breaking news
art fund
-
ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకే ఆర్ట్ ఫౌండేషన్
చంద్రగిరి : స్థానిక ఆర్టిస్టులతో పాటు దేశ, విదేశాల్లోని ఆర్టిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ, మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచు విష్ణు తెలిపారు. ఆదివారం విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఆర్ట్ ఫౌండేషన్ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ మంచు మోహన్‌బాబు, సీఈఓ విష్ణు పాల్గొన్నారు. తొలుత కుటుంబ సమేతంగా మోహన్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. మంచు విష్ణు మాట్లాడుతూ వరుసగా నాలుగో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ఆర్టిస్టులతో పాటు దేశ, విదేశాల ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా నిర్మించిన లైబ్రరీలో సుమారు రూ.30కోట్ల విలువైన పెయింటింగ్‌లను ప్రదర్శనగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని విష్ణు స్పష్టం చేశారు. -
శిల్ప సంపదను తెప్పించండి ‘బాబు’
సీఎంకు లేఖ రాసిన అమరావతి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ హైదరాబాద్: లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదను వెనక్కు తెప్పించేలా చర్యలు తీసుకోవాలని అమరావతి డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి 10వ తేదీన మూడు రోజుల పాట లండన్ పర్యటనకు వెళ్తున్న దృష్ట్యా లండన్ మ్యూజియంను సందర్శించి అక్కడి ప్రధాని క్యామెరన్తో మాట్లాడి మన సంపదను వెనక్కు తెప్పించాలని లేఖలో పేర్కొన్నారు. భారత దేశానికి చెందిన రెండు వేల సంవత్సరాల నాటి బుద్ధుడి విగ్రహాన్ని భారత్‌కు ఇచ్చేందుకు ఆస్ట్రేలియా అంగీకరించిందని ఆ దిశగా ప్రయత్నాలు చేసి లండన్‌లో మన శిల్ప సంపదను తెప్పించి అమరావతిని టూరిజంగా అభివృద్ధి చేయాలని కోరారు. లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ 33 ఏ పేరిట శిల్ప సంపదను ఇప్పటికీ భద్రపరచారని వాటిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.