
దావూద్ ఇంట్లో ప్రముఖ నటుడికి పార్టీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ దుబాయిలో దావూద్‌ను కలిశాడట.
ముంబై: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో సూత్రధారి అయిన దావూద్ పాకిస్థాన్లో రహస్యంగా తలదాచుకుంటున్నాడు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ దుబాయిలో దావూద్‌ను కలిశాడట. దావుద్ ఇంటికి టీ పార్టీకి కూడా వెళ్లాడు. అయితే ఇది జరిగి దాదాపు 30 ఏళ్లు కావస్తోంది. ఈ విషయాలను రిషి కపూర్ స్వయంగా వెల్లడించాడు.
'సినిమా నటుడిగా ఉన్న పేరు ప్రతిష్టలు గొప్పవారితో పాటు అనుమానాస్పద వ్యక్తులనూ కలిసే చేస్తాయి. నేను కలిసిన ఇలాంటి వ్యక్తుల్లో దావూద్ కూడా ఉన్నాడు. 1988లో నేను దుబాయికి వెళ్లాను. నా క్లోజ్ ఫ్రెండ్ బిట్టూతో కలసి దుబాయి విమానాశ్రయంలో దిగిన తర్వాత ఓ పరిచితుడు నన్ను కలిసి ఫోన్‌లో మాట్లాడాల్సిందిగా కోరాడు. దావూద్ మీతో మాట్లాడాలని కోరాడని చెప్పాడు. 1993లో ముంబై బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకోకముందు నాటి సంగతి ఇది. అప్పటికి దావూద్ రాష్ట్రానికి శత్రువు కాదు. దీంతో నేను దావూద్‌తో మాట్లాడాను. దుబాయికి వచ్చినందుకు అయన స్వాగతం పలికాడు. ఏ అవసరం వచ్చినా తానున్నాని గుర్తుపెట్టుకోమన్నాడు. అంతేగాక ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. మేం బస చేసిన హోటల్‌కు కారు పంపగా నేను ఆయన ఇంటికి టీ పార్టీకి వెళ్లాను. కారు చాలా ప్రాంతాలు తిరిగి దావూద్ ఇంటికి చేరుకుంది. దీంతో దావూద్ ఇల్లు కచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందో గుర్తు పెట్టుకోలేకపోయాను. మద్యం తాగనని, అలాగే సర్వ్ కూడా చేయనని దావూద్ నాతో చెప్పాడు. అందుకే టీ పార్టీకి ఆహ్వానించానని అన్నాడు. ఆయన ఇంట్లో నాలుగు గంటలు గడిపాను. టీ, బిస్కట్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ.. నేను చిన్న చిన్న నేరాలు మాత్రమే చేశానని, ఎవరినీ చంపలేదని చెప్పాడు. ఆ తర్వాత 1989లో దుబాయిలో దావూద్‌తో మరోసారి మాత్రమే కలిశాను. అప్పుడు నా వెంట నా భార్య నీతూ కూడా ఉంది. దావూద్ చుట్టూ పదిమంది బాడీగార్డులున్నారు. ఏదైనా సాయం కావాలంటే అడగమని చెబుతూ మొబైల్ నెంబర్ ఇచ్చాడు. అయితే ఆయన ఆఫర్‌ను నేను తిరస్కరించాను. నేను నటుడినని, ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటానని చెబితే ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దావూద్‌తో ఎప్పుడూ మాట్లాడలేదు' అని రిషి కపూర్ చెప్పినట్టు జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది.