breaking news
arundathi bhattacharya
-
మళ్లీ బ్యాంకింగ్ రంగంలోకి భట్టాచార్య
మాజీ ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య మళ్లీ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎస్బీఐ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన ఈమెను, బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. వినోద్ రాయ్‌కి తదుపరి భట్టాచార్యను నియమించబోతున్నారు. ఇప్పటికే బోర్డు తదుపరి చైర్మన్ ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని రిపోర్టు తెలిపింది. ఆశ్చర్యకరంగా భట్టాచార్యను రఘురామ్ రాజన్ తర్వాత ఆర్బీఐ గవర్నర్‌గా నియమించే నలుగురు షార్ట్‌లిస్టెడ్ అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌ను నియమించారు. 1977లో ఎస్బీఐ చేరిన భట్టాచార్య, 2013 ఎస్బీఐకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ కూడా ఈమెనే. గతేడాది అక్టోబర్‌లో భట్టాచార్య ఎస్బీఐ నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమెను బ్యాంక్స్ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను మెరుగుపరచడానికి 2016లో ఈ బీబీబీ ఏర్పాటైంది. దీనిలో చైర్మన్‌తో పాటు ముగ్గురు ఎక్స్-అఫిషియో మెంబర్లు, ముగ్గురు ఎక్స్పర్ట్ మెంబర్లు ఉంటారు. అందరూ సభ్యులు, చైర్మన్ కూడా పార్ట్‌టైమే. -
బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాల్సింది
ముంబై: పెద్ద నోట్ల రద్దు విషయంలో బ్యాంకులు సన్నద్ధమయ్యేందుకు వాటికి మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని ఎస్బీఐ మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటీవలే ఎస్బీఐ చైర్పర్సన్ పదవి నుంచి విరమణ తీసుకున్న ఆమె గురువారం ముంబైలో ‘ఇండియాటుడే’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. నల్లధనాన్ని, నకిలీ నోట్లను ఏరిపారేస్తామంటూ గతేడాది నవంబర్ 8న రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచి చెడుల గురించి అరుంధతి మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం బ్యాంకులపై భారీ పని భారానికి దారి తీసిన నేపథ్యంలో దీనిపై అరుంధతి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘‘దేనికైనా మనం ఎక్కువగా సన్నద్ధమై ఉంటే దాని తాలూకూ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. నిజానికి అక్కడ మరింత సన్నద్ధమై ఉంటే (పెద్ద నోట్ల రద్దు) మాపై శ్రమ అంత ఉండేది కాదు. నగదును కదిలించాలంటే అందుకు నిబంధనలు ఉన్నాయి. మాకు పోలీసులు అవసరం. కాన్వాయ్‌ను సమకూర్చాలి. మార్గనిర్దేశం చేయాలి. ఇది భారీ రవాణా సన్నాహకం’’ అని అరుంధతీ భట్టాచార్య అన్నారు. నోట్ల రద్దు సరైన చర్యా, కాదా అన్నది తేల్చడానికి మరింత సమయం అవసరమన్నారు. డీమోనిటైజేషన్ వల్ల ప్రయోజనాలు ఏంటన్న దానిపై 40 శాతం పన్ను చెల్లింపుదారులు పెరిగారని, డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయని చెప్పారు. -
ఎజెండా పూర్తి కాకుండానే..
-
ఎజెండా పూర్తి కాకుండానే..
ముంబై: డిజిటైజేషన్, అధిక రుణ వృద్ధి అనే రెండు ఎజెండాలు అసంపూర్తిగా ఉండగానే రిటైరవుతున్నానంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యానించారు. రుణాల వృద్ధిని మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదన్నారు. అలాగే కొన్ని అంశాలవల్ల డిజిటైజేషన్లో కూడా జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఎస్బీఐ చైర్పర్సన్ హోదాలో చిట్టచివరి విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. 214 ఏళ్ల ఎస్బీఐ సుదీర్ఘ చరిత్రలో.. తొలి మహిళా చైర్పర్సన్ అయిన అరుంధతీ భట్టాచార్య.. శుక్రవారం పదవీ విరమణ చేశారు. ‘ఎవరి జీవితంలోనూ నిర్దేశించుకున్న ఎజెండా పూర్తి చేశామనుకునే రోజు రాదు. ఏదైనా ఒక ఎజెండాను మొదలుపెడితే.. క్రమంగా దానికి మరికొన్ని జోడించుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ కూడా ఇంకా పూర్తి చేయాల్సిన పనుల్లో కొన్ని మిగిలిపోయాయి. డిజిటల్‌పరంగా చాలా విభిన్నమైన సేవలు జూలైనాటికే అందుబాటులోకి తేవాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు పరిధి మరింతగా పెరగడంతో.. కాస్త జాప్యానికి దారితీసింది. అసంపూర్ణంగా మిగిలిపోయిన ఎజెండాల్లో ఇదీ ఒకటి. ఇక, అసంపూర్తిగా మిగిలిన మరో అంశం..రుణాల్లో అధిక వృద్ధి. ప్రక్రియలను మెరుగుపర్చుకుని, రిస్కులను సమగ్రంగా అధ్యయనం చేసి, అండర్‌రైటింగ్ ప్రమాణాలు పెంచుకుని.. అనేక కీలక చర్యలు తీసుకున్నప్పటికీ రుణాల వృద్ధి ఆశించినంత స్థాయిలో కనిపించలేదు‘ అని ఆమె తెలిపారు. కఠిన ప్రయాణమైనా ఆసక్తికరం .. తమ ప్రస్థానం చాలా ఆసక్తికరంగానే కాకుండా.. కఠినతరంగా కూడా సాగిందని ఆమె పేర్కొన్నారు. అయితే, అన్ని వేళలా నిభాయించుకుని ముందుకు సాగగలిగామన్నారు. కష్టకాలం ఎదురైనప్పుడు బ్యాంకును అంతర్గతంగా మరింత పటిష్టం చేసుకున్నామని, మరింత మెరుగైన స్థితికి చేరేందుకు ఆయా పరిస్థితులను ఉపయోగించుకున్నామని భట్టాచార్య వివరించారు. ఈ ఊతంతో భవిష్యత్‌లో ఎస్బీఐ మరింత మెరుగైన పనితీరు కనబర్చగలదని ఆమె దీమా వ్యక్తం చేశారు. మొండిబాకీల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇక ఇక్కణ్నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని చెప్పారు. అయితే, అది ఈ క్వార్టర్‌లోనే జరుగుతుందా లేదా రాబోయే త్రైమాసికంలో జరుగుతుందా అన్నది మాత్రం తాను చెప్పలేనని భట్టాచార్య పేర్కొన్నారు. ఎకానమీ త్వరలోనే కోలుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుబంధ బ్యాంకుల విలీనాలపై.. ‘నేను బాధ్యతలు చేపట్టినప్పుడే అనుబంధ బ్యాంకుల విలీనం గురించి కూడా ఆలోచించాను. దాని గురించి చర్చించాం కూడా. అయితే, ముందుగా బ్యాంకును పటిష్టం చేసుకున్న తర్వాత విలీనంపై ముందుకు కదలాలని భావించాం. అదే అమలు చేశాం‘ అని భట్టాచార్య చెప్పారు. అనుబంధ బ్యాంకుల విలీనాలు జరిగిన కొన్ని ప్రాంతాల్లో వ్యాపార వృద్ధి కొంత మార్పులకు లోనయిందని భట్టాచార్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఇది కనిపించిందని ఆమె చెప్పారు. విలీనానంతరం అనుబంధ బ్యాంకుల కస్టమర్లలో కొందరు వేరే బ్యాంకులకు మళ్లిన సంగతి వాస్తవమేనన్న భట్టాచార్య.. మళ్లీ ఆ మేరకు