న టాపిక్ మాట్లాడాలట. లేదంటే ‘చిన్నారి పెళ్లికూతురు’లో ఆనంది గురించైనా సరే! అత్తకు పడనివాళ్లు ఎవరైనా ఉంటే వారి ఊసు ఎత్తకూడదు. కొడుక్కు ఏం వండిపెట్టాలో చెప్పకుండా ఉండటమే ఉత్తమమట. లేదా గొంతు వేరేగా ధ్వనించాలి. అది ఆమెకు తెలియనట్టుగా కాకుండా, ‘ఈమధ్య ఆయన ఇది ఇష్టంగా తింటున్నట్టున్నారు’ తరహాలో మేనేజ్ చేయాలి. అన్నింటికీ మించి నలుగురిలో ఎడమొహంగా ఉండకూడదు. కొంత చూసీచూడనట్టుగా పోతే పట్లు బిగించుకోకుండా ఉంటాయి. ఆల్రెడీ అత్తే అమ్మలా ఉన్నవాళ్లకు ఈ అవసరం లేదు. అత్తలా ఉన్నవాళ్లను అమ్మలా మార్చుకోవడానికి కొంత ప్రయత్నం అవసరం.
అత్తల దినోత్సవం
అత్తలకు, స్పష్టంగా చెప్పాలంటే జీవనసహచరి/సహచరుణికి జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞతలు చెప్పడం కోసం ఈ అత్తల దినోత్సవం ప్రారంభమైంది. అటు అమ్మతోగానీ, ఇటు అత్తతోగానీ చక్కని సంబంధం నెరిపేవాళ్లు మరింత సంతోషంగా ఉన్నట్టుగా ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ సర్వే తేల్చింది. అమ్మ, అత్తతో చక్కటి సంబంధం ఉండటం ద్వారా ఇద్దరినుంచీ మాతృత్వపు మమకారాన్ని పొందవచ్చునట! అది పిల్లలకు కూడా మంచిది. అలా లేని కుటుంబాల్లో చికాకు, అసంతృప్తి, సమన్వయ లేమి ఎక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధన జరిపిన డాక్టర్ మెలిస్సా వైన్‌బర్గ్ చెబుతారు. పాశ్చాత్యులకైతే ఆ రోజు కార్డు పంపండి, భోజనానికి మంచి రెస్టారెంటుకు తీసుకెళ్లండి తరహా సలహాలు ఇస్తారు. అవి మన సెన్సిబిలిటీస్ కాకపోవచ్చు. కానీ మంచి చీర పెట్టడం మనం సంప్రదాయమే! అంతెందుకు, అత్త మీద చూపే ఆదరణ భాగస్వామిని కూడా తృప్తి పరుస్తుంది. తనను ప్రేమించడం అంటే తనవాళ్లందరినీ కలుపుకొని ప్రేమించాలనే మనస్తత్వమేగా అందరిదీ! కాబట్టి, ‘అత్తగారూ జిందాబాద్’!
అత్తగారి భాష
నిషిద్ధ బంధుత్వాల ముందర రోజువారీ భాషను ఉపయోగించకపోవడం కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉంది. దీన్నే ’అవాయిడెన్స్ స్పీచ్’ లేదా ’అత్త భాష’ అంటారు. ధ్వని, వ్యాకరణం అదే! పదసంపద మారుతుంది. నైజీరియా, కాంగో, ఇథియోపియా, ఆస్ట్రేలియా స్థానికుల భాషల్లో ఇలాంటి అత్త భాష వ్యవహారం కొనసాగుతోంది.
అత్తగారి ఇల్లు...
ఇది ప్రధాన ఇంటికి అనుబంధంగానో, కొంచెం దూరంగానో ఉంటుంది. విడి బాత్రూమ్, కిచెన్ ఉంటాయి. కొంత కలిసినట్టుగానూ, కొంత దూరంగా ఉన్నట్టుగానూ ఉంటుంది. ఉమ్మడిగా అనుభవించే ఖాళీ జాగా ఉంటూనే వేరుగా ఉంటుంది. చాలావరకు అతిథుల కోసం కేటాయించడానికి ఇవి పనికొస్తాయి.
మామల దినోత్సవం
అత్తలకు ఉన్నప్పుడు మరి మామలకు లేకపోతే ఎలా? జూలై 30న మామల దినోత్సవం! ఇది కూడా అత్తల రోజు మాదిరిగానే. మన జీవితాల్లో కీలక పాత్ర పోషించే మామయ్యల సేవలను గుర్తించడం; దానికిగానూ వారికి ధన్యవాదాలు అర్పించడం కోసం ఈ దినోత్సవం ప్రారంభమైంది.
అత్తగారి కథలు
సుప్రసిద్ధ సినీనటి భానుమతి రాసిన ఈ కథలన్నీ ‘అత్తగారు’ చుట్టే తిరుగుతాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేసి భంగపడటం, కిందపడ్డా పైచేయి అనుకోవడం, ఆచారాలు మరీ చాదస్తంగా పట్టించుకోవడం తరహా పూర్వకాలపు స్వభావంతో నవ్వు పుట్టిస్తారామె. కొంత బడాయి, కొంత లౌక్యం, కొంత పెద్దరికం, కొంత అమాయకత్వం... లాంటి గుణగణాల ఈ తెలుగు అత్తగారిని భానుమతి చిరంజీవిని చేశారు. అయితే, ఈ లక్షణాలు తమ అత్తగారివి మాత్రం కాదని భానుమతి అన్నారు. కొన్ని లక్షణాలు మాత్రం తీసుకున్నారట.
సెలబ్రిటీ అత్తా కోడళ్లు
ఇటలీలో పుట్టిన సోనియా మైనో ఇంగ్లీష్ చదవడానికి ఇంగ్లండ్ వచ్చినప్పుడు, అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న రాజీవ్ గాంధీ ఆమెతో తొలిచూపు ప్రేమలో పడటం, మూడేళ్లలో అది బలపడటం, వాళ్ల పెళ్లికి ఇందిరాగాంధీ అంగీకరించడం జరిగిపోయి, సోనియా మైనో సోనియా గాంధీ అయ్యారు. ఇందిర తన వివాహంలో ధరించిన పింక్ చీరనే సంప్రదాయంగా సోనియా కూడా కట్టుకున్నారు. పెద్ద కోడలిగా ఇంటిని చక్కబెట్టుకొచ్చారు. అత్తగారి అభిమానాన్ని చూరగొన్నారు.
జయాబచ్చన్ లాంటి సుప్రసిద్ధ అత్తకు(అమితాబ్ బచ్చన్ లాంటి సుప్రసిద్ధ మామకు కూడా) కోడలిగా వచ్చిన అంతే ప్రసిద్ధురాలు ఐశ్వర్యారాయ్ ఆ కుటుంబంలో చక్కగానే ఇమిడిపోయినట్టున్నారు. ఇద్దరికీ ఏమైనా పడటం లేదేమో, మామూలు అత్తాకోడళ్ల మాదిరేనేమో తరహా సందేహాలతో పత్రికలు కథనాలు రాయడానికి సిద్ధంగా ఉన్నా... వారు ఎక్కడా క్లూ ఇవ్వలేదు. పైగా ఎప్పుడు కనబడ్డా కలివిడిగా నవ్వుతూ కనిపిస్తారు. ‘అభిషేక్‌కు ఇంతకంటే మంచి భార్య దొరకదు,’ అని ఓ సందర్భంలో జయాబచ్చన్ పేర్కొన్నారు కూడా!