breaking news
Anuradha Gadde
-
సర్కారు స్కూళ్లకు శక్తినిద్దాం
జెడ్పీ చైర్పర్సన్ అనూరాధ మచిలీపట్నం(ఈడేపల్లి) : ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేదిశగా పాటుపడదామని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో శనివారం 2014 ఎస్సెస్సీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగాఅనూరాధ పాల్గొని మాట్లాడారు. విద్య, ఆరోగ్య రంగాలు సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకమైనవని చెప్పారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మరుగుదొడ్లు, ప్రహరీగోడ తప్పనిసరి చేస్తూ నిధులు కేటాయిస్తామని చెప్పారు. మరో అతిథి ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీపడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని ముఖ్యమంత్రిని కోరామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 84 శాతంమంది విద్యార్థులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని వెల్లడించారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ అరకొర సౌకర్యాలతోనే ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు నమోదు కావడం ఎంతో అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులే దేశ ప్రగతికి దిక్సూచి అని తెలియజేశారు. సంఘం కార్యకలాపాల్ని, ప్రగతిని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శికేఏ ఉమామహేశ్వరరావు కూలంకషంగా వివరించారు. అనంతరం పదిగ్రేడు పాయింట్లు సాధించిన విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న పి.వెంకటేశ్వరరావు(సాలెంపాలెం), శ్రీమన్నారాయణ(గొల్లపూడి), ఎం.నాగమల్లేశ్వరరావు (చంద్రాల మీర్జాఅలీహైదర్(నిడుమోలు)ను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీ దివాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, జిల్లా సహాధ్యక్షుడు జి.రమేష్, కోశాధికారి మనోహర్, మచిలీపట్నం పట్టణశాఖ అధ్యక్షుడు తోట రఘుకాంత్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నేడు మలివిడత పరిషత్ పోరు
నేడు గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్ల ఎన్నికలు 23 జెడ్పీటీసీ స్థానాలకు 78 మంది అభ్యర్థుల పోటీ 354 ఎంపీటీసీ స్థానాలకు బరిలో 919 మంది అభ్యర్థులు వైఎస్సార్ సీపీ, టీడీపీ ముఖాముఖి పోరు సాక్షి, మచిలీపట్నం : ప్రాదేశిక పోరు తుది అంకం నేటితో ముగియనుంది. మలిదశ పోరు హోరాహోరీగా శుక్రవారం జరగనుంది. జిల్లాలోని గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్లలోని 23 మండలాల్లో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6న జిల్లాలోని 26 మండలాల్లో పరిషత్ పోరు తొలిదశ ఎన్నికలు పూర్తఅయిన సంగతి తెల్సిందే. వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతి పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు జెడ్పీటీసీగా పోటీ చేసిన సంగతి తెల్సిందే. టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి గద్దే అనురాధ గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. తొలి విడతలో తాతినేని పద్మావతి పోటీ చేసిన తొట్లవల్లూరు మండలం ఎన్నికలు పూర్తవగా మలివిడత పోరులో గద్దే అనురాధ పోటీ చేస్తున్న ఉంగుటూరు మండలం ఎన్నికలు జరగనున్నారుు. వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి రెండు విడతల్లోనూ జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. మలి విడత పోరులో పట్టు సాధించేందుకు వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. జిల్లాలో మలి విడత పోరులో గుడివాడ, నూజివీడు డివిజన్లలో 23 జెడ్పీటీసీ స్థానాలకు 78 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 363 ఎంపీటీసీ స్థానాలకు 9 ఏకగ్రీవమవగా 354 ఎంపీటీసీ స్థానాలకు 919 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 1,230 పోలింగ్ కేంద్రాల్లో 9,36,252 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నూజివీడు డివిజన్లో ఎ.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, గంపలగూడెం, గన్నవరం, ముసునూరు, నూజివీడు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు, విస్సన్నపేట, ఉయ్యూరు మండలాల్లో మలి విడత పోరు జరగనుంది. నూజివీడు మండలంలో 14 జెడ్పీటీసీ స్థానాలకు 51 మంది అభ్యర్థులు, 234 ఎంపీటీసీ స్థానాలకుగాను రెండు ఏకగ్రీవం కావడంతో 232 స్థానాలకు 610 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 765 పోలింగ్ కేంద్రాల్లో 5,93,55 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుడివాడ రెవెన్యూ డివిజన్లో గుడివాడ, గుడ్లవల్లేరు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నందివాడ, పామర్రు, పెదపారుపూడి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ స్థానాలకు 27 మంది పోటీ పడుతున్నారు. 129 ఎంపీటీసీ స్థానాలకు ఏడు ఏకగ్రీవమవడంతో మిగిలిన 122 ఎంపీటీసీ స్థానాల్లో 309 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 312 పోలింగ్ కేంద్రాల్లో 3,42,797 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త గొన్నూరుకు పోలింగ్ కేంద్రం గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరు గ్రామంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు స్థానిక ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుడ్లవల్లేరు మండలం, చినగొన్నూరు పోలింగ్ బూత్ పరిధిలోని కొత్త గొన్నూరు ప్రాంతంలో నాలుగు వందల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎన్నికలు గతంలో కొత్తగొన్నూరులోనే జరిగేవి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి సమీపంలో ఉన్న పాత గొన్నూరుకు పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేశారు. నాలుగు వందల ఓటర్లు ఉన్న కొత్త గొన్నూరును కాదని, కేవలం వంద మంది ఓటర్లు ఉన్న పాత గొన్నూరులో పోలింగ్ కేంద్రం పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందిం చిన కలెక్టర్ గత అనవాయితీని కొనసాగిస్తూ యాథావిధిగా కొత్త గొన్నూరు ప్రాంతంలోనే పోలింగ్ కేంద్రం ఉండేలా మార్పు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం విషయంలో వివాదం సద్దుమణిగింది.