కన్నీటి వరద
=33 ఇళ్లు నేలమట్టం... 201కి పాక్షికంగా నష్టం
=12 కాలువలకు గండ్లు... రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేత
=1747 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు
=కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆరా తీసిన సీఎస్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : అల్పపీడనం రూపంలో మరో ఉపద్రవం వచ్చిపడింది. ఎడతెరిపి లేకుండా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏ క్షణాన వరద రూపంలో విరుచుకుపడతాయోనని సమీప గ్రామాల్లోనివారు బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు దెబ్బతినడం, భారీ చెట్లు నేలకొరగడంతో కొన్నిమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాటన్నింటినీ పునరుద్ధరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించి వారి ద్వారా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అనకాపల్లి మండలంలోని గొడారి ఆనకట్టను పరిశీలించారు. ఇప్పటి వరకు జిల్లాలో 33 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 201 ఇళ్లు పాక్షికంగా పాడయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వర్షాలు తగ్గాక కూడా కొన్ని ఇళ్లు కూలిపోయే ప్రమాదముంటుందని, పాతబడిన ఇళ్లలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే 12 కాలువలు, ట్యాంక్‌లు, రోడ్లు పాడయ్యాయి.
బుచ్చెయ్యపేట మండలం ఆర్.భీమవరంలో మిరాస కాలువ, లోపుడిలో పెద్దగట్టు చెరువుకు గండ్లు పడ్డాయి. చీడికాడ మండలం నీలంపేట కాలువ, కె.కోటపాడు మండలం కె.జి.పురంలో వెలమ చెరువు, ఆర్.వై.అగ్రహారంలో ముత్యాలమ్మ చెరువు, ఆనందపురం మండలం గండిగుండంలో ఎర్రచెరువు, పరవాడలో రామసాగరం, పద్మనాభ మండలం రేవిడిలో పల్లిగెడ్డ, పోలిపల్లి కాలువ, కృష్ణాపురంలో ఎర్ర చెరువు, మద్దిలో పల్లిగెడ్డలకు గండ్లు పడ్డాయి. నర్సీపట్నం మండలంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సమస్య ఏర్పడింది. పునరుద్ధరించే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అచ్యుతాపురం, అనకాపల్లి రహదారుల్లో చెట్లు పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బొడ్డేరు కాజ్వే కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
పునరావాస చర్యలు
జిల్లాలో కొన్ని గ్రామాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలైన 11 గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భీమిలిలో మజ్జివలస, పద్మనాభంలో పి.సామయ్యవలస, పెందుర్తిలో ఏకలవ్య కాలనీ, రాంపురం, అచ్యుతాపురం మండలంలో పెదపాడు, చోడవరంలో దానమయ్యకోనేరు, కశింకోట మండలంలో తెగడ, మునగపాకలో చూచుకొండ ఎస్సీ కాలనీ, గణపర్తి ఎస్సీ కాలనీ, గాజువాకలో శాతవాహన నగర్, పెదగంట్యాడ మండలంలో కుంచుమాంబ కాలనీలను అధికారులు ఖాళీ చేయించారు. మొత్తం 12 పునరావాస కేంద్రాల్లోకి 1747 మందిని తరలించారు.
సీఎస్ ఆరా
జిల్లాలో వర్షాలు, ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు గురువారం ఫోన్ చేసి ఆరా చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయం కావాలా అని అడిగారు. ఇప్పటి వరకు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ సీఎస్‌కు వివరించారు. అవసరమైతే నేవీ సాయం కూడా తీసుకుంటామని, ఇప్పటికే వారితో మాట్లాడినట్టు చెప్పారు.