ఇదొక మైలురాయి: ప్రణబ్‌ముఖర్జీ

ఇదొక మైలురాయి: ప్రణబ్‌ముఖర్జీ


న్యూఢిల్లీ: అరుణ గ్రహ రహస్యాలను చేధించేందుకు ఉద్దేశించిన మార్స్ ఆర్బిటార్ మిషన్(మంగళయాన్) ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హర్షం వ్యక్తంచేశారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మంగళవారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌కు సందేశం పంపించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయని, ఈ విజయం మరింతమంది శాస్త్రజ్ఙులకు స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మార్స్ మిషన్ విజయవంతం కావడం సంతోషకరమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తెలిపారు.

 

 చరిత్రాత్మకం: ప్రధాని

 మార్స్ మిషన్ ప్రయోగం సఫలం కావడాన్నిచరిత్రాత్మక విజయంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అభివర్ణించారు. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌కు ఆయన స్వయంగా ఫోన్ చేసి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు.  అనంతరం రాధాకృష్ణన్, ఆయన సహచరులకు అభినందనలు తెలుపుతూ ప్రధాని ఒక సందేశం పంపించారు. ‘అంతరిక్ష వాహక నౌకల ప్రయోగంలో ఇస్రో అద్భుత నైపుణ్యం కలిగి ఉందనడానికి ఈ ప్రయోగం ఒక నిదర్శనం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో మైలురాయిగా నిలిచే ఈ మార్స్ మిషన్ భవిష్యత్ అంచెలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు. భారతీయులంతా గర్విస్తున్న అద్భుత వైజ్ఞానిక విజయం ఇదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు.

 

 భూమి పుత్రుడు అంగారకుడు!


 అంగారకుడిని భూగ్రహానికి కుమారుడిగా భారతీయులు భావిస్తారని, ఆ గ్రహంపై జీవం మనగలిగే పరిస్థితులున్నాయా, లేవా అన్న విషయం ఈ ప్రయోగం ద్వారా తేలుతుందని బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి అన్నారు.

 

 సీఎం, ఆర్థిక మంత్రి అభినందనలు

 పీఎస్‌ఎల్‌వీసీ-25 ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ రాధాకృష్ణన్, ఇతర శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలోని  కీలకమైన నాలుగు దశలు పూర్తి చేసుకుని విజయవంతంగా మార్స్ మిషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చడంతో భారత అంగారక యాత్ర 300 రోజుల ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైందని సీఎం కార్యాలయం పేర్కొంది.

 

 ‘ఇస్రో’కు జగన్ అభినందనలు

 అంగారక గ్రహ యాత్రలో భాగంగా మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు శాస్త్రవేత్తల బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. తొలి ప్రయత్నంలోనే అపూర్వ విజయం సాధించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు తమ అసమాన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని ఆయన కొనియాడారు. ఈ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం ద్వారా ప్రపంచంలో అంగారక యాత్రను చేపట్టిన నాలుగోదేశంగా భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఇస్రో.. భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని జగన్ ఒక సందేశంలో ఆకాంక్షించారు.

 

 మరిన్ని ప్రయోగాలు జరపాలి: బాబు

 పీఎస్‌ఎల్వీ సీ-25ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను చంద్రబాబు అభినందించారు. అంతరిక్ష రంగంలో భారత్ విజయపతాకను రెపరెపలాడించారని వారిని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు జరపాలని ఓ ప్రకటనలో అభిలషించారు. కాగా.. పీఎస్‌ఎల్‌వీసీ 25 ప్రయోగం విజయవంతం కావడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తంచేశారు.

 

 ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే..

 ‘‘మార్స్ మిషన్ పూర్తిగా అర్థరహితం. మార్స్‌పై రోవర్ ప్రయోగం నిర్వహించిన నాసా అంగారకుడిపై జీవం ఆనవాలే లేదని బహిరంగంగా ప్రకటించింది. అయినప్పటికీ.. మార్స్ మీద జీవాన్వేషణ కోసం వెళుతున్నామని ప్రకటన చేయటం.. ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే.’’     - మాధవన్‌నాయర్, ఇస్రో మాజీ చైర్మన్




 దీపావళి టపాసుల ఖర్చులో పదో వంతే...

 ‘‘మార్స్ మిషన్‌పై రూ. 450 - 500 కోట్లు ఖర్చు చేశారంటూ భారతీయులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇది ఖచ్చితంగా భారత్ గర్వించదగ్గ రోజు. పది అడుగులకన్నా ఎత్తుకు వెళ్లని దీపావళి టపాసుల కోసం ఒక్క రోజులో రూ. 5,000 కోట్లు ఖర్చుపెట్టటానికి భారతీయులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అందులో పదో వంతు అంగారకుడి వరకూ వెళ్లటానికి ఖర్చు చేస్తే ఎందుకింత గగ్గోలు?’’

 - యు.ఆర్.రావు, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ పాలక మండలి చైర్మన్




 ఇస్రోకు కీలక మైలురాయి..

 ‘అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకునే యోగ్యత ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు పెరుగుతుంది. ఇస్రోకు ఇది చాలా కీలక మైలురాయి’

 - కే కస్తూరిరంగన్, ఇస్రో మాజీ చైర్మన్

 

 మాపై ఆధిక్యం చూపేందుకే: చైనా

 అంతరిక్షంలో శాంతిని నెలకొల్పేందుకు కలిసి పనిచేద్దామని అంతర్జాతీయ సమాజానికి చైనా పిలుపునిచ్చింది. భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్ విజయవంతం కావడంపై చైనా స్పందించింది. ‘అంతరిక్షం మానవాళికందరికీ చెందుతుంది. దానిపై ప్రయోగాలు చేసేందుకు అన్ని దేశాలకు హక్కుంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్‌లీ వ్యాఖ్యానించారు. అయితే, చైనా అధికారిక మీడియా మాత్రం తమ దేశ అంతరిక్ష  ప్రయోగాలపై పైచేయి సాధించేందుకే భారత్ ఈ ప్రయోగాలు చేస్తోందని విమర్శించింది. చైనా గతంలో చేపట్టిన మార్స్ ప్రయోగం విఫలమైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top