తమిళ కవికి సింగపూర్ మెడలియన్ అవార్డు
భారత సంతతికి చెందిన సింగపూర్ వాసి, కవి,రచయిత కేటీఎం ఇక్బాల్ (74)కు ప్రతిష్టాత్మకమైన ‘కల్చరల్ మెడలియన్’ అవార్డును సింగపూర్ ప్రకటించింది.
సింగపూర్: భారత సంతతికి చెందిన సింగపూర్ వాసి, కవి,రచయిత కేటీఎం ఇక్బాల్ (74)కు ప్రతిష్టాత్మకమైన ‘కల్చరల్ మెడలియన్’ అవార్డును సింగపూర్ ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు 80 వేల సింగపూర్ డాలర్లు, ప్రశంసా పత్రం అందజేస్తారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సింగపూర్ అధ్యక్షుడు టోనీ తాన్ కెంగ్ యాం చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇక్బాల్ అందుకుంటారు.
కేటీఎం ఇక్బాల్ 11 సంవత్సరాల వయస్సులో తన తండ్రితో పాటు దక్షిణ భారతంలోని కడయనల్లూర్ నుంచి 1951లో సింగపూర్ వలస వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పని చేసిన ఇక్బాల్ సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేశారు. కవిగా, రచయితగా మంచి గుర్తింపు పొందారు. తనకు లభించిన 80 వేల డాలర్లను సాహిత్యాభివృద్ధికి ఉపయోగిస్తానని ఇక్బాల్ ప్రకటించారు.


