breaking news
AK Mittal
-
సురక్షిత ప్రయాణానికి భద్రతా సిబ్బందే కీలకం
రైళ్ల నిర్వహణకు సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్ వెన్నెముక ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ సదస్సులో రైల్వేబోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణలో, లక్షలాది మందికి సురక్షితమైన, పూర్తి భద్రత కలిగిన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో సిగ్నలింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ (ఎస్‌అండ్‌టీ) విభాగం విధి నిర్వహణే అత్యంత కీలకమైందని రైల్వేబోర్డు చెర్మైన్ ఏకే మిట్టల్ అన్నారు. ప్రపంచంలోనే రైల్వే నెట్‌వర్క్‌ను మించింది మరొకటి లేదని.. దీని ద్వారా ప్రజలు పూర్తి భద్రతతో ప్రయాణం చేయగలరని అన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో ‘భారతీయ రైల్వేలో భద్రత-సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్ విభాగం పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన రైల్వే భద్రతా విభాగం కార్మికులకు పిలుపునిచ్చారు. రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా మాట్లాడుతూ.. భద్రతా విభాగంలో పని చేస్తున్న సాంకేతిక సిబ్బంది తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి, అంచనా వేసుకోవడానికి ఇలాంటి సదస్సులు స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ.. భద్రతా విభాగంలో పని చేస్తున్న ఎస్‌అండ్‌టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రైల్వేబోర్డు అదనపు సభ్యులు అఖిల్ అగర్వాల్, దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఏకే గుప్తా, ఎన్ఎఫ్ఐఆర్ అధ్యక్షులు గుమన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆదాయం పెంచుకోవడమే ప్రాజెక్టుల లక్ష్యం ఈ సదస్సు కంటే ముందు సికింద్రాబాద్ రైల్‌నిలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో రైల్వేబోర్డు చైర్మన్ మిట్టల్ మాట్లాడారు. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే కేంద్ర ఆసుపత్రిలో 15 పడకల డయాలసిస్ విభాగాన్ని ప్రారంభించారు. -
‘టీకాస్’ సఫలం
తాండూరు: ఓ ట్రాక్‌లో రైలు ఆగి ఉంది.. అదే ట్రాక్‌లో ఎదురుగా మరో ప్రత్యేక రైలు సుమారు వంద కి.మీ. వేగంతో దూసుకొచ్చింది.. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్న ఇతర అధికారులు, సామాన్య ప్రయాణికులు ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తున్నారు.. ఇంతలోనే ప్రత్యేక రైలు ఇంజిన్‌లోని ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం (ఏటీపీఎస్)తో ఆగి ఉన్న రైలుకు సుమారు 100-150 మీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ ప్రయోగానికి తాండూరు రైల్వేస్టేషన్ వేదికైంది. సోమవారం రైల్వే బోర్డు సభ్యుడు ఏకే మిట్టల్ (ఎలక్ట్రికల్), బోర్డు అడిషినల్ మెంబర్లు మహేష్‌మంగళ్ (టెలీకమ్యూనికేషన్స్), మనోహరన్ (సిగ్నల్స్)తోపాటు సికింద్రాబాద్ డీఆర్ఎం ఎస్కే మిశ్రా, వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ప్రయోగాలను పరిశీలించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వారంతా తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఏటీపీఎస్ (టీకాస్) ప్రయోగాలు చేస్తున్న భారత రైల్వే పరిశోధన సంస్థ (ఆర్డీఎస్ఓ) అధికారి మన్సుఖనితో కలిసి రైలు ఇంజిన్‌లో తాండూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలోని కుర్గుంట, బషీరాబాద్‌లోని నవాంద్గీ, మంతట్టి రైల్వేస్టేషన్లలో ఎదురెదురుగా, పక్కపక్క ట్రాక్‌ల్లో రైళ్లను నడిపి ఏటీపీఎస్ పనితీరును క్షుణ్నంగా పరిశీలించారు. దాదాపు మూడు రైల్వేస్టేషన్ పరిధిలోని నాలుగు బ్లాక్ సెక్షన్లలో రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ఏటీపీఎస్లోని 32 ఫీచర్స్‌ను స్టడీ చేశారు. డ్రైవర్ చేయలేనిది.. ప్రత్యేక రైలు వంద కి.మీ. వేగంతో వెళ్తుండగా.. రెడ్‌సిగ్నల్ వేయడంతో డ్రైవర్ రైలు వేగాన్ని నియంత్రించలేకపోయాడు. రైలులో ఉన్న ఏటీపీఎస్ ఆటోమెటిక్‌గా వేగాన్ని నియంత్రించి రైలును సుమారు 100 మీటర్ల దూరంలోనే ఆపేసింది. సిగ్నల్స్, లెవల్‌క్రాసింగ్‌లు తదితర చోట్ల ఏటీపీఎస్ పనితీరును, ఇంజిన్‌లోని డ్రైవర్ ఇంటర్పేస్ మానిటర్లో సిగ్నల్ ఇండికేషన్స్ తదితర అంశాలను బోర్డు సభ్యులు స్వయంగా గమనించారు. ప్రయోగాలు సంతృప్తికరం.. అనంతరం రైల్వే బోర్డు అదనపు సభ్యుడు మహేష్‌మంగళ్ తాండూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రయోగాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లింగంపల్లి-వాడీ, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య ఏటీపీఎస్‌ను మార్చి, జూన్లలో అమల్లోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించి రెండు సెక్షన్ల మధ్య టవర్లు, ఇతర సాంకేతిక పరికరాలను అమర్చుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే సుమారు 28 రైల్వేస్టేషన్లలో టవర్లు, ఇతర పరికరాలను అమర్చడం పూర్తయిందన్నారు. రెండేళ్లుగా చేసిన ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయన్నారు. కార్యక్రమంలో వివిధ వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు, మూడు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.