breaking news
Assembly speakers
-
ఉమ్మడి కృషితో దేశం ఉన్నత శిఖరాలకు
న్యూఢిల్లీ/సిమ్లా: పార్లమెంట్ సభ్యుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, దేశ అభివృద్ధి పరుగులు పెట్టడానికి ఇదే తారక మంత్రమని ప్రధాని మోదీ ఉద్బోధించారు. పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్ల (అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్లు) సదస్సు బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు జరగనుంది. తొలి రోజు సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు ప్రజలందరి ఉమ్మడి కృషితోనే దేశాన్ని అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చని అన్నారు. కోవిడ్–19 మహమ్మారిపై మనం సాగించిన పోరాటం సబ్ కా ప్రయాస్కు (అందరి కృషి) ఒక చరిత్రాత్మక ఉదాహరణ అని గుర్తుచేశారు. పలు భిన్నమైన అంశాలపై రగడ కారణంగా పార్లమెంట్ సమావేశాలకు తరచుగా అంతరాయం కలుగుతుండడం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యుల ప్రవర్తన భారతీయ విలువల దారిలోనే ఉండాలని సూచించారు. చట్టసభల్లో ఆమోదించే చట్టాలు, తీసుకొనే విధాన నిర్ణయాలు ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’ అనే సెంటిమెంట్‌ను బలోపేతం చేసేవిగా ఉండాలన్నారు. చట్టసభల్లో పాటించే సంప్రదాయాలు, పద్ధతులు భారతీయ ఆత్మను ప్రతిబింబించాలని ఉద్ఘాటించారు. పార్లమెంట్, అసెంబ్లీ, మండలిలో చర్చలు అర్థవంతంగా, హూందాగా, గౌరవప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. సభ్యుల మధ్య రాజకీయ ఆరోపణలు, విమర్శలకు తావులేకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన సంవాదాలు, చర్చల కోసం చట్టసభల్లో ప్రత్యేక సమయం కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక ప్రజాస్వామ్యం అనేది భారత్‌కు కేవలం ఒక వ్యవస్థ కాదని, అది దేశ సహజ స్వభావమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అత్యంత కీలకమని చెప్పారు. వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల దిశగా భారత్ ముందుకు పయనిస్తోందని తెలిపారు. ఇలాంటి తరుణంలో చట్టసభల సభ్యులు వారి విధులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వారి ప్రవర్తన, చేసే పనులు దేశ ప్రజలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. డ్యూటీ, డ్యూటీ, డ్యూటీ అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతపై అసమ్మతి స్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చట్టసభల సభ్యులకు సూచించారు. మన దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవాలన్నారు. ‘ఒకే దేశం.. ఒకే చట్టసభ వేదిక’ అనే ఆలోచనను మోదీ తెరపైకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌తో మన పార్లమెంటరీ వ్యవస్థకు సాంకేతిక తోడ్పాటు లభించడమే గాక దేశంలోని అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను అనుసంధానించవచ్చని వివరించారు. చట్టసభల గౌరవాన్ని పెంచే చర్యలు: బిర్లా దేశంలో చట్టసభలు పని చేసే సమయం నానాటికీ తగ్గిపోతుండడం పట్ల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల రూపకల్పన, ఆమోదంపై సరైన చర్చ జరగకపోవడం మంచి పరిణామం కాదన్నారు. స్పీకర్ల సదస్సులో మాట్లాడారు. చట్టసభల గౌరవాన్ని, ప్రతిష్టను పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, నిర్ణయాత్మక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఫిరాయింపులపై జాప్యం వద్దు
డెహ్రాడూన్: చట్టసభల్ని నడిపించే స్పీకర్లు తటస్థంగా వ్యవహరించాలని, ఫిరాయింపుదార్ల ఆటకట్టించేలా నిర్ణీత కాలవ్యవధిలో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో బిర్లా మాట్లాడారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని సమీక్షించడానికి కొన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో ఒక కమిటీ ఏర్పడిందని, త్వరలోనే అది తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఫిరాయింపులపైనే సదస్సులో చర్చ అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో చివరిరోజైన గురువారం ఫిరాయింపులపైనే ఎక్కువగా చర్చ జరిగిందని ఓం బిర్లా వెల్లడించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లోని ఫిరాయింపు నిరోధక చట్టంపైనే విస్తృతంగా చర్చించామని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధంగా తటస్థులుగా ఉండాల్సిన స్పీకర్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే స్పీకర్ల సదస్సులో ఫిరాయింపుల అంశంపై విస్తృతంగా చర్చించారు. ముగింపోత్సవంలో మాట్లాడిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్టీ ఫిరాయింపులు అత్యంత ఆందోళనకరమైనవని అన్నారు. -
