అప్పుల బాధతో ఇద్దరు రైతులు అనంతపురం జిల్లాలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు.
గుత్తి రూరల్/శెట్టూరు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు అనంతపురం జిల్లాలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామానికి చెందిన రైతు నడిపన్న(51) సోమవారం ఉదయం పొలానికి వెళ్లి తీవ్ర వర్షాభావ పరిస్ధితులతో ఎండి పోతున్న పంటలను చూసి ఇంటికి వచ్చాడు. ఇక ఈ ఏడాది కూడా పంట దిగుబడులు రాకపోతే రూ.8 లక్షల అప్పులు తీర్చలేనేమోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో శెట్టూరు మండలం మాలేపల్లిలో రైతు కమల్‌రాజు (43) రూ.2 లక్షల మేర ప్రైవేటుగా అప్పులు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పాలుపోక సోమవారం సాయంత్రం ఇంట్లో ఉట్టికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి పదేళ్ల వయసులోపు ఇద్దరు పిల్లలతోపాటు భార్య ఉన్నారు.