సఖీ.. ఎంత లక్కీ!
భార్యను ఆటపట్టించకపోతే తను భర్తెలా అవుతాడు? భర్తను ఆటాడించకపోతే ఆమె మిసెస్ బంగారం ఎలా అవుతుంది? రోజూ పొగడ్తలు వింటే బోరు కొట్టదూ! కాఫీలో చక్కెర తక్కువైందనో సినిమా చూసి చాలాకాలం అయిందనో ఒకర్నొకరు విసుర్లాడుకోకపోతే ప్రేమ పూసేదెలా? విరగ కాసేదెలా? అవును. చిన్నచిన్నగా సఖ్యతను పెంచుకుంటుంటే.. పెద్దపెద్ద అభిప్రాయాలలోనూ ఏకభావన వస్తుంది. సఖీ... చిన్నచిన్న సంతోషాలు ఎంచుకో. సఖ్యత పెంచుకో. పొంచివున్న నక్కల నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. ‘సఖీ.. ఎంత లక్కీ!’ అనిపించుకో.
ఆఫీస్‌కి బయల్దేరడానికి బ్యాగ్ తీసుకొని గది బయటకు వచ్చిన మధుమతికి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్ధం కాలేదు. టిఫిన్ ప్లేట్ వచ్చి గోడకు కొట్టుకొని, గింగిరాలు తిరిగి తన కాళ్ల మీద పడింది. ప్లేట్లో ఉన్న ఇడ్లీ ముక్కలు చిందరవందరగా ఫ్లోర్ అంతా పడ్డాయి. బిత్తరపోయి భర్త సురేశ్ వైపు చూసింది. ‘‘దగ్గరుండి వడ్డించాలనే స్పృహ కూడా లేదు. వీడి మొహానికి ఇదే ఎక్కువ అనేగా నీ ఉద్దేశం..’ తిట్టుకుంటూనే బయటకు వెళ్లిపోయాడు.
సహనం నశిస్తోంది
‘‘మధూ... ఏంటలా ఉన్నావ్!’’ భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా బృంద. ఆఫీసులో సహోద్యోగి బృంద. కళ్ల నీళ్లు తుడుచుకుంటున్న మధుమతిని చూస్తూ.. ‘‘మళ్లీ ఇంట్లో గొడవా!’’ అంది. ‘అవును’ అన్నట్టు తలూపింది మధుమతి. ఇద్దరూ టీ బ్రేక్కని సెక్షన్ నుంచి బయటకు వెళ్లారు. ‘‘సురేశ్‌ని భరించేటంత సహనం ఇక లేదే. బయటకు వచ్చేద్దామనుకుంటున్నాను’’ అంది మధుమతి. ‘‘తొందరపడకు. సాయంత్రం కలుద్దాం’’ అంటూ మధు భుజమ్మీద చెయ్యి వేసి అనునయంగా చెప్పి, తన సెక్షన్వైపు వెళ్లిపోయింది బృంద. సహోద్యోగులే అయినా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేటంత చనువు ఉంది ఇద్దరి మధ్య. మధుమతి నిట్టూర్చుతూ తన సీట్లో కూలబడింది.
విసుగ్గా అనిపిస్తోంది
మధుమతి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరికీ పెళ్లై రెండేళ్లు. పెద్దలు నిశ్చయించినదే! పెళ్లయిన రెండోరోజే తన పట్ల నిరసన చూపడం మొదలుపెట్టాడు సురేశ్. బట్టలు నీటుగా సర్దలేదని, వంట చేయడం రాదని.. తగువు పెట్టుకున్నాడు. టీ త్వరగా తేలేదని ఓ రోజు, నీళ్లు ఒలకబోసావని ఒకరోజు.. అయినదానికీ కానిదానికి గొడవే. పెళ్లయిన రెండు నెలలకి గ్రోత్ లేదని చేస్తున్న ఉద్యోగం మానేశాడు. ఇల్లు గడవాలనే ఆలోచనతో తనే ఉద్యోగంలో చేరింది. ఈ రెండేళ్లలో సరదాగా సినిమాకో, హోటల్‌కో వెళ్లడం రెండు, మూడుసార్లకి మించి లేదు. తనే నోరు తెరిచి అడిగితే డబ్బులు ఎందుకు దండగ అంటూ రివర్స్ ఉపన్యాసాలు మొదలుపెట్టాడు. ఆఫీసులో ఉన్నంత సేపు బాగానే ఉంటుంది. ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంటుంది. ఆలస్యానికి ప్రతిరోజూ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు భరిస్తుందో అర్థం కావడం లేదు. ప్రతీ చిన్నదానికి విసుగ్గా అనిపిస్తుంది. ఆ విసుగు ఈ మధ్య ఇంకా పెరిగింది. దానికి కారణం.. క్రాంతేనా?!
సురేశ్‌కి, క్రాంతికీ ఎంత తేడా!
మధుమతి ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే క్రాంతి పని చేస్తున్నాడు. అతను ఆ ఆఫీసులో చేరి ఆర్నెల్లవుతోంది. బ్యాచిలర్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలివిడిగా ఉండే క్రాంతి అంటే అక్కడున్న అందరికీ ఇష్టం. అయితే అతడి ధ్యాసంతా.. ఎప్పుడూ ముభావంగా ఉండే మధుమతిపై ఉండేది. కొద్ది రోజుల్లోనే ఆమె విషయాలన్నీ రాబట్టాడు. సంతోషంగా ఎందుకు ఉండాలో చెబుతూ, ఎప్పుడు ఏ సాయమడిగినా ‘జీ హుజూర్’ అంటూ క్షణాల్లో చేసి పెట్టేవాడు. దీంతో మధుమతికి క్రాంతి మీద ఆసక్తి కలగడం మొదలైంది. ఎప్పుడూ తప్పులు ఎత్తిచూపే భర్త, ఎప్పుడూ సంతోషంగా ఉంచే క్రాంతి.. ఇద్దరినీ బేరీజు వేసుకోవడం మొదలుపెట్టింది మధుమతి.
ఊహించని పరిణామం!
సరేశ్ ఉదయం చేసిన రాద్ధాంతానికి మధుమతి మనసు చివుక్కుమంది. ‘తనను అపురూపంగా చూసే క్రాంతితో కలిసి బతికితే...’ అనిపించింది ఒక్క క్షణం. అంతే, ఈ ఆలోచనతో మధుమతిలో అలజడి మొదలైంది. తన పుట్టిన రోజు అని ఆఫీసు టైమ్ అవగానే కలుద్దామని చెప్పి వెళ్లాడు క్రాంతి. కాదని చెప్పలేకపోయింది. సాయంకాలం పార్క్‌కి తీసుకెళ్లాడు క్రాంతి. ‘నీ రాకతో ఈ వాతావరణం ఎంత ఆహ్లాదంగా మారిపోయిందో చూడు’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ మాటలకు మురిసిపోయింది మధుమతి. ఉన్నట్టుండి క్రాంతి మధుమతి చెయ్యి తీసుకొని తన గుండెల మీద పెట్టుకున్నాడు. తనను చుట్టేసి ‘నువ్వు లేనిదే నేను లేను’ అన్నాడు. ఊహించని ఆ పరిణామానికి ఉలిక్కిపడింది. క్రాంతిని తప్పించుకొని ఇంటి దారిపట్టింది. ఆ రోజు నుంచి తిండికీ, నిద్రకు దూరమైంది.