మేం మంచి దోస్తులం
సాక్షి, గుంటూరు: ఉమ్మడి రాష్ట్రంలో తామిద్దరం కలిసి పనిచేశాం. గతంలో ఒకే పార్టీలో పనిచేసిన మా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. మేము మంచి దోస్తులం అంటూ ఏపీ అసెంబ్లీ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ బుధవారం ఉదయం గుంటూరులో ఏపీ స్పీకర్ కోడెల ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా కోడెల కుటుంబ సభ్యుల నుంచి వారికి సాదర స్వాగతం లభించింది. తిరుమలతోపాటు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా మధుసూదనాచారి కుటుంబ సభ్యులకు దర్శన భాగ్యం కల్పించాలని సంబంధిత దేవాలయాల అధికారులను స్పీకర్ కోడెల ఆదేశించారు. సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు స్పీకర్లు విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోయినా రెండు రాష్టాలు సఖ్యతతో పనిచేస్తున్నాయన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఉందన్నారు. శాసనసభ వ్యవహారాలలో ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు. -
‘స్వచ్ఛ నీరు’ భేష్
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కితాబు సిద్దిపేట జోన్: నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛ నీరును అందించే కార్యక్రమం బాగుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదన చారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కితాబిచ్చారు. శనివారం సిద్దిపేటలో జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం అరబిందో, బాల వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూపాయికే చల్లని నీరు ప్లాంట్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు వారికి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బాలవికాస్ ద్వారా మినరల్ వాటర్‌ను అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలోని ప్రజల కోసం రూపాయికే స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని వివరించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ప్లాంట్ పనితీరు , వ్యయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ నీటిని సేవించారు. -
సభాపతుల కోసం ఓ సవరణ
డేట్లైన్ హైదరాబాద్ రాజ్యాంగాన్ని మనం బోలెడుసార్లు సవరించుకున్నాం. ఇంకో సవరణ, అది కూడా రాజకీయాలలో నైతిక విలువల రక్షణ కోసం చేసుకోవలసిన సమయం వచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద స్పీకర్లకు కాకుండా గవర్నర్లకు నిర్ణయాధికారాలు ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన తాజా పరిణామాలనే ఉదాహరణగా తీసుకుని, పార్లమెంట్ చర్చించి తగిన సవరణలు తెచ్చి ఫిరా యింపుల మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. న్యాయస్థానాల పుణ్యమా అని ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గండం గడిచి బయటపడింది, ఓ వారం రోజుల కిందట. ఇది కాంగ్రెస్ అంతర్గత సమస్య అని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఎంత సమర్ధ్థించుకోవాలని చూసినా, ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీకి శృంగభంగం అయిం దన్న విషయం వాస్తవం. ఉత్తరాఖండ్ శాసనసభ గడువు ముగియడానికి ఇంకా ఏడెనిమిది నెలలే మిగిలి ఉంది. స్వల్ప ఆధిక్యతతో, అవినీతి ఆరోపణల మధ్య నెట్టుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాలుగేళ్లూ ఇబ్బంది పెట్టనందుకు ఆ రాష్ర్టంలో బీజేపీకి మంచి పేరే వచ్చింది. ఈ ఎనిమిది మాసాలు కూడా అలాగే కొనసాగనిచ్చి ఉంటే 2017 ఆరంభంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఖాయంగా గెలిచి ఉండేది. అరుణాచల్‌ప్రదేశ్‌లో చేసిన ప్రయోగమే ఇక్కడా చేయబోయి అనవసరంగా ఆ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చే సువర్ణావకా శాన్ని జార విడుచుకుంది. బీజేపీ పెద్దలు ఈ మాట ఒప్పుకోరు. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే, మాకు సంబంధం లేదంటారు. అదే నిజమయితే రాష్ర్టపతి పాలన తెచ్చే ప్రయత్నమే చేసి ఉండకూడదు. రాష్ర్టపతి ఉత్తర్వులను న్యాయ స్థానాలు తోసిపుచ్చే పరిస్థితి తెచ్చుకుని ఉండాల్సింది కాదు. సరే, కాసేపు బీజేపీ చేస్తున్న వాదనతోనే ముందుకు పోదాం. కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. ఆ శాసనసభ స్పీకర్ వెంటనే వారిని అనర్హులుగా ప్రకటించి, శాసన సభలో బలపరీక్ష సందర్భంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయ కుండా నిలువరించారు. దాంతో హరీశ్ రావత్ ప్రభుత్వం బలపరీక్షలో విజ యం సాధించగలిగింది. ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్‌ను ఇందుకు అభినం దించాల్సిందే. కాంగ్రెస్ టికెట్ మీద ఎన్నికయి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఫిరాయించాలని భావించిన శాసనసభ్యులకు ఆయన తగిన శాస్తి చేశారు. ఆ తొమ్మండుగురు శాసనసభ్యులు హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టినా లాభం లేకపోయింది. స్పీకర్ నిర్ణయం సరయినదే అన్నాయి కోర్టులు కూడా. మరి అదే స్పీకర్ బలపరీక్ష రోజునే బీజేపీ నుంచి ఫిరాయించి, రావత్ పంచన చేరిన ఎమ్మెల్యేల మీద ఏ చర్యా ఎందుకు తీసుకోలేదు? చర్చనీయాంశం అవుతున్న స్పీకర్లు ఇలాంటి సందర్భాలలోనే శాసనసభల గౌరవ స్పీకర్ల పాత్ర చర్చనీయాంశమ వుతున్నది. వివాదాస్పదం కూడా అవుతున్నది. ఇంతసేపూ ఉత్తరాఖండ్ వ్యవ హారం గురించి మాట్లాడుకున్నది ఎందుకంటే అక్కడి మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ శాసనసభ్యుల ఫిరాయింపుల వ్యవహారం బరితెగించి సాగుతున్నది. రెండు రాష్ట్రాల శాసనసభల స్పీకర్లూ ఏళ్లు గడు స్తున్నా ఈ ఫిరాయింపుల నాటకాన్ని కొనసాగిస్తున్నారు తప్ప, ఏ చర్యా లేదు. తెలంగాణ రాష్ర్టంలో వేరే పార్టీల నుంచి గెలిచిన మొత్తం 23 మంది శాసనసభ్యులు అధికార పక్షం పంచన చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క ప్రతిపక్షం నుంచి 16 మంది శాసనసభ్యులు అధికార తెలుగుదేశం గూటికి వలసపోయారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు సంవత్సరాలలో పార్టీ ఫిరాయించిన ఈ 39 మంది శాసనసభ్యులు ఒకటే బృందగానం చేశారు. అది తమ నియోజకవర్గాల అభివృద్ధి. అంటే ప్రభుత్వం అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుల నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేస్తుందా? ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వదా? రాష్ర్ట ప్రజలందరూ ప్రభుత్వానికి సమానం కాదా? ప్రతి పక్షాలు ప్రాతినిధ్యం వహిస్త్తున్న నియోజకవర్గాల ప్రజలు పన్నులు కట్టడం లేదా? ఎంత వింతగా ఉంది ఇది? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలతో సఖ్యంగా ఉండో, పోరాడో నియోజకవర్గాలకు కావలసినన్ని నిధులు తెచ్చుకుని అద్భుతమయిన అభి వృద్ధి సాధించి చూపించిన ప్రజా ప్రతినిధులు మనకు చరిత్రలో చాలా మంది కనిపిస్తారు. నియోజకవర్గాల అభివృద్ధి అనేది ఒక సాకు. వీరంతా తమ సొంత అభివృద్ధి కోసమే పోతున్నారు. కోట్ల రూపాయల కాంట్రాక్టులు, భూములు, రక రకాల స్వప్రయోజనాలను ఆశించి పోతున్న వాళ్లే వీళ్లంతా. ఉత్తరాఖండ్ స్పీకర్లాగా రెండు తెలుగు రాష్ట్రాల స్పీకర్లు ఎందుకు సత్వర నిర్ణయం తీసు కోలేదు? ఎందుకు ఏళ్లు గడిపేస్తున్నారు? ఉత్తరాఖండ్ స్పీకర్ నిర్ణయాన్ని కూడా చర్చించవలసిందే. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లో అధికార పక్షం నుంచి తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కాబట్టి స్పీకర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే రావత్ సర్కారు కనుక మైనారిటీలో పడి ప్రతిపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కనుక అధికారపక్షాన్ని ఆదుకోవడానికి ఫిరాయించినా కూడా ఆ రాష్ర్ట స్పీకర్ ఇదే నిర్ణయం తీసుకునే వారా అన్నది అనుమానాస్పదమే. తొమ్మిదిమంది కాంగ్రెస్ సభ్యుల మీద అనర్హత వేటు వేసిన అదే స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలు రావత్ వైపు వస్తే ఎందుకు ఊరు కున్నట్టు? ఎందుకంటే స్పీకర్ అధికార పక్షానికి సంబంధించిన వారే కావడం. రెండు తెలుగు రాష్ట్రాల లో జరుగుతున్నది కూడా అదే. విపక్షం కాబట్టే! ప్రతిపక్షాలకు చెందిన శాసనసభ్యులు అధికారపక్షానికి వలసపోతున్నారు కాబట్టి స్పీకర్లు ఏ చర్యా తీసుకోవడం లేదన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. రాష్ర్టం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికలలో గెలిచినప్పుడు టీఆర్ఎస్ సంఖ్యాబలం అరవై రెండు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యకు ఒక్కటే స్థానం ఎక్కువ. ఆ పరిస్థితులలో ప్రతిపక్షాలు కొద్దిమంది శాసనసభ్యులను తమ వైపు తిప్పుకున్నా ప్రభుత్వం నిలవడం కష్టం అయ్యేది. అప్పుడు కూడా స్పీకర్ ఇప్పటివలెనే వ్యవహరించేవారా? అవతల ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే. అరవై ఏడుగురు సభ్యులతో ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ 21 మంది తెలుగుదేశం సభ్యులను తన వైపు తిప్పుకుని ఉంటే ఆ ప్రభుత్వం పరిస్థితి ఏమిటి? అప్పుడు కూడా అక్కడి స్పీకర్ ఇప్పటివలెనే వ్యవహరించేవారా? ఇదంతా స్పీకర్లు వివాదా స్పదులవుతున్నారు, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది అని చెప్పడానికే. శాసన వ్యవస్థకు ఉండే పవిత్రతను ఎవరూ ప్రశ్నించకూడదు, స్పీకర్ నిర్ణయాలను కూడా ప్రశ్నించకూడదు నిజమే కానీ, ఇటువంటి సంద ర్భాలలో స్పీకర్ల వ్యవస్థ చర్చలోకి రాక తప్పదు. ఎన్టీ రామారావు అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడయిన రెండుసార్లు స్పీకర్ల వ్యవస్థ విమర్శకు గురయింది, గవర్నర్లు కూడా నిందలు మోయ వలసి వచ్చింది. మొదటిసారి కేంద్ర ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని గవర్నర్‌ను మార్చి సభలో బలపరీక్షకు అవకాశం కల్పించి నందుకు ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. రెండవసారి ఆ అవకాశమే రాకుండా చేసి ఆయనను అధికారానికి దూరం చేయగలిగారు. రాష్ర్టపతి ఉత్తర్వులనే, తాజాగా ఉత్తరాఖండ్ వ్యవహారంలో జరిగింది, న్యాయస్థానాలు పక్కన పెట్టినప్పుడు స్పీకర్ల నిర్ణయాలనో లేదా నిష్క్రియాపరత్వాన్నో ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఫిరా యింపుల ప్రహసనం మీద అక్కడి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. న్యాయస్థానాలు ఏం చెబుతాయో చూడాలి. ఒకే రకమయిన రెండు సమస్యలకు రెండు భిన్నమయిన పరిష్కారాలు ఉంటాయా? మరో సవరణ అవసరం కాదా! భారత రాజ్యాంగాన్ని మనం బోలెడుసార్లు సవరించుకున్నాం. ఇంకో సవ రణ, అది కూడా రాజకీయాలలో నైతిక విలువల రక్షణ కోసం చేసు కోవలసిన సమయం వచ్చింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద స్పీకర్లకు కాకుండా గవర్నర్లకు నిర్ణయాధికారాలు ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగు తున్నది. కానీ కేంద్రం నియమించే గవర్నర్లు ఎంత స్వతం త్రంగా నిర్ణయాలు తీసుకోగలరు? కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన తాజా ఫిరాయింపులనే ఉదాహరణగా తీసుకుని, పార్లమెంట్ చర్చించి తగిన సవ రణలు తెచ్చి పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొసమెరుపు : ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రయత్నం బెడిసికొట్టాక కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల మీద తెగ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు భాగస్వాములుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, మీ ఆప్తమిత్రుడు, ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే ఈ నీతిమాలిన వ్యవహారం నడుస్తున్నది, దాన్నేం చేస్తారు అని వెంకయ్య నాయుడుని ఒక్క మీడియా మిత్రుడయినా అడిగిన పాపానపోలేదు. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈ నెల 18 నుంచి వచ్చే నెల 13 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మంగళవారం సాయంత్రం సమావేశమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ల భేటీ ముగిసింది. ఇరు సభల మధ్య ఏలాంటి విభేదాలు ఉండరాదని, ఏవైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. రెండు సభలు ఏకకాలంలో జరుగుతాయని, ఎలాంటి సమస్య వచ్చినా కలసి చర్చించుకుంటామని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల స్పీకర్లతో పాటు శాసనమండలి చైర్మన్లు, ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. -
ఏపీ, తెలంగాణ స్పీకర్ల భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాద రావు, మధుసూదనాచారి సమావేశమయ్యారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు, ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు రెండూ ఒకేసారి భేటీ అయితే తలెత్తే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.