బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రి ఆరా
ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగంచిప్రోలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ధర్మేంద్ర ప్రధాన్ ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగంచిప్రోలు సమీపంలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ధర్మేంద్ర ప్రధాన్ ఆరా తీశారు. ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి ఈ బస్సు బయల్దేరడంతో.. ఒడిషాకు చెందిన ప్రధాన్, తన రాష్ట్రం వారి క్షేమ సమాచారాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఒడిషా వారందరినీ గుర్తించి, వారికి తగిన చికిత్స అందించి, మళ్లీ జాగ్రత్తగా వారి స్వస్థలాలకు తిప్పి పంపాలని సూచించారు.
బస్సు ప్రమాదంలో 14 మంది మరణించడానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. రెండు కల్వర్టులకు మధ్య ఉన్న ఎత్తయిన ప్లాట్‌ఫాం మీదకు బస్సు వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తించినా, కనీసం బ్రేక్ వేసినట్లు కూడా రోడ్డు మీద గుర్తులు లేవని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం, బహుశా నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తమకు లిస్టు వచ్చిందన్నారు.