వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని పార్లమెంటు స్ట్రీట్ పీఎస్ నుంచి విడుదల చేశారు.
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని పార్లమెంటు స్ట్రీట్ పీఎస్ నుంచి విడుదలైయ్యారు. సమైక్య ధర్నా ముగిసిన అనంతరం వైఎస్ జగన్ పిలుపు మేరకు సమైక్యవాదులు పార్లమెంట్ వరకు కాలినడకకు బయల్దేరిన క్రమంలో ప్రభుత్వ బలగాలు వారిని అడ్డుకున్నాయి. జగన్ ను అరెస్టు చేసి ప్రజల ఆకాంక్షను నీరుగార్చేందుకు కుటిలయత్నం చేశాయి. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ కు తమను వెళ్లనివ్వకపోవడాన్ని జగన్ ఖండించారు. అనంతరం ప్రభుత్వ చర్యలకు నిరసనగా పార్టీ శ్రేణులు, సమైక్య వాదులు రోడ్డుపైనే బైఠాయించి నిరసనను మరింత ముమ్మరం చేశారు. దీంతో జగన్ ను పార్లమెంట్ పీఎస్ నుంచి విడుదల చేశారు.
సమైక్య వాదులు పార్లమెంటు కు వెళ్లే క్రమంలో పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీ చేపట్టిన సమైక్య ధర్నా కార్యక్రమంలో జగన్ ప్రసంగం ముగిసిన తరువాత కాలినడకన పార్లమెంటుకు బయలు దేరారు. ఎక్కడ వరకు అనుమతిస్తే అక్కడ వరకు వెళదామని జగన్ పిలుపు ఇవ్వడంతో ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ఆయన వెంట నడిచారు. ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం సాగింది. ఢిల్లీ వీధులన్నీ సమైక్య నినాదాలతో దద్దరిల్లాయి. కేంద్రానికి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.