breaking news
ammu and Kashmir
-
కశ్మీర్ కలువ..!
2009. జమ్మూ కాశ్మీర్‌లోని బ్రెస్వానా గ్రామం. ఓ ఇంటిలోని పెద్దాయన కన్ను మూశాడు. దాంతో ఆయన కుమారుడు బెంగళూరు నుంచి తన కుటుంబ సభ్యులతో వచ్చాడు. కుటుంబ సభ్యు లంతా దుఃఖంలో మునిగిపోయారు. అంత్యక్రియల ఏర్పాట్లతో బిజీ అయిపోయారు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం అక్కడ జరుగుతున్నదాన్ని వది లేసి, జరగాల్సినదాని గురించి ఆలోచిస్తూ కూచుంది. కార్యక్రమాలన్నీ ముగిసే సరికల్లా తాను చేయాల్సిన పనేంటో ఆమెకు బోధపడింది. ఓ దృఢ నిశ్చయంతో తిరిగి బెంగళూరు బయలుదేరింది. అనుకున్నది సాధించింది! ‘‘నాన్నా... నేను బ్రెస్వానాలో ఓ స్కూలు పెట్టాలనుకుంటున్నాను’’... సభా మాట వింటూనే అవాక్కయ్యారు ఆమె తల్లిదండ్రులు. డిగ్రీ పూర్తి చేసి, ఓ పక్క చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని ప్రయత్నిస్తూ, మరోపక్క పత్రికల్లో కాలమిస్టుగా అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటోన్న కూతురు... ఉన్నట్టుండి ఆ నిర్ణయమెందుకు తీసుకుందో అర్థం కాలేదు వారికి. పైగా బ్రెస్వానా మామూలు ప్రాంతం కాదు. జమ్మూకి ఉత్తరాన 160 కి.మీ.ల దూరంలో ఉండే ఆ ఊరికి వెళ్లడమే పెద్ద పని. కొంత దూరం వెళ్లాక కొండ ప్రాంతం మొదలవుతుంది. ఆ కొండలు ఎక్కుతూ ఊరు చేరడం చాలా కష్టం. పైగా అక్కడ పురివిప్పిన తీవ్రవాదం, అవినీతి గుర్తొచ్చి వాళ్లు కంగారుపడ్డారు. కానీ సభా వెనక్కి తగ్గలేదు. తాతయ్య అంత్య క్రియలకు వెళ్లినప్పుడు, తన సొంత ఊరిలో రెండు తరాల నుంచీ అక్కడ ఎవ్వరూ చదువుకోవడం లేదన్న విషయం తెలిసి షాకయ్యిందామె. ఎలాగైనా అక్కడి వారికి విద్యనందించాలని ఆ క్షణమే నిశ్చయించుకుంది. అదే విషయం తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించింది. బ్రెస్వానాలో హజీ పబ్లిక్ స్కూల్‌ని స్థాపించింది. తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో స్థాపించిన ఆ బడిలో ఇప్పుడు 160 మంది పిల్లలు ఉచితంగా చదువుకుంటున్నారు. నాలుగో తరగతి వరకూ ఉన్న ఆ బడిని పదో తరగతి వరకూ పెంచాలని, అలాగే ఓ కాలేజీని కూడా స్థాపించాలని ప్రయత్నిస్తోంది సభా. అడు గడుగునా అడ్డుపడే తీవ్రవాదుల్ని ఎదుర్కొంటూ, చదువుల తల్లికి ఆ ఊరిలో శాశ్వతస్థానం కల్పించా లని చూస్తోంది. ఇంతవరకూ అనుకున్నది సాధిం చాను, ఇకముందు కూడా సాధించి చూపిస్తాను అంటోంది ఎంతో నమ్మకంగా!! ‘‘విద్య అనేది అందరి హక్కు. దాన్ని లాక్కోవడం ఎంత తప్పో, అది అందనివాళ్లను పట్టించుకోకుండా వదిలేయడమూ అంతే తప్పు. మనిషి ఎదగాలన్నా, తన జీవితాన్ని అందంగా నిర్మించు కోవాలన్నా చదువు ఉండాలి. అందుకే విద్యావ్యవస్థ పటిష్టంగా ఉండాలి. విద్య అందరికీ అందుబాటులో ఉండాలి.’’ - సభా హజీ -
మోడీ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. లడక్, సియాచిన్లలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో మోడీ భాగంగా రెండు విద్యుత్ ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. వీటితో పాటు సియాచిన్‌లో సైనికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఆయన ఈరోజు ఉదయం పది గంటలకు లడక్ చేరుకుంటారు. మోడీకి రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.ఓహ్రా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు కేంద్రమంత్రి పియూష్ గోయల్, ఇతర అధికారులతో పాటు బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. మరోవైపు మోడీ పర్యటన నేపథ్యంలో బీఎస్ఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. అమర్ నాథ్ యాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై దాడి చేశారు. అయితే భారత జవాన్లు ఆ దాడిని తిప్పికొట్టారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్లో హై ఎలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం 3 వేలమంది సైనికులు పహారా కాస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.