జీవితం... అయోమయం
స్నేహితురాలి సలహాతో రిగ్రెషన్ థెరపీకి వెళ్లింది మధుమతి. తన అంతర్మథనానికి పరిష్కారం కోరుతూ కౌన్సెలర్ ముందు కూర్చుంది.‘‘నా కొలీగ్ని ఇష్టపడుతున్నానా? నా భర్తను కాదనుకొని అతనితో వెళ్లిపోతే? నా జీవితం అంతా అయోమ యంగా ఉంది.. ’’ కళ్ల నీళ్లు ఆపే ప్రయత్నంలో మాటలనూ ఆపేసింది. కాసేపు ఆగి ‘‘నా ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది?! ’’ అంది మధుమతి. ఆమె మాటలకు..‘‘మీలోనే ఉంది. తెలుసుకోండి..’’ అన్నారు కౌన్సెలర్. మధుమతికి రిగ్రెషన్ థెరపీ మొదలయ్యింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పదిహేను నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఈ ధాన్యప్రక్రియలో మధుమతికి అస్పష్టతలు స్పష్టం అవడం మొదలైంది. ఆందోళనలు ఆలోచనలవైపుగా మరలుతున్నాయి. పెళ్లి నాటి రోజులు, కాలేజీ రోజులు, అమ్మనాన్న గారాబం, బాల్యం.. అన్నింటినీ దర్శించుకుంటూ సమన్వయ పరుచుకుంటూ సినిమా రీలును వెనక్కి తిప్పినట్టుగా కాలాన్ని రివైండ్ చేస్తూ తన జీవితాన్ని దర్శిస్తోంది. అమ్మ గర్భంలో ఉన్న స్థితి నుంచి గత జన్మలోకి ప్రయాణించింది. ఆ ప్రయాణంలో సురేశ్ రూపం లీలగా కాసేపటికి స్పష్టంగా కనిపించసాగింది. నెమ్మదించిన ఆమె మనోగతాన్ని ప్రశ్నిస్తూ కౌన్సెలర్..‘‘మధుమతీ, మీ మనోఫలకం మీద ఇప్పుడు ఏం కనిపిస్తోంది?’’ అని అడిగారు.
గతజన్మ గురువు.. ఈ జన్మ భర్త!
మధుమతి చెప్పడం మొదలుపెట్టింది... ‘‘నాకు సురేశ్ కనిపిస్తున్నాడు. అతను నాకు గైడ్‌గా ఉన్నాడు. నేను అతని విద్యార్థిగా ఉన్నాను. అతను చెప్పిన విషయాలేవీ నేను పట్టించుకోవడం లేదు. ప్రతి చిన్న విషయానికీ అతనితో వాదిస్తున్నాను. గొడవ చేస్తున్నాను. సహనంగా ఉండి, విషయాన్ని అర్థం చేసుకోమని అతను పదే పదే చెప్పినా నేను వినిపించుకోవడం లేదు. మళ్లీ మళ్లీ పొరపాట్లు చేస్తూనే ఉన్నాను. ఆకర్షణను ప్రేమగా భావించి క్రాంతితో వెళ్లిపోయాను. ఆ విధంగా నా డిగ్రీ పూర్తి కాలేదు. క్రాంతితో జీవితాన్ని ఆనందించలేక, ఎదుగుదల లేక బతికినన్నాళ్లూ మానసిక క్షోభను అనుభవించాను. నా గైడ్ చెప్పింది వినడానికే ఈ జన్మలో సురేశ్‌ని భర్తగా ఆహ్వానించాను. అందుకే అతని నుంచి దూరం కాలేకపోతున్నాను. క్రాంతిపై ఉన్న ఆకర్షణ నా జీవితాన్ని అసంపూర్ణం చేస్తోందని తెలుసుకోలేకపోతున్నాను’’ చెప్పింది మధుమతి. ‘‘గతం నుంచి ప్రస్తుతంలోకి రండి. ఈ జన్మలో ఈ రెండేళ్ల మీ జీవితాన్ని దర్శించండి. పొరపాట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి...’’ అన్నారు కౌన్సెలర్.
వర్తమానంలోనూ అదే భావన
మధుమతి తన వైవాహిక జీవితాన్ని దర్శిస్తూ చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఆనందం లేదంటూనే సురేశ్తోనే ఉంటున్నాను. అతని ప్రవర్తననూ భరిస్తున్నాను. కాదు కాదు నా ప్రవర్తననే సురేశ్ భరిస్తూ వచ్చాడు. నేనే అతనితో సఖ్యతగా మెలగాలని, వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనే జ్ఞానాన్ని కోల్పోయాను. గతాన్ని ఈ జన్మకూ మోసుకొచ్చాను. ఎంత కంఫర్ట్‌గా ఉండాలని ప్రయత్నించినా సురేశ్ నాకు గైడ్ అనే భావనలోనే ఉన్నాను. అందుకే ఇన్నాళ్లూ అతన్ని భర్తగా అంగీకరించలేకపోయాను. దీని వల్లే అతనికి మానసికంగా, శారీకంగా దగ్గర కాలేకపోయాను. అతని పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను. జీవితాన్ని అసంపూర్ణంగా మోస్తూ వస్తున్నాను..’’ అంటూ, ‘‘ఎరుకతో జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఉంది’’ అని చెప్పింది మధుమతి. గతాన్ని విగతం చేస్తే వర్తమానం ఎంత అందంగా ఉంటుందో థెరపీలో తెలుసుకుంది. గైడ్‌గా తన సహనాన్ని పరీక్షించడానికే భర్తగా వచ్చిన సురేశ్‌తో సఖ్యతగా ఉండటానికి, అతడిని మార్చుకోవడానికే అంగీకరించింది.
