breaking news
All India Judicial Services
-
తెరపైకి మళ్లీ ఏఐజేఎస్
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
‘ఆలిండియా జ్యుడీషియల్’ వద్దు
దిగువ కోర్టుల్లో జడ్జీల నియామకాలకు ఉద్దేశించిన ఏఐజేఎస్‌పై మెజారిటీ హైకోర్టుల వ్యతిరేకత ► కేంద్ర ప్రతిపాదనలకు లభించని ఆమోదం ► కింది కోర్టులపై నియంత్రణ కోరుతున్న హైకోర్టులు ► దిగువ కోర్టుల్లో భారీగా జడ్జీల ఖాళీలు ► నీట్, యూపీఎస్సీ తరహా ప్రతిపాదనలు చేసిన కేంద్రం న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలోనూ ఆలిండియా సర్వీసుల (ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్–ఏఐజేఎస్)ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం ఆలోచనకు హైకోర్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కిందిస్థాయి కోర్టుల్లో ఈ సేవలను అమలుచేయాలంటూ కేంద్ర న్యాయశాఖ చేసిన ప్రతిపాదనను 9 హైకోర్టులు వ్యతిరేకించాయి. రెండు హై కోర్టులు మాత్రమే దీన్ని ఆమోదించగా.. ఎనిమిది హైకోర్టులు చాలా మార్పులు (నిమాయక స్థాయి, అర్హతలు, శిక్షణ, ఏఐజేఎస్ ద్వారా భర్తీ చేసే ఖాళీల్లో కోటా వంటి అంశాలపై పలు సూచనలు) సూచించాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు 24 హైకోర్టులు దాదాపుగా విముఖత వ్యక్తం చేశాయి. ఈ కోర్టులన్నీ కిందిస్థాయి కోర్టులపై తమ నియంత్రణ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాయి. అయితే దిగువ కోర్టుల్లో భారీగా న్యాయమూర్తుల ఖాళీల కారణంగానే పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి వచ్చి ఖాళీలను భర్తీ చేయాలని న్యాయశాఖ యోచిస్తోంది. ‘మెజారిటీ కోర్టులు కిందిస్థాయి కోర్టులపై పాలనాపరమైన నియంత్రణ ఉండాలని భావిస్తున్నాయి’ అని కేంద్ర న్యాయశాఖ.. పార్లమెంటు సంప్రదింపుల కమిటీకి పంపిన నివేదికలో పేర్కొంది. బంతి ‘సుప్రీం’ కోర్టులో.. 2015, డిసెంబర్ 31న విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలోని దిగువకోర్టుల్లో 4,452 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీచేసే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కొన్ని సూచనలు చేసింది. నీట్ తరహా పరీక్షను నిర్వహించటం ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపాదించింది. కోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను వేగంగా భర్తీ చేసేందుకు వివిధ పద్ధతులను కూడా కేంద్రం సూచించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండే.. నియామక సంస్థను ఏర్పాటుచేసి కేంద్రీకృత పరీక్షను నిర్వహించాలని కూడా ప్రతిపాదించింది. జ్యుడీషియల్ అధికారుల ఎంపిక కోసం యూపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని కూడా సుప్రీంను కేంద్రం కోరింది. ఐబీపీఎస్‌లో అనుసరిస్తున్న పద్ధతులను కూడా పరిశీలించాలని న్యాయశాఖ కార్యదర్శి సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 1960 నాటి ఈ ప్రతిపాదనలను మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. జర్నలిస్టులు ప్రత్యేకం కాదు: ఢిల్లీ కోర్టు పౌరుల పేరు ప్రతిష్టలను భంగం కలిగించేలా ఎవరినైనా విమర్శించటం, ఆరోపణలు చేసే హక్కు మీడియాకు లేదని ఢిల్లీ హైకోర్టు చురకలంటించింది. జర్నలిస్టులకు ప్రత్యేక స్వేచ్ఛ ఏదీ లేదని పేర్కొంది. సమాచారాన్ని వ్యాప్తి చేయాల్సిన గొప్ప బాధ్యత జర్నలిస్టులపై ఉందంటూనే పరిధి దాటి వ్యవహరించకూడదని సూచించింది. తన పరువుకు భంగం కలిగించారంటూ ఓ పత్రిక మేనేజింగ్ ఎడిటర్‌పై ఓ వ్యక్తి వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యతిరేకించినవి 8 - తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు సహా బాంబే, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పట్నా, పంజాబ్–హరియాణా (చండీగఢ్) సూచనలు చేసినవి - అలహాబాద్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, ఉత్తరాఖండ్ 4ఆమోదించినవి - సిక్కిం, త్రిపుర నిర్ణయంచెప్పనివి - జార్ఖండ్, రాజస్తాన్, కలకత్తా, జమ్మూకశ్మీర్, గువాహటి హైకోర్టులు