హైదరాబాద్ రేడియో జాకీ మృతి.. భర్త అరెస్ట్
హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన రేడియో జాకీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త అయిన ఆర్మీ మేజర్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బేగంపేట్ ఏసీపీ రంగారావు కథనం ప్రకారం.. సంధ్య స్థానికంగా రేడియో జాకీగా జాబ్ చేస్తుండేది. ఆర్మీ మేజర్ వైభవ్ విశాల్ తో ఆమె వివాహం జరిగింది. ఈ క్రమంలో గత నెల 18న తన భార్య సంధ్య ఆర్మీ క్వాటర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త ఆర్మీ మేజర్ వైభవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మృతురాలు సోదరి ఉమాసింగ్ తమ అక్క చాల దైర్యవంతురాలని, భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు మేజర్‌ను అరెస్టు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరారు. అయితే భార్య అనుమానాస్పద మృతి తర్వాత అతనికి ఆరోగ్యం సరిగా లేదంటూ ఒకసారి, మరోసారి ఆర్మీ అంతర్గత విచారణ జరుగుతోందంటూ అరెస్టు చేయనివ్వలేదు. దీనిపై దేశ వ్యాప్తంగా టీవీ చానళ్లలో వార్త కథనాలు ప్రసారం కావడంతో పాటు మృతురాలు బంధువులు కేంద్ర మంత్రికి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఎట్టకేలకు ఆర్మీ అధికారులు మేజర్ విశాల్ వైభవ్‌ను ఆరెస్టు చేయడానికి అనుమతించారన్నారు. ఇతనిపై వరకట్న వేధింపుల కేసుతో పాటు ఎస్సి, ఎస్టి అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు. 14 రోజుల కస్డడీకి తీసుకున్నట్లు తెలిపారు.
వరకట్నం కోసం రేడియో జాకీ సంధ్యను వేధించి, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె అత్త ఆశా సింగ్, ఆడపడుచు ఖుషీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత నెల 18న ఫ్యాన్ కు ఉరేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించిన మేజర్ విశాల్ ఛాతీలో నొప్పి అంటూ అదే రోజు ఆర్మీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. బాధితురాలు సంధ్య సోదరి ఉమ మాత్రం తమ అక్కను బావ, ఆమె కుటుంబసభ్యులే హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేశారు.