breaking news
alice munro
-
కావడానికి నోబెల్ కిరీటధారి... నడిచింది ఓ ముళ్ళదారి!
‘సమకాలీన కథానికకు దేవేరి’గా స్వీడిష్ ఎకాడెమీ ప్రశంసకు పాత్రమైన కెనడియన్ కథకురాలు యాలిస్ మన్రోకు ‘కథన కుతూహల’ అనే బిరుదు అయాచితంగానే దక్కింది. ఆమె 2013లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న సంగతి చాలామందికి తెలిసిందే. నూట పాతికేళ్ళుగా ఈ పురస్కారం ఇస్తున్నారు. కానీ కేవలం 18 మంది మహిళలకే ఆ పురస్కారం దక్కింది. ఆ క్రమంలో యాలిస్ మన్రోది పదమూడో స్థానం. కెనడా దేశీయుల ఆంగ్ల సాహిత్య సేద్యంలో భాగంగానే, తన సాహిత్య సృజన కూడా సాగాలని ఆమె కోరుకున్నారు. అందులోనూ, ఆ రంగంలో మహిళలు సాగించిన సాగుబడిలో భాగంగానే తన అక్షర కృషి సైతం కొనసాగాలనుకున్నారు యాలిస్. ఈ లక్ష్యాలను జయప్రదంగా సాధించడంలో ఆమె సఫలమయ్యారు. కానీ, ఆ విషయాన్ని సాహిత్య ప్రపంచం గుర్తించడంలో మాత్రం చాలా జాప్యం జరిగిపోయిందని యాలిస్ చిరకాల నేస్తురాలు మార్గరెట్ యాట్వుడ్ అన్నమాట ఓ చేదు నిజం! 1940 దశకం మలిదశలోనే, టీనేజ్ నుంచి, యాలిస్ కథానిక రచనకు పూనుకున్నారు. కానీ దాదాపు రెండు దశాబ్దాల కాలం ఆమె కృషికి తగిన గుర్తింపు దక్కనే లేదు. నాలుగు కాసులు గలగల్లాడించ గల పత్రికాధిపతులే, సంపాదకులుగా చెలామణీ అయిన రోజులవి. కెనడియన్ ప్రచురణ రంగం కూడా టొరాంటోలోని పాతిక ముప్ఫై మంది కుబేరుల చేతుల్లో కేంద్రీకృతమై వుండిన కాలమది.కెనడాలో ‘సొంత మట్టివాసన’ ఉన్న సాహిత్యం పుట్టి– పెరగనియ్యకుండా ఈ ధనపతులూ, పత్రికాధిపతులూ మోకాలు అడ్డు పెడుతుండేవారు. ఈ మగానుభావులే యాలిస్ కథానికలు అచ్చు కావడానికి అనుమతించలేదు. 1950 దశకం ఉత్తరార్ధంలో గానీ ఆమె కథానికలు పత్రికల్లో అచ్చుకాలేదు– 1968లో గానీ ఆమె తొలి కథాసంకలనం పుస్తకరూపంలో పాఠకులకు అందలేదు. అయినా పట్టువదలని కథన కుతూహల యాలిస్ రాయడమూ ఆపలేదు– పత్రికలకూ, ప్రచురణ సంస్థలకూ తన రచనలు పంపడమూ ఆపలేదు!నిజానికి, 1950 దశకంలోనే ‘రచయిత్రులు సాహిత్యరంగంపై దురాక్రమణకు తెగబడ్డార’న్న నింద– గుసగుసల స్థాయిలోనే అనుకోండి!– వారి నెత్తిన వచ్చిపడింది. టొరాంటోకు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో, ఎక్కడో కెనడాకు మరో మూల ఉండే వ్యాంకూవర్ నగరంలో నిశ్శబ్దంగా మనుగడ సాగించే యాలిస్ లాంటి రచయిత్రులు ఎవరికి పట్టేను? అలాంటి రచయిత్రులు సాహిత్యరంగాన్ని దురాక్రమించడం సాధ్యమేనా??1960 దశకం మొదట్లో మాత్రమే యాలిస్ కృషికి కొద్దోగొప్పో గుర్తింపు దక్కింది. ‘సాహిత్య సేద్యానికి సమయం మిగుల్చుకున్న గృహిణి’ శీర్షికతో, ‘వ్యాంకూవర్ సన్’ అనే స్థానిక పత్రిక యాలిస్తో ఓ ఇంటర్వ్యూ ప్రచురించింది. 1968లో యాలిస్ తొలి కథానిక సంకలనం ‘మురిపెపు నీడల సయ్యాట’ను రైయర్సన్ సంస్థ ప్రచురించింది. కెనడాలో అచ్చయ్యే ఆంగ్ల సాహిత్యానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం –‘గవర్నర్ జెనరల్స్ ఎవార్డ్’– ఈ పుస్తకానికి దక్కింది. మరో మూడేళ్ళకు ఆమె రాసిన ‘ముగ్ధలు–మహిళలు’ అనే గొలుసుకట్టు కథానిక సంకలనం వెలువడింది. మరో యేడేళ్ళకు ఆమె రాసిన ‘నీ దృష్టిలో నువ్వెవరివి?’ అనే మరో గొలుసుకట్టు కథానిక సంకలనం వెలువడింది. ఇది ఆమెకి ‘గవర్నర్ జెనరల్స్ ఎవార్డ్’ పురస్కారం రెండోసారి సంపాదించి పెట్టింది. రెండేళ్ళ తర్వాత ‘అడుక్కునే అమ్మాయి’ అనే వేరే టైటిల్‌తో, కెనడాకు బయట వెలువడిన ఇదే పుస్తకం, బుకర్ ప్రైజుకు షార్ట్ లిస్టయింది.ఆ తర్వాతనే, యాలిస్ అంతర్జాతీయ స్థాయిలో ఆదరణకు పాత్రురాలైంది. 1979–82 మధ్యకాలంలో, ఆమె ఆస్ట్రేలియా, చైనా, స్కాండినేవియా దేశాల్లో పర్యటించారు. 1980లోనే ఆమె కొలంబియా– క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయాల్లో ‘రైటర్ ఇన్ రెసిడెన్స్’ హోదాలో ఉన్నారు. అటు తర్వాత ఆమె పరంపరగా కథానికలు రాస్తూ, నాలుగేళ్ళకు ఓ సంకలనం చొప్పున ప్రచురిస్తూ పాఠకలోకంపై పట్టు బిగించారు. ప్రపంచమంతటా ప్రముఖ పత్రికల్లో, ఆమె కథానికల తొలి ప్రతులు అచ్చవుతూ వచ్చాయి. ఈ క్రమానికి శిఖరాయమానంగా 2013లో యాలిస్ మన్రో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నారు!యాలిస్ మన్రో వ్యక్తిగత జీవితం, ఆమె సాహిత్య మూర్తిమత్వాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసింది. ఆ మేరకే దాన్ని మనమిక్కడ ప్రస్తావించుకుందాం. యాలిస్ తల్లి, యాన్ టీచర్‌గా పనిచేస్తూ, ఇంటిల్లిపాది మీదా కర్రపెత్తనం సాగించేది. భర్తచేత పిల్లల్ని తన్నించడం ఆమెకి నిత్యకృత్యం. యాలిస్ బాల్యాన్ని, ఆర్థిక మాంద్యం మట్టేసింది. అలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలనే, జేమ్స్ మన్రోను పెళ్ళాడి ఎగిరిపోయింది యాలిస్. ముగ్గురు కూతుళ్ళ తల్లిగా చాలీచాలని ఆదాయంతో రెండు దశాబ్దాల పాటు అవస్థ పడింది. ఆ పెళ్ళి పెడాకులయ్యాక, నడివయసులో జెరాల్డ్ ఫ్రేమ్లిన్ ఆమె జీవితంలో ప్రవేశించాడు. ఆ దాంపత్యమూ సవ్యంగా సాగలేదు! అతగాడి విశృంఖల కామప్రవృత్తి కారణంగా, యాలిస్ కూతుళ్ళకూ– నేస్తాలకూ కూడా దూరమైంది. ఇవన్నీ ఆమెకి మానసిక– నరాల వ్యాధులను ప్రసాదించాయి. చివరికి, తాను గెలుచుకున్న నోబెల్ సాహిత్య పురస్కారం అందుకునేందుకు సైతం ఆమె ఆరోగ్యం సహకరించలేదు. యాలిస్ చిరకాల నేస్తం, మార్గరెట్ యాట్వుడ్ అన్నట్టుగా ‘యాలిస్ విజయపథం కంటక మయమై’ ముగిసింది. ఎంతటివారికైనా, ‘శాంతము లేక సౌఖ్యము లేద’ని యాలిస్ మన్రో మరోసారి రుజువు చేశారు! మందలపర్తి కిషోర్ -
ఆలిస్ మన్రో
ఆధునిక చెహోవ్ అనిపించుకున్న రచయిత్రి ఆలిస్ మన్రో. 1931లో కెనడాలో జన్మించారు. అసలు పేరు ఆలిస్ యాన్ లెయిడ్‌లా. వాళ్ల నాన్న నక్కలను పెంచేవాడు. వాటి తోలుకు అప్పట్లో మంచి గిరాకీ ఉండేది. డిమాండ్ పడిపోయాక, కుటుంబం టర్కీ కోళ్ల వైపు మళ్లింది. ఈ వాతావరణం ఆలిస్ కథల్లో కనిపిస్తుంది. ఆలిస్ కూడా వెయిట్రెస్గానూ, పొగాకు తోటల్లోనూ, గ్రంథాలయ గుమస్తాగానూ పనిచేసింది. యూనివర్సిటీ సహవిద్యార్థి జేమ్స్ మన్రోను పెళ్లి చేసుకుని, ఆలిస్ మన్రో అయిన తర్వాత దంపతులిద్దరూ ‘మన్రోస్ బుక్స్’ పేరిట బుక్ స్టోర్ తెరిచారు. తర్వాతి కాలంలో అది ప్రతిష్టాకరమైన పుస్తకాలయంగా పేరు తెచ్చుకుంది. కొత్తలో అందులోని పుస్తకాలు కొన్ని చదివి, తాను ఇంతకంటే బాగా రాయగలనని రాయడం ప్రారంభించానని వ్యాఖ్యానించారు. కానీ ఆమె టీనేజ్లోనే రాయడం మొదలైంది. 1968లో ఆమె తొలి కథా సంపుటి వెలువడినప్పుడు సానుకూల స్పందన వచ్చింది. కథకు కొత్త నిర్మాణపద్ధతిని ఇచ్చిన మన్రో విస్తృతంగా రాస్తూ, సుమారు నాలుగేళ్లకో కథా సంపుటి వెలువరిస్తూ వచ్చారు. మానవ సంక్లిష్టతను అత్యంత సరళంగా ఆవిష్కరించే తీరు విమర్శకుల మెప్పు పొందింది. ఆమె కొన్ని కథలు సినిమాలుగా కూడా తీశారు. 2013లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. పాత కథకే కొత్త వెర్షన్ రాయడం ఆలిస్ ప్రత్యేకతల్లో ఒకటి. -
ఎలైస్ మన్రోకు సాహిత్యంలో నోబెల్
కెనడా చెహోవ్‌గా గుర్తింపు పొందిన రచయిత్రి సాహిత్యంలో నోబెల్ పొందిన 13వ మహిళ... ఈ బహుమతి పొందిన తొలి కెనడా మహిళగా ఘనత స్టాక్‌హోమ్: ప్రముఖ కెనడా రచయిత్రి ఎలైస్ మన్రో (82) సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. స్వీడిష్ అకాడమీ మన్రోను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటించింది. కథా రచయిత్రిగా ప్రఖ్యాతి పొందిన ఎలైస్ మన్రోను స్వీడిష్ అకాడమీ సమకాలీన కథానికా నిష్ణాతురాలిగా అభివర్ణించింది. కథా రచనలో ఆమె కనపరచిన మానసిక వాస్తవికత, స్పష్టత సాటి లేనివంటూ శ్లాఘించింది. ఎలైస్ మన్రోను కొందరు విమర్శకులు కెనడియన్ చెహోవ్‌గా అభివర్ణిస్తారు. చిన్న చిన్న పట్టణాల్లోని సామాజిక వాతావరణాన్ని, మానవ సంబంధాలను, నైతిక సంఘర్షణలను తన కథల్లో చిత్రించిన ఎలైస్ మన్రో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో 13వ మహిళ కావడంతో పాటు మొట్టమొదటి కెనడా మహిళ కావడం విశేషం. స్టాక్‌హోంలో డిసెంబర్ 10న జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ బహుమతి కింద 8 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు (రూ.7.64 కోట్లు) అందుకోనున్నారు. ఇదిలా ఉండగా, తనకు నోబెల్ బహుమతిని ప్రకటించడంపై ఎలైస్ మన్రో హర్షం వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతి కోసం తన పేరు పరిశీలనలో ఉన్న విషయం తనకు తెలుసునని, అయితే, తనకు బహుమతి లభిస్తుందని ఊహించలేదని ఆమె అన్నారు. కథల కాణాచి కెనడా రచయిత్రి ఎలైస్ మన్రోను కథల కాణాచిగా చెప్పుకోవచ్చు. కథా వస్తువు కంటే కథ చెప్పే తీరుకే ప్రాధాన్యమిచ్చే శైలితో ఆమె అనతి కాలంలోనే సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఓంటారియోలోని వింగ్‌హామ్ ప్రాంతంలో 1931 జూలై 10న ఎలైస్ జన్మించారు. ఆమె తండ్రి రాబర్ట్ ఎరిక్ లెయిడ్‌లా ఒక రైతు. తల్లి ఏన్ క్లార్క్ లెయిడ్‌లా ఉపాధ్యాయురాలు. వెస్టర్న్ ఓంటారియో వర్సిటీలో ఇంగ్లీష్ ప్రధానాంశంగా చదువుకుంటున్న కాలంలోనే 1950లో ‘ది డెమైన్షన్స్ ఆఫ్ ఏ షాడో’ పేరిట తొలి కథ రాశారు. వర్సిటీలో చదువుకుంటూనే వెయిట్రెస్‌గా, లైబ్రరీ క్లర్క్‌గా పనిచేశారు. పొగాకు తోటల్లోనూ పొగాకు కోసే పని చేశారు. వర్సిటీని విడిచిపెట్టాక 1951లో జేమ్స్ మన్రోను పెళ్లాడారు. తర్వాత 1963లో మన్రో దంపతులు విక్టోరియాకు తరలిపోయారు. అక్కడే ‘మన్రో బుక్స్’ ప్రచురణ సంస్థను ప్రారంభించారు. జేమ్స్ నుంచి 1972లో విడిపోయాక, భౌగోళిక శాస్త్రవేత్త గెరాల్డ్ ఫ్రెమ్లిన్ను 1976లో పెళ్లాడారు. ‘డాన్స్ ఆఫ్ ది హ్యాపీ షేడ్స్’ పేరిట 1968లో వెలువరించిన తొలి కథా సంపుటి ఎలైస్ మన్రోకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ పుస్తకానికి కెనడా గవర్నర్ జనరల్ అవార్డు లభించింది. ఆమెకు 2009లో మాన్ బుకర్ బహుమతి కూడా లభించింది. ‘ది న్యూయార్కర్’, ‘ది అట్లాంటిక్ మంత్లీ’, ‘గ్రాండ్ స్ట్రీట్’, ‘ది పారిస్ రివ్యూ’ వంటి పత్రికలు ఆమె రచనలను విరివిగా ప్రచురించాయి. 1980, 90లలో ఎలైస్ దాదాపు ప్రతి నాలుగేళ్లకు ఒక కథా సంపుటి చొప్పున వెలువరించారు. ఇవన్నీ ఆమెకు పలు అవార్డులు తెచ్చిపెట్టాయి.


