breaking news
alok reddy
-
తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు
-
తొమ్మిదేళ్ల మా స్నేహాన్ని చిదిమేశారు
► ఇదంతా కల అయి ఉంటే ఎంత బాగుండేది ► నేను కారు కొనేవరకు శ్రీనివాస్ కూడా కొనలేదు ► చొక్కాతో కట్టు కట్టకపోతే నా ప్రాణాలూ పోయేవి ► అమెరికా కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి ► చేతి కర్రలతో వచ్చి సంస్మరణ సభలో పాల్గొన్న అలోక్ ఓలేత్ (అమెరికా): ప్రాణస్నేహితుడిని పోగొట్టుకున్న బాధ అలోక్ రెడ్డి గుండెలను పిండేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతూనే కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణార్థం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చేతికర్రల సాయంతో నడుస్తూ వచ్చారు. శ్రీనివాస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఓలేత్ నగరంలోని బాల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ కాన్సాస్ సిటీ వాళ్లు ఏర్పాటుచేసిన ఈ సంస్మరణ సభలో అలోక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ''ఇదంతా ఓ కల అయితే బాగుండనిపిస్తోంది. అసలు నేను ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం శ్రీనివాసే. అతడు కూడా ఇప్పుడు నాతో ఉండి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది. తొమ్మిదేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ఇద్దరం కలిసే ఉద్యోగానికి వెళ్లేవాళ్లం, తిరిగి వచ్చేటప్పుడు సరదాగా గడిపేవాళ్లం. ఇక్కడ కష్టంగా ఉందని గానీ, తిరిగి వెళ్లిపోదామని గానీ శ్రీనివాస్ ఏరోజూ చెప్పలేదు. గత ఆరు నెలలుగా ప్రతిరోజూ నా అపార్టుమెంటు దగ్గరకు వచ్చి, తన కారులో ఎక్కించుకుని ఆఫీసుకు తీసుకెళ్లేవాడు. నేను కారు కొనేవరకు కూడా తను కొనకుండా ఆగాడు. అంత మంచి మనసు మా శ్రీనుది. నేను కారు కొన్నా కూడా దాన్ని బయటకు తీయాల్సిన అవసరం రాలేదు'' అని అలోక్ చెప్పారు. పిచ్చి ఆవేశంలో ఒక వ్యక్తి చేసిన నేరం వల్ల తాను తన ప్రాణస్నేహితుడిని కోల్పోయి ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ఘటనే తప్ప కాన్సాస్ ప్రాంత అసలైన స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బతీయలేదని అన్నారు. దాంతో ఒక్కసారిగా ఆ సదస్సు జరిగిన హాల్ చప్పట్లతో మార్మోగింది. అమెరికాలో నిస్వార్థపరులు, కష్ట జీవులు ఉంటారని, ఆరోజు రాత్రి జరగకూడని ఘటన జరిగిందని అలోక్ చెప్పారు. ఆ షర్టు లేకపోతే... కాల్పులు జరిగిన రోజున తమను కాపాడేందుకు వచ్చింది ఒకరు కాదు.. ఇద్దరని అలోక్ రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదు గానీ, ఆయన తాను వేసుకున్న షర్టు తీసి, తనకైన బుల్లెట్ గాయం నుంచి అవుతున్న రక్తస్రావాన్ని ఆపడానికి కట్టుకట్టారని చెప్పారు. ఆయన అలా కట్టకపోతే.. తీవ్ర రక్తస్రావం కారణంగా తన ప్రాణాలు కూడా పోయి ఉండేవని అంబులెన్సులో ఉన్నవాళ్లు తనకు తెలిపారన్నారు. అమెరికన్లంతా సహనం కలిగి ఉండాలని, మానవత్వం పట్ల గౌరవం ఉండాలని చెబుతూ.. తాను ఎక్కువ ఏమీ అడగట్లేదని, తన స్నేహితుడు కూడా ఇదే కోరుకుంటాడని అలోక్ చెప్పారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
అలోక్‌రెడ్డి కుటుంబసభ్యులకు నేతల పరామర్శ
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ అలోక్ రెడ్డి కుటుంబసభ్యులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎల్బీనగర్ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేత మల్లు రవి పరామర్శించారు. చైతన్యపురి లోని ఇంద్రానగర్ కాలనీలోని నివాసం ఉంటున్న అలోక్ తల్లిదండ్రులను నేతలు ఆదివారం కలిశారు. ప్రభుత్వ తరుపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్య పడవద్దని వారికి కేంద్రమంత్రి భరోసానిచ్చారు. అమెరికాలో ఇటీవల మరణించిన తెలుగు వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విదేశాల్లో ఉంటున్న ప్రతి భారతీయుడికి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి కాన్సులేట్ అధికారులతో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోందని దత్తాత్రేయ తెలిపారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు ఆదివారం అమెరికా వెళ్తున్నట్లు అలోక్ రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు.