breaking news
Allegations of sexual harassment
-
పార్లమెంట్లో లైంగిక వేధింపులు
సిడ్నీ: పార్లమెంట్ భవనం సాక్షిగా తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిడియా థోర్ప్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. మహిళలు పనిచేసేందుకు పార్లమెంట్ సురక్షితమైన చోటు కాదని పేర్కొన్నారు. పలుకుబడి కలిగిన ఒక నేత తనపట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, తాకరాని చోట తాకుతూ కోరిక తీర్చాలంటూ వేధించేవారంటూ లిబరల్ పార్టీ ఎంపీ డేవిడ్ వాన్ పేరును ఆమె పార్లమెంట్లో ప్రస్తావించారు. బుధవారం పార్లమెంట్లో ఇవే ఆరోపణలను థోర్ప్ చేయగా డేవిడ్ వాన్ ఖండించారు. థోర్ప్ ఆరోపణలతో షాక్‌కు గురయ్యాయనని, అవి పూర్తిగా అవాస్తవమని మీడియాతో అన్నారు. పార్లమెంట్ ఆంక్షలు విధిస్తుందనే భయంతో వాటిని వెనక్కి తీసుకుంటున్న ప్రకటించారు. గురువారం థోర్ప్ ఇవే ఆరోపణలు మరోసారి చేశారు. ‘పార్లమెంట్ భవనంలోని నా ఆఫీసు నుంచి బయటకు ఒంటరిగా రావాలంటేనే భయమేసేది. తోడుగా ఒకరిని వెంటబెట్టుకుని భవనంలో తిరిగేదాన్ని. ఇలాంటి అనుభవాలను చాలామందే ఎదుర్కొన్నా. తమ కెరీర్‌పై ప్రభావం పడుతుందనే ఎవరూ బయటకు రావడం లేదు’అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఆరోపణలతో వాన్‌ను లిబరల్ పార్టీ సస్పెండ్ చేసింది. 2019 మార్చిలో బ్రిటనీ హిగ్గిన్స్ అనే పార్టీ కార్యకర్తపై తోటి కార్యకర్త పార్లమెంట్ కార్యాలయం గదిలోనే అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై విచారణ ఇప్పటికీ ముందుకు పడలేదు. దీనిపై బుధవారం ఎంపీ వాన్ ఖండిస్తూ ప్రసంగిస్తుండగానే స్వతంత్ర ఎంపీ లిడియా థోర్ప్ అడ్డుతగులుతూ ఆయనపై ఆరోపణలు చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ మహిళా సభ్యుల్లోని 63 శాతం మంది ఏదో ఒక విధమైన వేధింపులకు గురవుతున్నారంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చడం గమనార్హం. -
‘ఆమె నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం’
న్యూఢిల్లీ: జర్నలిస్ట్ ప్రియా రమణి తనపై చేసిన ట్వీట్లు, కథనాలు పని ప్రదేశంలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల సమస్యపై దృష్టి సారించడానికి ఉద్దేశించినవిగా పేర్కొనడం తప్పని కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు. ప్రియా రమణిపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం శనివారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియా రమణిని లక్ష్యంగా చేసుకొని తాను పరువునష్టం కేసు వేయలేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 10న కోర్టు విచారణకు హాజరైన ప్రియ రమణి తాను చేసిన ఆరోపణలు సరైనవే అన్నట్లు, ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. మీటూ ఉద్యమం సందర్భంగా ఎంజే అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మొదటి మహిళ ప్రియా రమణి. వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల కారణంగా.. 2018, అక్టోబర్ 17న కేంద్ర మంత్రి పదవికి అక్బర్ రాజీనామా చేయవలసి వచ్చింది. -
ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు
మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిపై మహిళా న్యాయమూర్తి ఆరోపణలు లైంగిక వేధింపులపై సీజేఐకి లేఖ రాసిన మహిళా న్యాయమూర్తి ఆరోపణలను ఖండించిన హైకోర్టు న్యాయమూర్తి నిజమని తేలితే మరణశిక్షకైనా సిద్ధమని సీజేఐకి లేఖ భోపాల్: అత్యున్నతమైన న్యాయవ్యవస్థను లైంగిక వేధింపుల ఆరోపణలు ఓ కుదుపు కుదిపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గ్వాలియర్‌లోని మహిళా అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనను ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారని, జడ్జి వేధింపులు భరించలేక తాను రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఆర్ఎం లోథాకు 9 పేజీల లేఖ రాశారు. అయితే మహిళా న్యాయమూర్తి ఆరోపణలను సదరు హైకోర్టు జడ్జి తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు రుజువైతే మరణ శిక్షను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో ఓ న్యాయాధికారి భార్యతో ఫోన్ చేయించి ఓ పెళ్లి వేడుకలో తాను ఓ ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని జడ్జి చెప్పించారని, అయితే అందుకు నిరాకరించానని మహిళా న్యాయమూర్తి సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి ఆదేశాలపై ముగ్గురు న్యాయాధికారులూ తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తనపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తప్పుడు నివేదికలు సమర్పించారని, అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే దానినని పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను గత నెలలో గిరిజన ప్రాంతానికి బదిలీ చేయించారని పేర్కొన్నారు. బదిలీపై హైకోర్టు జడ్జితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తన కోరిక తీర్చకపోవడం వల్ల, ఒంటరిగా తన బంగళాకు రాకపోవడం వల్లే బదిలీ చేసినట్టు చెప్పారని ఆరోపించారు. బదిలీకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి అపాయింట్మెంట్ కోరితే నిరాకరించారని, గత్యంతరం లేక ఆత్మాభిమానాన్ని, కుమార్తె కెరీర్‌ను కాపాడుకునేందుకు జూలై 15న రాజీనామా చేసినట్టు చెప్పారు. సీబీఐ విచారణకైనా సిద్ధం: హైకోర్టు జడ్జి ఈ ఆరోపణలను ఖండిస్తూ హైకోర్టు న్యాయమూర్తి మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్కులేఖ రాశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, సీబీఐతో విచారణ చేయించవచ్చన్నారు. మహిళా జడ్జి మాత్రమే కాదు, ఏ మహిళనైనా తాను లైంగికంగా వేధించినట్టు, దూషించినట్టు రుజువైతే మరణశిక్షకూ సిద్ధమని చెప్పారు. ఈ లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి పంపారు. ఇది తీవ్రమైన అంశం.. సీజేఐ ఈ ఆరోపణల అంశం తీవ్రమైనదని, తగిన రీతిలో వ్యవహరిస్తామని సీజేఐ లోథా చెప్పారు. ఈ అంశం ఇంకా తన వద్దకు రాలేదని, అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మరోవైపు మహిళా జడ్జి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. బదిలీకి సంబంధించి జడ్జి అభ్యర్థనలను నిరాకరించామని, లైంగిక వేధింపులకు సంబంధించి ఆమె ఫిర్యాదు చేయలేదని తెలిపింది. కాగా, మహిళా జడ్జిపై వేధింపులకు పాల్పడిన న్యాయమూర్తిని తక్షణం విధుల నుంచి తప్పించాలని, మహిళా న్యాయమూర్తిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు మహిళా జడ్జి ఆరోపణలకు సంబంధించి హైకోర్టు జడ్జిపై ఎఫ్ఐఆర్ నమోదు, న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.