సఖ్యతతో దగ్గరైన మనసులు
‘‘మధూ... ’’ భర్త అరుపులకు కంగారుపడుతూ వచ్చింది మధుమతి. ‘‘ఈ కాఫీ ఏంటి? ఇంత చల్లగా...’’ విసుగ్గా అంటున్న సురేశ్‌కి అంతే ఘాటుగా సమాధానమిద్దానుకుంది. అంతలో నిభాయించుకొని అతనికి దగ్గరగా వచ్చి కాఫీని చూసింది. పైన మీగడ తెట్టు కట్టుకుపోయి చల్లగా ఉన్న కాఫీని చూసి ‘అయ్యో, సారీ.. సారీ.. ’’ అంటూ వెళ్లి వేడి వేడి కాఫీ తీసుకొచ్చి సురేశ్ చేతికి అందిస్తూ చిరునవ్వు నవ్వింది. ‘నీ నవ్వు బాగుంటుందోయ్!’ కాఫీ అందుకుంటూ సురేశ్ మెచ్చుకోలుగా చూశాడు. ఆ మెచ్చుకోలును చిరునవ్వుకు ఆనందపు హంగుగా అద్దుకుంది మధుమతి.
చిన్న చిన్న విషయాల్లో సఖ్యత
ఎలాంటి ఇల్లు రెంట్‌కు తీసుకుంటున్నాం. లేదా ఎలాంటి ఇల్లు కొంటున్నాం. ఎలాంటి వాహనం కొనబోతున్నాం. పిల్లలను ఎలాంటి స్కూల్లో చదివించాలి... ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాల్లో భార్యాభర్త మధ్య సఖ్యత కుదరకపోవచ్చు. ఎందుకంటే అక్కడ సఖ్యత కన్నా అభిప్రాయం ముఖ్యం అవుతుంది. కానీ, చిన్న చిన్న విషయాలలో సఖ్యత కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే, ‘నీకు ఆరెంజ్ కలర్ చీర భలేగా ఉంటుంది రా!’, ‘మీకు బ్లూ కలర్ షర్ట్ సూటవుతుందండి,’ ‘రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగితే నిద్ర బాగా వస్తుందండి’, ‘పొద్దునే వాకింగ్‌కి వస్తావా! భలే సరదాగా ఉంటుంది’ ... ఇలాంటి చిన్న చిన్న విషయాలల్లో సఖ్యత కుదుర్చుకుంటే బంధం బలపడుతుంది.
పాఠాన్ని గుర్తిస్తే సఖ్యత
చాలావరకు జంటలు పరిస్థితులు ఎలా ఉన్నా కలిసి ఉండాలనే కోరుకుంటారు. ఆ బంధం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠమేదో ఉన్నదని గుర్తిస్తే చాలు సఖ్యత పెరిగేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. బంధంలో సమస్యలు సహజం. అవి తగ్గుముఖం పట్టేలా ఏం చేయవచ్చో అందుకు తగిన ప్రయత్నాలవైపు దృష్టిపెట్టాలి. భవిష్యత్తులో తమ బంధం ఎంత అందంగా మార్చుకోవచ్చో తెలుసుకుంటే ఇద్దరిలోనూ ఆశించిన మార్పులు వస్తాయి. జీవనప్రయాణం అర్థం అయితే బంధాన్ని పటిష్టం చేసుకుంటారు. గతాన్ని అర్థం చేసుకొని విగతం చేసుకుంటే వర్తమానం అందంగా రూపుకడుతుంది. – డాక్టర్ హరికుమార్, జనరల్ సర్జన్, ఫ్యూచర్‌లైఫ్ థెరపిస్ట్, హైదరాబాద్
గమనిక : ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి