కేసీఆర్ మోజు వల్లే ఉప ఎన్నిక

కేసీఆర్ మోజు వల్లే ఉప ఎన్నిక - Sakshi


స్టేషన్ ఘన్‌పూర్ బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి

* టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు

* ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి

 వరంగల్ నుంచి ‘సాక్షి’ప్రతినిధి: మంత్రిమండలిలో తనకు తొత్తుగా ఉండే వ్యక్తిని పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోజుపడి అహంకారంతో తీసుకున్న నిర్ణయం వల్లే వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు.



అందువల్ల ఉప ఎన్నికలో కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని మరచిపోయారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణకు బదులు ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.



రాష్ట్రంలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మండుటెండలో పాదయాత్ర చేశారని పొంగులేటి గుర్తుచేశారు. ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అనే తరహాలో పరిపాలించారన్నారు.



2004 కంటే మందు ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్‌ఎస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు తెరమీదకు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని, ఆయనకు ఓటు అడిగే అర్హతే లేదని పొంగులేటి విమర్శించారు. ప్రాణం పోసిన నేత కుటుంబాన్నే జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమని, ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయవద్దని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నేరవేర్చకుండా రాష్ట్రంలో కుటుంబ పాలనను తెచ్చిందని మండిపడ్డారు.



తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ అభిమానులకు భరోసా కల్పించడం కోసం వైఎస్ జగన్ వచ్చారని...ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top