ఖాతాదారులను సాధించే ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ‘ఇలాంటి సందర్భాల్లో స్వల్పకాలికంగా ఈ తరహా సమస్యలు తప్పవు. ఎందుకంటే విలీనం అవుతున్న సంస్థల్లో కొంత అనిశ్చితి నెలకొంది. సరైన వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడం, కొత్తగా శిక్షణనివ్వాల్సి రావడం మొదలైన సమస్యలు తలెత్తాయి. ఉద్యోగులకు ఇప్పటికీ శిక్షణనిస్తున్నాం. బహుశా ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి .. మేం కోల్పోయిన వ్యాపారాన్ని మళ్లీ దక్కించుకోగలమని భావిస్తున్నాం‘ అని ఆమె చెప్పారు. జీఎస్టీతో అపార ప్రయోజనాలు.. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)తో అపార ప్రయోజనాలు ఉన్నాయని భట్టాచార్య అభిప్రాయపడ్డారు. దీనితో ఉత్పత్తుల రవాణాకు పట్టే సమయాన్ని తగ్గించడంతో పాటు సమర్ధత కూడా పెరుగుతుందని ఆమె చెప్పారు. ‘జీఎస్టీలో చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ సమస్యలనే ఎంచుకుంటూ పోతే.. సానుకూల అంశాల గురించి ఎప్పటికీ అర్ధం చేసుకోలేం‘ అని ఆమె చెప్పారు. ఇన్పుట్, అవుట్‌పుట్ ట్యాక్స్ రిటర్నులు చూపిస్తే ఇతరత్రా ఇంకే డాక్యుమెంట్లూ అడగకుండా నిర్వహణ మూలధన అవసరాల కోసం నిధులు ఇచ్చేసే విధంగా కొత్త విధానంపై బ్యాంకు కసరత్తు చేస్తోందని ఆమె చెప్పారు. భవిష్యత్ ప్రణాళికలు.. రిటైర్మెంట్ అనంతరం భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ.. తాను బ్యాంకింగ్‌లో మాత్రం కొనసాగకపోవచ్చని భట్టాచార్య చెప్పారు. ‘ప్రస్తుతం అరవై ఏళ్లంటే చాలా పెద్ద వయస్సేమీ కాదు. అఫ్కోర్స్.. నేను 60 దాటేశాననుకోండి. అయితేనేం.. ఏదైనా చేయాలనే తపన, శక్తి మనలో ఉంటే చేయడానికి వయస్సేమీ అడ్డంకి కాబోదు. చేయొచ్చు. కాబట్టి కచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ, క్రియాశీలకంగానే ఉంటాను. కానీ ప్రత్యక్షంగా బ్యాంకింగ్‌లో మాత్రం ఉండకపోవచ్చు‘ అని వ్యాఖ్యానించారు. -
ఏటీఎంలు ఎందుకు పని చేయడంలేదంటే
కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం(ఆటో మేటిక్ టెల్లార్ మెషీన్)లతో పెద్ద చిక్కొచ్చిపడింది. పాత నోట్లను జారీ చేయడానికి అనుగుణంగా ఆయా ఏటీఎంల సాఫ్ట్ వేర్ ను ఆయా కంపెనీలు తయారు చేశాయి. దీంతో కొత్త రూ.2 వేల నోటును పాత ఏటీఎంలు ప్రజలకు అందించలేవు. ఏటీఎంలను పునరుద్దరించేందుకు మరో పదిరోజుల సమయం పడుతుందని ఎస్ బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య ఓ ప్రకటనలో తెలిపారు. మరి కొత్త నోట్లను ఏటీఎంల ద్వారా ప్రజలకు అందించాలంటే ఏటీఎంలలో కొద్దిపాటి మార్పులు చేయాల్సివుంది. అవేంటో ఓ సారి చూద్దాం. - ఏటీఎంలను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. ఏటీఎంలలోని సాఫ్ట్ వేర్ ను రూ.2వేల నోటును ఇవ్వగలిగే విధంగా మార్చాల్సివుంది. - ఏటీఎం కార్డుపై వినియోగదారుల నగదు లావాదేవీలను రోజుకు రూ.2వేలకు పరిమితం చేసేవిధంగా చర్యలు చేపట్టాల్సివుంది. - కొత్త నోట్లలోని భద్రతకు సంబంధిని ఫీచర్ల వివరాలను కూడా ఏటీఎంల సాఫ్ట్ వేర్లలో చేర్చాలి. - వంద, యాభై రూపాయల నోట్లను కూడా ఏటీఎంలలో నింపాల్సివుండటంతో అందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.