breaking news
aradhanothsavalu
-
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు : ముస్తాబైన మఠం
భారతదేశం ఎందరో గురుదేవుళ్ల పుణ్యధామం. వారు సమాజంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. అలాంటి వారిలో సుప్రసిద్ధులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో స్వామి చరిత్ర, ఉత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప కాలజ్ఞానిగా భూ మండలంపై కీర్తి గడించారు. అంతేకాక ఆయన రాజయోగి, హేతువాది, తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. రాబోయే కాలంలో జరిగే విపత్తులపై కాలజ్ఞానం ద్వారా వివరించి.. మానవాళికి ఎన్నో సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కావున మిగతావి కూడా జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. సన్మార్గంలో నడవాలని బోధించారు. ఎన్నో మహిమలు చూపి మహిమాన్వితుడిగా విరాజిల్లారు. కులమతాలను రూపుమాపేందుకు కృషి చేసి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసి జగద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు. చివరికి దైవ స్వరూపులుగా వినుతి కెక్కారు. సజీవసమాధి నిష్ట పొంది భక్తులను అనుగ్రహిస్తు న్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నేటి నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.సన్మార్గంలో నడిపించడం కోసం...మానవులకు జ్ఞాన బోధ చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు నేల నలుచెరగులా సంచరించి బోధనలు చేసి 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. (ఆ ్ర΄ాంతంలోనే ప్రస్తుతం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం ఉంది.) నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.ఏటా వేడుకలుస్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సాతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. ఆరాధనోత్సవానికి ఇంకా పెద్ద ఎత్తున రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రçకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాదం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయి.– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, వైఎస్ఆర్ కడప జిల్లాఘనంగా ఏర్పాట్లుశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.– శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు, మఠాధిపతులు, బ్రహ్మంగారిమఠం -
సింగపూర్‌లో స్వరలయ త్యాగరాజ ఆరాధనోత్సవాలు
సింగపూర్ లో స్వరలయ ఆర్ట్స్ నిర్వహణ లో రెండవ ఏట త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల మార్చి 18 వ తారీఖున స్వర లయ ఆర్ట్స్, సింగపూర్ వారి ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే తెలుగు గాయక గాయనీ మణులంతా ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవములు జరుపుకున్నారు. సంగీత సాగరంలో ఓలలాడి, రామభక్తి లో మునిగి తేలి, యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి, షర్మిల, సౌమ్య, కిరిటి, శేషశ్రీ తదితరులు ఘన రాగ పంచరత్న కీర్తనలు ఆలపించగా, యడవల్లి శ్రీ విద్య తెర తీయగ రాదా అను కీర్తనతో స్వామిని కొలువగా, ఆరగింపవే అను భక్తి నైవేద్యాలతో, పతికి మంగళ హారతీరే అంటూ మంగళ హారతులతో అందరూ త్యాగరాజ స్వామి ఆరాధనలు మిక్కిలి భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. అనంతరం స్వర లయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షులైన శేషు కుమారి గారు సంగీతజ్నులకు మొమెంటోలను బాహుకరించి సత్కరించారు. -
ముగిసిన ఆరాధనోత్సవాలు
నారాయణపేట రూరల్ : పట్టణంలోని పరిమళపురం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉత్తరాధనోత్సవాలను పురష్కరించుకుని స్వామి మహరథోత్సవాన్ని భక్తులు కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతం, నిర్మాల్యం, అష్టోత్తర పారాయణం, పంచామతాభిషేకం, పల్లకిసేవా, కనకాభిషేకం, సర్వసేవా, మహమంగళహరతి నిర్వహించారు. చిన్నారులు వివిధ వేషధారణలతో చేసిన హరిదాసుల సంకీర్తనలు, సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా జోషి రఘుప్రేమ్చారి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. కోడ్లి అక్షోభ్యతీర్థ మఠాధిపతి శ్రీరఘుప్రేమతీర్థులు వందేళ్లక్రితం నారాయణపేటలో శోడశబహులక్ష్మి నర్సింహసమిత శ్రీరాఘవేంద్రస్వామిని ప్రతిష్ఠించారని, ఇక్కడ స్వామి వారిని కొలిచిన భక్తులకు అష్ట ఐశ్యర్యాలు సిద్ధిస్తాయన్నారు. కార్యక్రమంలో అర్చకులు నర్సింహచారి, ఆదోని మురళీధర్ ఆచారి, యాద్గీర్ విద్వాన్ శ్రీనాథచారి, సేవాసమితి సభ్యులు రాఘవేందర్రావు, సుధాకర్‌రావు, కొల్లూర్ భీంసేన్రావు కులకర్ణి, శ్రీపాద్, నారాయణరావు, శేషు, రాజు వార్కార్, ముంజి కిశోర్, సీతారామారావు, హన్మేష్, ప్రసాద్, రవి, రామారావు, శ్రీధర్‌రావు, వెంకుశాస్త్రి, జయతీర్థ, అజిలాపూర్ రాఘవేంద్ర పాల్గొన్నారు. -
ముగిసిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు
సాక్షి, తిరుమల : అశాంతిని శ్రీవారి నామసంకీర్తనం ఒక్కటే దూరం చేయగలదని కర్ణాటకలోని కోలార్ జిల్లా తంబిహళ్లిలోని మాధవ తీర్థం మఠాధిపతులు విద్యాసాగర మాధవతీర్థ, విద్యాసింధు మాధవ తీర్థులు అన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక ఆస్థాన మండపంలో మూడురోజుల పాటు సాగిన జయతీర్థుల ఆరాధనోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా మఠాధిపతులు భక్తులకు మంగళశాసనాలు అందించి, ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని, కష్టకాలంలో అదే కాపాడుతుందని హితబోధ చేశారు. భక్తిమార్గంతోనే మానవులకు మనఃశ్శాంతి చేకూరుతుందన్నారు. కలియుగ రక్షకుడు శ్రీవేంకటేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో సేవిస్తే శాంత స్వభావం అలవడుతుందన్నారు. దాస భక్తులు భజన కార్యక్రమాల ద్వారా శ్రీవారిని కీర్తించి తరించాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 3వేల మంది భక్తులు పాల్గొన్నారు.


